Breaking News

25/10/2019

సెల్ఫ్ గోల్ చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్గొండ, అక్టోబరు 25 (way2newstv.in)
తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవిలో ఉండి తాను గెలిచిన సిట్టింగ్ సీటునే గెలిపించుకోలేకపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేటు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పీసీసీ చీఫ్ ను మార్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులు అధిష్టానానికి తరచూ విన్నవిస్తున్నారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధిష్టానానికి హూజూర్‌న‌గ‌ర్ గెలిపించుకుంటాన‌నే భ‌రోసా ఇచ్చారు. ఆ తర్వాతే నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజ‌యం సాధించారు. ఎంపీగా ఉత్త‌మ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. 
సెల్ఫ్ గోల్ చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

దీన్ని కాంగ్రెస్ హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశ‌ముంది. హూజ‌ర్‌న‌గ‌ర్ ఓట‌మితో ఉత్త‌మ్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నార‌ని కాంగ్రెస్‌లోని మ‌రోవ‌ర్గం ప్ర‌చారం చేస్తున్నారుఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక రాజకీయాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో హుజూర్ నగర్ సీటు కోల్పోవడంతో మరో సమస్య ఎదురవుతోంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి.2015 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఆ టర్మ్ కూడా కొంతకాలంలో పూర్తవనుంది. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పై సొంతపార్టీ నాయకులే కొంతకాలంగా రుసరుస లాడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులపై ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అనేక మంది టిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. వారంతా వెళ్లిపోవడంతో తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా పొయింది. దీనికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డే నని ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. కనీసం వెళ్లే ఎమ్మెల్యేలను కూడా ఆపలేకపోయారనే అపవాదును ఉత్తమ్ మూటగట్టుకున్నారు. ఇలా అనేక ఫిర్యాదులను ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ నాయకులే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక నిర్ణయంపైనా వివాదం చెలరేగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో హుజూర్ నగర్ లో భార్య పద్మావతిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు. ఆ తర్వాత సద్దుముణిగింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డికూడా ముట్టడిలో పాల్గొనాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని సైతం కాంగ్రెస్ సీనియర్లు ఖండించారు. రాష్ట్ర నేతలెవరికీ చెప్పకుండా వాళ్లిద్దరూ ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మండిపడ్డారు. ఇలా నాలుగేళ్లలో ఉత్తమ్ కుమార్ పై వచ్చిన విమర్శలు పరిశీలిస్తుంటే ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన పట్టుకోల్పోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీగా ఎన్నికవడంతో ఇక తెలంగాణలో పగ్గాలు ఇతరులకు అప్పగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది పీసీసీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందానని ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment