Breaking News

09/10/2019

జగన్ పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి

విజయవాడ, అక్టోబరు 9, (way2newstv.in)
ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల తర్వాత వైఎస్ జగన్ పార్టీ ద్వారాలు తెరిచేశారు. వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకుంటున్నారు. నవ్వుతూ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు మింగుడుపడలేదు. నాడు పార్టీని వీడుతూ జగన్ ను అన్న నానా మాటలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాలుగున్నరేళ్లు అధికారం ఉన్నప్పటికీ, పార్టీని బలోపేతం చేసే సమయం ఉన్నప్పటికీ ప్రజల్లో బలం లేని నేతలను జగన్ చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.ముఖ్యంగా విజయసాయిరెడ్డి వ్యవహారశైలిని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. విజయసాయిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. 
జగన్ పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి

జగన్ కు అన్ని కష్టసమయాల్లోనూ ఆయన అండగా నిలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ లెవెల్లో పార్టీకి, జగన్ కు కొంత అనుకూల వాతావరణం ఏర్పరచడంలో విజయసాయిరెడ్డి పడిన శ్రమ ఫ్యాన్ పార్టీ నేతలు ఎవరూ మర్చిపోలేరు. అయితే అదే విజయసాయిరెడ్డిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.బయటకు చెప్పే ధైర్యం లేకపోయినప్పటికీ విజయసాయిరెడ్డి కారణంగా పార్టీ భ్రష్టుపట్టిపోతుందన్న కామెంట్స్ అధికార పార్టీలో విన్పిస్తున్నాయి. ఇటీవల వైసీపీలో చేరిన నేతలందరూ తొలుత విజయసాయిరెడ్డిని సంప్రదించి ఆ తర్వాత జగన్ ద్వారా కండువా కప్పుకున్న వారే. విజయసాయిరెడ్డి ద్వారపాలకుడిగా మారారన్న సెటైర్లు విన్పిస్తున్నాయి. ఆయన ఓకే అంటే పార్టీలో చేరడం సులువు. అందుకే గతంలో పార్టీని వీడిన నేతలందరూ విజయసాయిరెడ్డిని ఇప్పుడు ఐరన్ మ్యాన్ గా అభివర్ణిస్తున్నారు.ఇక జగన్ ను కష్టకాలంలో వదలిపెట్టిన 23 మంది అప్పటి ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు సులువయింది. జూపూడి ప్రభాకర్ లాంటి నేతలనే పార్టీలో చేర్చుకోగా లేంది? ప్రజాబలం ఉన్న తమను జగన్ ఈజీగా చేర్చుకుంటారన్నది వారి అంచనా. అందుకోసమే గతంలో ఎమ్మెల్యే అయి టీడీపీలోకి జంప్ చేసిన 23 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 20 మంది వరకూ జగన్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ చేరికలతో జగన్ కు లాభమెంతో తెలియదు కాని, పార్టీ క్యాడర్ లో మాత్రం జగన్ పై ఇన్నాళ్లూ ఉన్న నమ్మకం మాత్రం సడలిపోతుందనడం మాత్రం వాస్తవం. విభిన్న రాజకీయం చేస్తారనుకున్న జగన్ అందరి రూట్లోనే పయనిస్తున్నారు.

No comments:

Post a Comment