Breaking News

29/10/2019

3 నెలలకే మూతబడ్డ స్పాంజ్ యూనిట్

ఖమ్మం, అక్టోబరు 29,(way2newstv.in)
పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) ఆధ్వర్యంలోని స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌ మనుగడ మూడు నెలల ముచ్చటే అయింది. మూడేళ్ల పాటు మూతబడిన ఈ ప్లాంట్‌లో గత జనవరిలో ఉత్పత్తి పునఃప్రారంభించారు. అయితే మూడు నెలలకే మళ్లీ మూతబడింది. స్పాంజ్‌ ఐరన్‌ విక్రయిస్తే వచ్చే డబ్బు కంటే తయారీకే ఎక్కువగా ఖర్చవుతోందని, దీంతో నష్టాలు వస్తున్నాయని ఎన్‌ఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ భారం కావడంతో తిరిగి మూసేశారు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని 2016లో నిలిపివేశారు.ఉద్యోగుల కోరిక, జిల్లా ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర విభజన నేపథ్యంలో బయ్యారంలో చేపట్టాల్సిన ఉక్కు కర్మాగారం విషయమై అనేక ఆందోళనల నేపథ్యంలో పాల్వంచలోని ఎన్‌ఎండీసీ స్టీల్‌ ప్లాంట్‌లో మూడేళ్ల తరువాత ఈ ఏడాది జనవరి 22న తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. 
3 నెలలకే మూతబడ్డ స్పాంజ్ యూనిట్

అయితే  ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా నడుస్తుందని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. నడిపించి నష్టాలను పెంచుకోవడం కంటే ఉత్పత్తిని నిలిపివేయడమే మేలని నిర్ణయానికి వచ్చిన ఎన్‌ఎండీసీ.. గత మార్చిలో తిరిగి ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. స్పాంజ్‌ ఐరన్‌ బదులు కోల్డ్‌ రోల్‌ మిల్‌ (మెటల్‌ ప్రాసెసింగ్‌ మిషనరీ) చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై అ«ధ్యయనం చేసేందుకు ఎంఎన్‌ దస్తూరి అనే కన్సెల్టెన్సీకి కాంట్రాక్ట్‌ అప్పగించినట్లు తెలుస్తోంది.  1980లో స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌(డీఆర్‌పీ 1) వార్షిక ఉత్పత్తి 30 వేల టన్నులతో ప్రారంభమైంది. లక్ష్యాలకు మించి 60 వేల టన్నుల ఉత్పత్తిని కూడా సాధించింది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఉక్కు పరిశ్రమలో మాంద్యం నెలకొంది. దీంతో నష్టాలు మొదలైన ఈ కర్మాగారాన్ని 2010 జూలై 31న లాభదాయకమైన నవరత్న స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో విలీనం చేశారు. ఈ విధంగా అయినా తిరిగి స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌ నష్టాలను అధిగమిస్తుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్పత్తి ధర కంటే అమ్మకం ధర తక్కువగా ఉండటంతో 2016లో ఉత్పత్తిని నిలిపివేశారు.అనేక పరిణామాల మధ్య తిరిగి 2019 జనవరి 22న పునరుద్ధరించేందుకు నూతన జీఎం ఆర్‌డీ నంద్‌ ప్రత్యేక చొరువ తీసుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీఎస్‌ చెరియన్‌ సహకారంతో 100 టన్నుల సామర్థ్యం గల ఒక యూనిట్‌ను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ముడి సరుకు ఐరన్‌ ఓర్, బొగ్గు దిగుమతికి చర్యలు చేపట్టారు. అయితే టన్ను ఉత్పత్తికి రూ.23 వేలు ఖర్చు అవుతుండగా.. అది అమ్మితే రూ.19 వేలు మాత్రమే వస్తోంది. అంటే టన్నుకు రూ.4 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా నెలకు రూ.12 కోట్లు నష్టం వస్తున్నట్లు సమాచారం. దీంతో నడపడం కంటే మూసేయడమే మేలని భావించి గత మార్చిలో ఉత్పత్తిని నిలిపివేశారు. మరో వైపు సిబ్బంది జీతభత్యాలు కూడా భారమై సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్మాగారంలో ఉత్పత్తి లేక పోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 30 మంది అధికారులు, 102 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు.  మార్కెట్‌లో స్పాంజ్‌ ఐరన్‌ ధర పెరిగితే తప్ప నష్టాలు తప్పవని అధికారులు అంటున్నారు. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా నడపాలని యోచిం చినప్పటికీ అది సాధ్యం కావడం లేదని చెపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి  కాకుం డా సమీపంలో ఉన్న బయ్యారం ఐరన్‌ఓర్‌ ఉపయోగించుకుని నడపితే రవాణా చార్జీలు తగ్గుతాయని ఆలోచించినా.. ఇక్కడి ముడి సరుకు (ఐరన్‌ఓర్‌) ఉత్పత్తికి అవసరమైన మేర నాణ్యం గా లేదని తెలిసింది. దీంతో ఇక్కడ కోల్డ్‌ రోల్‌ మిల్‌ ఏర్పాటు చేస్తే బాగుంటదనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై యాజమాన్యం సైతం సానుకూలంగా ఉందని, కార్యరూపం దాల్చితే సంస్థకు మేలు జరుగుతుందని సిబ్బంది ఆశిస్తున్నారు. సాధ్యసాధ్యాలపై ఎంఎన్‌ దస్తూరి అనే కన్సెల్టెన్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇక్కడి సిబ్బందితో కూడా చర్చించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment