Breaking News

29/10/2019

ఫిబ్రవరిలో యాదాద్రి ప్రారంభం

నల్గొండ అక్టోబరు 29 (way2newstv.com)
యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అది సరైన సమయమని చినజీయర్‌ స్వామి సూచించినట్లు చెప్పారు. యాదాద్రిలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో సోమవారం  తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఫిబ్రవరిలో యాదాద్రి ప్రారంభం

యాదాద్రి ఆలయంలో పనులు ఇంకా కొనసాగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. భక్తులు బాలాలయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. భగవంతుడిని పూజించే సంస్కారం తనకు తన తల్లిదండ్రుల పరంపర నుంచి వచ్చిందని సీఎం తెలిపారు. దేవాలయం అంటే భగవంతుడిని ఆరాధించే కమ్యూనిటీ హాల్ అని వ్యాఖ్యానించారు.హిందూ సంప్రదాయాలు కనుమరుగవుతాయనే ఆందోళన అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. ‘హైందవ సంప్రదాయంలో ఉండే శక్తి చాలా మందికి తెలియదు. సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే గురువారెడ్డి కమ్యూనిస్టు అయినప్పటికీ రామాలయం నిర్మించారు. హిందూ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు జీయర్ స్వామి లాంటి వారు ఉన్నారు’ అని కేసీఆర్ అన్నారు.‘ఆ రోజుల్లో స్వామీజీలు వస్తే అందరికీ పండుగలా ఉండేది. వారొస్తే నెల రోజుల వరకు గ్రామంలోనే ఉండేవారు. మా ఇంట్లో అతిథులుగా ఉంటూ గ్రామస్థులందరికీ భారతం, భాగవతం బోధించేవారు. వారే మమ్మల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచే మాలో ఆ భక్తి పరంపర కొనసాగుతోంది’ అని కేసీఆర్ వివరించారు.భక్తి భావన ఉన్నప్పటికీ ఆది పరిపుష్టంగా జరగాలంటే దానికెక్కడో ఒకచోట ప్రజ్వలనం జరగాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. భగవద్‌ రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్‌లో వెలవడం చాలా గర్వకారణమని కేసీఆర్‌ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుందామని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తానూ ఓ సేవకుడిలా పాల్గొంటానని తెలిపారు.

No comments:

Post a Comment