Breaking News

18/09/2019

రాజకీయాలకు కోడెల ఫ్యామిలీ దూరమే...

గుంటూరు, సెప్టెంబర్ 18  (way2newstv.in)
కోడెల కుటుంబం రాజకీయాలు ఇక ముగిసినట్లే. సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తల్లో విషాదం అలుముకుంది. కోడెల శివప్రసాద్ కు సుదీర్ఘ అనుబంధం ఉన్న నరసరావుపేట, 2014 ఎన్నికల నుంచి అనుబంధం ఉన్న సత్తెన పల్లి నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీకి పెద్దదిక్కు లేకుండా పోయిందన్న ఆవేదన పార్టీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. తనకు ఇష్టమైన, ప్రీతిపాత్రమైన నరసరావుపేట నియోజకవర్గాన్ని అయిష్టంగానే వదులుకున్నారు. 2014లో చంద్రబాబు నరసరావుపేట నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. 
రాజకీయాలకు కోడెల ఫ్యామిలీ దూరమే...

అంతేకాకుండా కోడెల స్వగ్రామం సత్తెనపల్లి నియోజకవర్గంలోకి వెళ్లడంతో ఆయన సత్తెనపల్లికి వెళ్లాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.కోడెల శివప్రసాద్ హఠాన్మరణంతో ప్రధానంగా నరసరావుపేటలో టీడీపీకి నేత లేకుండా పోయారు. సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన నరసరావుపేటకు కూడా ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. టీడీపీ నుంచి ఇన్ ఛార్జిగా చంద్రబాబు కూడా ఎవరినీ నరసరావుపేటకు నియమించలేదు. దీంతో కోడెల శివప్రసాద్ నరసరావుపేటపై తన పట్టుకోల్పోకుండా చూసుకోగలిగారు.కోడెల శివప్రసాద్ ఆత్మహత్యతో ఇప్పుడు నరసరావుపేటలో పార్టీకి దిక్కులేకుండా పోయింది. కోడెల శివప్రసాద్ కు నరసరావుపేటలో ప్రత్యేక వర్గం ఉంది. డాక్టర్ గా ఆయన సుదీర్ఘకాలం అక్కడ సేవలందించడంతో ప్రత్యేక ఓటు బ్యాంకును కూడా వ్యక్తిగతంగా సంపాదించుకోగలిగారు. ఆయన మరణంతో టీడీపీకి నరసరావుపేటలో తీవ్ర నష్టమేనని చెప్పకతప్పదు. కోడెల కుటుంబం నుంచి ఇక రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా ఎవరూ సుముఖత చూపడం లేదు. ఇలా కోడెల ఆత్మహత్యతో ఆయన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment