Breaking News

11/10/2019

సారొస్తారా..? (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, అక్టోబర్ 11 (way2newstv.in): 
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆచార్య పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇతర వర్సిటీల్లో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారిని డిప్యుటేషన్‌ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో కేఆర్‌యూ ఉన్నతాధికారులు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖలోని ఆంధ్రా, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులను డిప్యుటేషన్‌పై నియమించు కునేందుకు అవకాశం కల్పించడంతో ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ మూడు విశ్వవిద్యాలయాల ఆచార్యులకు దరఖాస్తుల కోసం లేఖలు పంపించారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్థాపితమై సుమారు దశాబ్దం కావస్తున్నా ఇంకా ఆచార్యుల కొరత మాత్రం పూర్తిస్థాయిలో తీరలేదు. 
సారొస్తారా..? (కృష్ణాజిల్లా)

వర్సిటీ అభివృద్ధికి ఏర్పడిన ప్రతిబంధకాల్లో ఇది కూడా ప్రధానమైనదిగా పేర్కొనవచ్ఛు ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్‌ బోధన సిబ్బంది నియామకం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆచార్య నాగార్జున, ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర వంటి మూడు విశ్వవిద్యాలయాల నుంచి డిప్యూటేషన్‌ ప్రాతిపదికన 36 పోస్టులను ఏడాది కాలానికి పనిచేసే నిమిత్తం భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఉష, ఇన్‌ఛార్జి ఉపకులపతి సుందరకృష్ణలు మూడు వర్సిటీలకు లేఖలు పంపించారు. కేఆర్‌యూతో పాటు నూజివీడులోని డా.ఎంఆర్‌ఏఆర్‌ పీజీ కేంద్రంలో కూడా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థుల బయోడేటా, నిరభ్యంతర పత్రం, సర్వీస్‌ సర్టిఫికెట్‌, పేస్లిప్‌/శాలరీ సర్టిఫికెట్‌ (తాజాది) అందించాలని నోటిఫిఫకేషన్‌లో వివరించారు.కృష్ణావిశ్వవిద్యాలయానికి రుద్రవరంలో సొంత భవనాలు నిర్మాణమయ్యాయి. ప్రభుత్వం రూ.13 కోట్ల బకాయిలు తీరిస్తే వర్సిటీ ఆ భవనాన్ని గుత్తేదారు నుంచి స్వాధీనం చేసుకుంటుంది. ఇతర విశ్వవిద్యాలయాల నుంచి డిప్యూటేషన్లపై ఆచార్య పోస్టులను భర్తీ చేసుకుంటే నాక్‌ గుర్తింపు తెచ్చుకునేందుకు మార్గం సుగమవుతుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులతో నడుస్తున్న కేఆర్‌యూకు నాక్‌ గుర్తింపు దక్కితే యూజీసీ నుంచి అధిక మొత్తంలో నిధులు సమకూర్చుకునే అవకాశం దక్కుతుంది. ఈ కలలన్నీ వాస్తవరూపం దాల్చాలంటే పూర్తిస్థాయిలో ఆచార్యుల రాక అనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరిపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ కేవలం మూడు వర్సిటీలకే నోటిఫికేషన్లు పంపించడంతో 36 పోస్టులు భర్తీ అవుతాయా అన్న విషయం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆంధ్రా, నాగార్జున, ఎస్వీ అనే మూడు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోనే మేటిగా వర్థిల్లుతున్న తరుణంలో మాతృసంస్థలను వదులుకుని కొత్తదైన కేఆర్‌యూకు డిప్యూటేషన్‌పై వస్తారో, రారో అన్న సందేహం పీడిస్తోంది. ఆయా వర్సిటీల్లో పనిచేసే జిల్లాకు చెందినవారు కొంత వరకు రావడానికి మొగ్గుచూపే అవకాశముంది. అయితే అక్కడ, ఇక్కడ ఇచ్చే అలవెన్సులు, హెచ్‌ఆర్‌ఏలను బేరీజు వేసుకుంటారు. ఇతర వర్సిటీలతో పోలిస్తే కేఆర్‌యూలో అందే భత్యాల్లో వ్యత్యాసం ఉంటుంది. నూతన ఆచార్యులు వస్తే అకడమిక్‌ కన్సల్టెంట్ల పోస్టులకు గండి పడుతుందా అనే సందేహం కూడా పలువురిలో ఉంది. వాటిని కూడా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు నివృత్తి చేయాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment