Breaking News

29/10/2019

మహారాష్ట్రలో కొలిక్కిరాని చర్చలు

ముంబై, అక్టోబరు 29 (way2newstv.in)
రెండు పార్టీలూ మిత్రపక్షాలే. కానీ కుదరడం లేదు. శత్రువులనైనా తన గూటికి సులువుగా రప్పించుకునే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర విషయంలో మాత్రం చతికల పడుతోంది. ఎందుకంటే అక్కడ మిత్రపక్షంగా ఉన్న కరడుగట్టిన శత్రువు శివసేన రూపంలో ఉంది. ఈ నెల 24వ తేదీన ఫలితాలను వెలువడినా ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. దీనికి కారణం ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గ కూర్పు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. శివసేన తమ డిమాండ్లకు తలవంచాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ కూడా మౌనంగానే వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది.మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. 
మహారాష్ట్రలో కొలిక్కిరాని చర్చలు

దాదాపు 52 స్థానాలను సంపాదించిన శివసేన తమకు ముఖ్యమంత్రి పదవి రెండున్నరేళ్ల పాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇది కొత్తగా చేస్తున్న డిమాండ్ కాదని, లోక్ సభ ఎన్నికల సమయంలోనూ కుదిరిన ఒప్పందమని చెబుతోంది. అలాగే మంత్రి పదవుల్లోనూ తమకు సగం కేటాయించాలని గట్టిగానే కోరుతోంది. స్వరం పెంచి మరీ అడుగుతోంది. ఇందుకు కారణం చాలా ఏళ్ల తర్వాత శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుండటమే.భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఖచ్చితంగా శివసేనపై ఆధారపడక తప్పని పరిస్థితి. మరో 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని ఫడ్నవిస్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా అది కాని పని అని ఆయనకు తెలియంది కాదు. కొంతకాలం నాన్చి ముఖ్యమంత్రి పదవి తిరిగి తాను చేపట్టాలన్నది ఫడ్నవిస్ ఆలోచనగా ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచన కూడా ఇదే. శివసేన దిగి వచ్చేంత వరకూ వెయిట్ చేయడమే బెస్ట్ అన్నది బీజేపీ నిర్ణయంగా తెలుస్తోంది.ఇక శివసేనకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని, అలాగే శివసేన అభ్యర్థి కూడా ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సంకేతాలు పంపింది. ఎన్డీఏ భాగస్వామి రామదాస్ అథవాలే ద్వారా ఈ సిగ్నల్స్ పంపింది. కానీ శివసేన ఈ ప్రతిపాదనకు అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్ధవ్ థాక్రేతో సహా శివసైనికులందరూ ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా మానసికంగా ఫిక్స్ అయ్యారు. బీజేపీ చర్చలు జరిపినా ఇంకా మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువు దీరడానికి కొంత సమయం పట్టే అవకాశముంది.

No comments:

Post a Comment