Breaking News

20/09/2019

మరాఠలో ద్విముఖ పోరే...

ముంబై, సెప్టెంబర్ 20, (way2newstv.in)
మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాగానే కసరత్తు చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఒకవైపు నేతలు వరసగా పార్టీని వీడుతున్నప్పటికీ పెద్దగా డీలా పడటం లేదు. సొంత ప్రయత్నాలు, ఎత్తులతోనూ ముందుకు సాగాలని కాంగ్రెస్, ఎన్సీపీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కూటమిగా బరిలోకి దిగి ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకుని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలన్నది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గట్టిగా భావిస్తున్నారు.గతంలో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా కొంత ఊపు పార్టీలో కన్పించింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దేశమొత్తం కాంగ్రెస్ క్యాడర్ పడకేసిందనే చెప్పాలి. అనేక చోట్ల పార్టీ కార్యాలయాలకు కూడా తాళాలు వేసి ఉంచడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. 
మరాఠలో ద్విముఖ పోరే...

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.మహారాష్ట్రలో శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీకి కొన్ని ప్రాంతాల్లో గట్టి పట్టుంది. భారతీయ జనతా పార్టీ, శివసేనలు కలసి పోటీ చేస్తేనే మంచిదని కాంగ్రెస్ భావన. ఎందుకంటే విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశముంది. అందుకే ఆ రెండు కలసి పోటీ చేయాలని తాము కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. మరోవైపు కుదేలైపోయిన పార్టీని గట్టెక్కించడం కోసం సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.ఇక కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్లు కూడా ఖరారయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్, ఎన్సీపీ చెరి 125 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన 38 స్థానాలను మిత్రపక్షాలకు పంచనున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో ఈసారి ఎన్సీపీ పోటీ చేసేందుకు అవకాశముంది. అలాగే ఎన్సీపీ కూడా కాంగ్రెస్ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కొత్త వారికే పూర్తిగా అవకాశాలివ్వాలని నిర్ణయించింది. ఈ వ్యూహం వర్క్ అవుట్ అవుతుందేమోనన్న ఆశ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. అన్ని రకాల వ్యూహాలను పన్నుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment