Breaking News

25/10/2019

మళ్లీ ప్రాంతీయ పార్టీలకు ఊపిరి

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (way2newstv.in)
దేశంలో ప్రాంతీయ పార్టీల శకం ముగిసిందని, వాటికి భవిష్యత్తు లేదంటూ జాతీయ పార్టీలు పదే పదే చేస్తున్న వాదనల్లో పసలేదని మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలతో అవగతమవుతుంది. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల్లో చతికలపడ్డ కాంగ్రెస్ పని అయిపోయిందని భావిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు ఆ పార్టీకి కొంత ఊపిరిపోశాయి. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను కమలదళం చేజిక్కించుకోలేకపోయింది. కమలనాథుల ఆశలకు కొంతమేర గండిపడినా, మిత్రపక్షమైన శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీ శివసేనపై ఆధారపడక తప్పని పరిస్థితి ఎదురయ్యింది.
మళ్లీ ప్రాంతీయ పార్టీలకు ఊపిరి

హరియాణాలో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంది. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కువ భాగం ఫలితాలు అధికార పార్టీలకే అనుకూలంగా వచ్చాయి. మొత్తం 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలే పైచేయి సాధించాయి. అయితే, ఐదు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఇవి ఉండటం గమనార్హం.మహారాష్ట్రలో సొంతంగా అధికారంలో రావాలన్న కమలనాథుల ఆశలకు గండిపడింది. ఇక్కడ బీజేపీ-శివసేన కూటమికి పవార్‌ తన పవర్‌ ఏంటో చూపించారు. అధికారం దక్కకపోయినా గతం కంటే ఎన్సీపీ ఎక్కువ సీట్లు సాధించింది. ఎన్నికలకు ముందు పలువురు నేతలు పార్టీని వీడటంతో కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకత్వ లోపంతో ప్రచారంలో ఆ పార్టీ దూసుకెళ్లలేకపోయింది. ఇలాంటి తరుణంలో పవార్‌ ముందుకొచ్చి వయసును లెక్కచేయకుండా పలుసభల్లో పాల్గొన్నారు.సోనియా, ప్రియాంక గాంధీలు మహారాష్ట్ర ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండగా, రాహుల్ కేవలం ఐదు చోట్ల మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి అన్నీ తానై ముందుండి నడిపించిన పవార్.. కేవలం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలకు కొత్త ఊపిరి పోశారు. సరైన వ్యూహాలతో బరిలో దిగితే బీజేపీని ధీటుటా ఎదుర్కొవచ్చని పవార్ నిరూపించారు. శరద్‌ పవార్‌ మేనల్లుడు అజిత్‌ పవార్‌ మహారాష్ట్రలోని బారామతిలో 1.65 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీ తన పట్టు నిలుపుకుంది.హరియాణాలోనూ కాషాయ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలనూ చేజిక్కించుకున్న బీజేపీ.. అసెంబ్లీకి వచ్చేసరికి ఓట్లను గణనీయంగా కోల్పోయింది. దీంతో ఆ పార్టీ అక్కడ 40 స్థానాలకు మాత్రమే పరిమితమై అధికారానికి 6 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 16 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి 31 సీట్లను తన ఖాతాలో వేసుకుంది.హరియాణాలో కింగ్‌మేకర్‌గా జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్‌గా అవతరించింది. ఐఎన్ఎల్డీ నుంచి బహిష్కరణకు గురైన దుష్యంత్ చౌతాలా.. ముత్తాత పేరుతో పార్టీని స్థాపించి పది నెలల్లోనే సత్తా చాటారు. మొత్తం 10 చోట్ల విజయం దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జేజేపీ విజయబావుటా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ మద్దతు కీలకంగా మారింది. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment