Breaking News

16/10/2019

యడ్డీని పట్టించుకోని అధిష్టానం

కర్ణాటక, అక్టోబరు 16 (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అధిష్టానం ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. యడ్యూరప్పకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆయనపై రోజురోజుకూ భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటినుంచే ఈ పరిస్థితి తలెత్తింది. సంకీర్ణ సర్కార్ ను కూల్చివేసేందుకు సహకరించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ తర్వాత మాత్రం యడ్యూరప్పకు మొహం చాటేస్తుంది.ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణకు మోకాలడ్డుతోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే తనను నమ్ముకున్న వారందరికీ కేబినెట్ లో చోటు కల్పించాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. తొలిసారి జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ యడ్యూరప్ప ప్రమేయం ఏమాత్రం లేదు. 
యడ్డీని పట్టించుకోని అధిష్టానం

అంతా అధిష్టానం దగ్గరుండి మంత్రి వర్గ విస్తరణను చేపట్టింది. ఢిల్లీలోనే మంత్రివర్గ జాబితాను రూపొందించింది. యడ్యూరప్ప సూచించిన వారికీ పదవులు తొలి దఫా దక్కలేదు.అలాగే తనకు కౌంటర్ గా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం కూడా యడ్యూరప్ప కు మింగుడుపడలేదు. ఆయన కుటుంబ సభ్యులను దూరంగా పెట్టడానికి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయత్నించింది. సీఎం పేషీలో తమకు అనుకూలురైన వారిని అధిష్టానం నియమించింది. గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోపణలు రావడం వల్లనే ఆయనను కంట్రోల్ చేయడానికి ఈసారి బీజేపీ అధినాయకత్వం ఈరకమైన చర్యలు తీసుకుంది.అంతేకాకుండా కర్ణాటకలో వరదలు సంభవించి విపరీతమైన నష్టం వాటిల్లినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. యడ్యూరప్పకు కేంద్ర నాయకత్వం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప పై రోజురోజుకు పార్టీలో అసంతృప్తి పెరిగిపోతుంది. ఉమేష్ కత్తి, శరత్ బచ్చే గౌడ వంటి బీజేపీ నేతలు యడ్యూరప్ప ను కార్నర్ చేస్తున్నారు. అయినా యడ్యూరప్ప ఓపికతో అధిష్టానం ప్రమేయం కోసం వేచిచూస్తున్నారు. కానీ ఇంతవరకూ బీజేపీ కేంద్రనాయకత్వం అప్పను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది యడ్యూరప్పకు మింగుడుపడటం లేదు.

No comments:

Post a Comment