Breaking News

23/10/2019

నామ్ సదస్సుకు మోడీ గైర్హాజారు

న్యూఢిల్లీ, అక్టోబరు 23, (way2newstv.in)
ఈ ఏడాది అలీనోద్యమ వార్షిక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి బదులు ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హజరవుతున్నారు. అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా అక్టోబరు 25, 26 తేదిల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడం ఇది రెండోసారి. నామ్ సదస్సుకు హాజరుకాని తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం. వెనుజులా వేదికగా 2016లో జరిగిన 17 వ నామ్ సదస్సుకు మోదీ హాజరుకాలేదు. తాజాగా, బాకు సదస్సుకు కూడా ప్రధానికి బదులు వెంకయ్య వెళ్లనున్నారు.బాండుంగ్ సదస్సులో నిర్దేశించిన సమకాలీన ప్రపంచంలోని సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడం’ అనే అంశంపై బాకు సదస్సును నిర్వహిస్తున్నారు. 
నామ్  సదస్సుకు మోడీ గైర్హాజారు

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు ఏర్పడ్డాయి. ఇవి తమ కూటముల్లో చేరాలని వర్ధమాన దేశాలపై ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకుంది. ఈ ఒత్తిడికి లొంగకుండా అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం ఆవిర్భవించింది. దీనికి పితామహుడు భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.అయితే, ప్రస్తుతం నామ్ ప్రాధాన్యత, ప్రయోజనాలు తగ్గాయనే చెప్పుకోవాలి. ఇందులోని సభ్యదేశాలకు విదేశాంగ విధానంలో పూర్తి స్వాతంత్రం ఉంది. దీంతో సభ్యదేశాల వైఖరిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక, 1979 నామ్ శిఖరాగ్ర సమావేశానికి నాటి ప్రధాని చరణ్ సింగ్ కూడా హాజరుకాలేదు. కానీ, ఆయన అప్పటికి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. 2016లో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సభ్యదేశాల మధ్య సంబంధాలు అంత బలంగా లేవని, విశాల ప్రపంచం ఏర్పాటువైపు పయనిస్తున్నాయని అన్నారు.అలీనోద్యమ స్థాయి నుంచి అగ్రగామి దేశంగా భారతదేశం రూపాంతరం చెందుతుందనడానికి ఇది సంకేతం. బాకు శిఖరాగ్ర సదస్సులో ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉగ్రవాదం విషయంలో భారత వైఖరిని బలంగా వినిపించనున్నారు. నామ్ సభ్యులు ఉగ్రవాదం విషయంలో కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా, ఓ కార్యాచరణతో ముందుకెళ్లాలని భారత్ కోరుకుంటోంది. 2016 సదస్సుకు హాజరైన నాటి కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒకప్పుడు వర్ణవివక్ష, వలసవాదంపై నామ్ పోరాడినట్టు ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరాడాలని భారతదేశం కోరుకుంటోందని అన్నారు.

No comments:

Post a Comment