Breaking News

15/10/2019

ఎదురుదాడికే సిద్ధమౌతున్న కేసీఆర్

హైద్రాబాద్, అక్టోబరు 15 (way2newstv.in)
ఒక పక్క ప్రతిష్టాకరమైన హుజూర్ నగర్ ఉపఎన్నిక. మరో పక్క కంట్లో నలుసులా పంటిలో రాయిలా ఆర్టీసీ కార్మికుల ఉద్యమం. ఇదే అదనుగా విపక్షాలు అన్ని ఏకమై ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి కేసీఆర్ పై యుద్ధం మొదలు పెట్టడం. మరో పక్క కలిసి వస్తుందనుకున్న సిపిఐ సైతం ఆర్టీసీ పై ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే తమ నిర్ణయం మార్చుకుంటామన్న బెదిరింపులు. ఇన్ని ముప్పిరిగొన్నా గులాబీ బాస్ మాత్రం వెనక్కి తగ్గక పోవడంతో తెలంగాణ ఉపఎన్నిక పోరు ఉత్కంఠ కొనసాగుతోంది.ఉపఎన్నిక సమయంలో సరిగ్గా ఆర్టీసీ ఉద్యమం రావడం గులాబీ పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. 
ఎదురుదాడికే సిద్ధమౌతున్న కేసీఆర్

దాంతో ఎన్నడూ లేనిది దసరా సెలవులను సైతం పొడిగించి ప్రజా వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం ఒకటి చేసింది టి సర్కార్. దాంతో బాటు పార్టీ శ్రేణులను విపక్షాలపై ఎదురుదాడి చేయాలని ఆదేశించింది. బిజెపి కానీ కాంగ్రెస్ కానీ వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థలను ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేయలేదని టి సర్కార్ లోని మంత్రులు ఎదురు దాడి మొదలు పెట్టారు. అక్కడో విధానం ఇక్కడో విధానం ఎలా చెబుతారంటూ నిలదీశారు.ఆర్టీసీ ఉద్యమం పై సర్కార్ మొండి వైఖరి అదే విధంగా కార్మికులు సైతం మెట్టు దిగి రాకపోవడంతో సామాన్యులు నలిగిపోతున్నారు. ప్రవేటు రావాణాను ఆశ్రయించక తప్పకపోవడంతో వారికి భారీగా జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఫలితంగా క్రమంగా ప్రజల్లో సర్కార్ వైఖరి పట్ల సోషల్ మీడియా లో వ్యతిరేకత పెల్లుబికుతుంది. చర్చల ద్వారా ఇరు వర్గాలు సమస్యకు చెక్ పెట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే అటు కేసీఆర్ ఇటు యూనియన్లు విపక్షాల మొండి వైఖరి ఎటు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో పక్క ఉద్యమం హింసాత్మకంగా మారుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది.

No comments:

Post a Comment