Breaking News

01/10/2019

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

ధర్మప్రచారం  (way2newstv.in)
తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణతో పాటు హైందవ ధర్మప్రచారానికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ధర్మప్రచార మండళ్ల సహకారంతో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, పుస్తక ప్రసాదం పంపిణీ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న సంస్థలకు ఆర్థికసాయం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
శ్రీనివాస కల్యాణాలు :
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి భక్తుల మదిలో భక్తిభావాన్ని నింపాలన్న లక్ష్యంతో 2012, జనవరి నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌లో ఒక విభాగంగా  శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 
శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

భగవంతుడిని భక్తుల ముంగిట సాక్షాత్కరింపజేయడమే ధ్యేయంగా శ్రీనివాసకల్యాణాలు, గోవింద కల్యాణాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహించ బడుతున్నాయి. ఈ కార్యక్రమంతో సమాజంలో భక్తిభావాన్ని పెంచడమే గాకుండా ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోంది. ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే ఈ కళ్యాణాల ద్వారా కల్పిస్తూంది. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ చక్కటి అవకాశాన్ని తితిదే కల్పించింది.
భజనమండళ్లు :
కలియుగంలో శ్రీవారి కృపాకటాక్షాలు పొందేందుకు హరినామ సంకీర్తన ఒక్కటే మార్గం. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులను ఆహ్వానించి తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట వద్ద 24 గంటల పాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కళాకారులు తన్మయత్వంతో భజన చేస్తూ తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన సుమారు 7 వేల భజన మండళ్లకు శిక్షణ ఇచ్చి మరింత బలోపేతం చేస్తున్నారు.
భక్తి చైతన్య యాత్రలు :
మారుమూల గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా ధర్మప్రచారం చేసి ప్రజలను భక్తిమార్గంలో నడిపేందుకు 2007వ సంవత్సరం నుంచి భక్తి చైతన్యయాత్రలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార రథంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు. కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పుస్తక ప్రసాదం :
శ్రీవారి వైభవం, మహిమలు, ఉత్సవాలు, పర్వదినాల విశేషాలతో రూపొందించిన ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ పుస్తకాలను ముద్రిస్తోంది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, శ్రీవిష్ణుసహస్ర నామం, గోవిందనామాలు, భగవద్గీత తదితర పుస్తకాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది.
స్వామీజీలు, మఠాధిపతుల ద్వారా ధర్మప్రచారం :
దేశం నలుమూలల నుంచి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించి సనాతన ధర్మపరిరక్షణ కోసం ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తోంది. తిరుమలలోని ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు :
వేదాలు, పురాణాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన పెంచేందుకు 35 సంవత్సరాలుగా సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తోంది. 6, 7 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం, 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో ఈ పరీక్షలు జరుగతున్నాయి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను బహుమానంగా అందజేస్తోంది. ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులను సన్మానిస్తోంది.
నాదనీరాజనం :
తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతిరోజూ సాయంత్రం నాదనీరాజనం కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నిష్ణాతులైన పండితులు, హరికథా భాగవతార్‌లు, సంగీత విద్వాంసులు, నృత్య కళాకారులు, నామసంకీర్తన బృందాలను ఎంపిక చేసి ప్రదర్శనలు నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ కార్యక్రమం ప్రతిరోజూ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ నగదు చెల్లిస్తుంది.
మనగుడి :
మానవతా కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న గుడి విశిష్టతను తెలియజేసి ప్రజలను చేరువ చేయడంతో పాటు యువతకు మన ఆచార వ్యవహారాలను, సంస్కృతిని తెలియజేయాలనే ఉన్నత లక్ష్యంతో మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంవత్సరం పొడవునా పర్వదినాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
శుభప్రదం :
విద్యార్థులకు మానవీయ, నైతిక విలువలు, భగవంతునిపై విశ్వాసం, వ్యక్తిత్వ వికాసం నేర్పించాలనే సదుద్దేశంతో ప్రతి ఏడాదీ వేసవిలో శుభప్రదం పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా భోజనం, వసతి కల్పించి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ప్రతి ఏడాదీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

No comments:

Post a Comment