Breaking News

12/10/2019

జనసేనలో ఒంటరవుతున్నారా... సైనికులు ఏమౌతున్నారు

హైద్రాబాద్, అక్టోబరు 12 (way2newstv.in)
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తూనే ఒకటే మాట చెప్పుకున్నారు. తనది పాతికేళ్ళ పార్టీ అని తన రాజకీయ పయనం కూడా సుదీర్ఘమైనదని చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం ఎపుడు అంటే 2009 అని చెప్పాలి. అన్న చిరంజీవి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా నాడు కాంగ్రెస్ నేతల పంచెలూడగొడతాను అన్న పవర్ ఫుల్ డైలాగులతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించారు. ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో అయిదేళ్ళ పాటు మిన్నకున్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను ప్రారభించారు. నాడు పోటీ చేయకుండా మద్దతు రాజకీయాలు మాత్రమే నెరిపి ట్రైలర్ తో సరిపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి రెండు సీట్లలో తానే ఓడిపోయారు.పవన్ కళ్యాణ్ చెప్పిన పాతికేళ్ళ రాజకీయంలో అయిదేళ్ళు ఈ విధంగా పోయాయనుకోవాలి. ఇక మిగిలింది ఇరవయ్యేళ్ళు. 
జనసేనలో ఒంటరవుతున్నారా... సైనికులు ఏమౌతున్నారు

మరి ఇరవయ్యేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి జనసేన తయారుగా ఉందా అన్నదే ఇపుడు అందరిలో కలుగుతున్న డౌట్. సీనియర్ రాజకీయనాయకులు ఓ మాట చెబుతూంటారు. ప్రాంతీయ పార్టీలు పెడితే తొలిసారిలోనే అధికారంలోకి రావాలి. లేకపోతే మనుగడ ఉండదు అని. వైఎస్సార్ కాంగ్రెస్ తొలిదఫాలో ఫెయిల్ అయినా కష్టపడి రెండవమారు అధికారంలోకి వచ్చింది. దానికి పార్టీ పటిష్టంగా ఉండడం, వైఎస్సార్ ఇమేజ్, జగన్ రెక్కల కష్టం. జనం నమ్మకం ఇలా చాలా ఫ్యాక్టర్లు పనిచేశాయి. అర్ధబలం, అంగబలం జగన్ కి మెండుగా ఉన్నాయి. పట్టుదల అన్నిటి కంటే ఎక్కువగా పనిచేసింది. మరి పవన్ కళ్యాణ్ కు ఆ లక్షణాలు ఉన్నాయా. ఉంటే పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతారా అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది.జనసేనలో ఇపుడు వరసగా నాయకులు వెళ్ళిపోతున్నారు. రాజమండ్రీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసిన తరువాత ఒక రోజు గడవక ముందే విశాఖ జిల్లా గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పార్టీకి గుడ్ బై కొట్టేసారు. చిత్రమేంటంటే ఈ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ సొంత సామాజికవర్గం నేతలు. పైగా మెగా కుటుంబానికి సన్నిహితులు. మరి వారే పవన్ కళ్యాణ్ ను నమ్మకపోతే మిగిలిన వారు ఎలా నమ్ముతారు. ఇంతకు మూడు రోజుల ముందు విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్ధసారధి కూడా జనసేనకు తలాక్ చెప్పేశారు.పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమిపాలు అయ్యాక కూడా తాను నిబ్బరంగా నిలబడి రాజకీయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆచరణలో మాత్రం అది కనబడడంలేదు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తేనే మీడియాలో కనిపిస్తారు, వినిపిస్తారు. మిగిలిన సమయంలో పార్టీ ఉనికే లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక పార్టీ నిర్మాణం గట్టిగా చేస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నా కూడా అది ఇంకా శైశవ దశ కూడా దాటలేదని అర్ధమవుతోంది. ఇక్కడ ఓ సంగతి చెప్పుకోవాలి. వయసు మీరిన పార్టీగా టీడీపీని భావించి రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు వేరే పార్టీని వెతుక్కుంటూంటే జనసేనని ఇంకా బాలారిష్టాలు దాటని పార్టీగా గుర్తించి నాయకులు తప్పుకుంటున్నారని అర్ధమవుతోంది. మరి పవన్ కళ్యాణ్ పార్టీ బాలరిష్టాలు దాటి ముందుకు వెళ్ళేలా కార్యచరణ ఉంటుందా.. చూడాలి.

No comments:

Post a Comment