Breaking News

10/09/2019

మళ్లీ అటకెక్కిన సొసైటీల స్థలాల కథ

విజయవాడ, సెప్టెంబర్ 10, (way2newstv.in)
అత్యాశ, మితిమీరిన అహంకారం, కుల తత్వం, ప్రభుత్వాలకు తాబేదారులుగా వ్యవహరించే మనస్తత్వాలకు ఎప్పటికైనా భంగ పడక తప్పదని జర్నలిస్ట్ సంఘాలకు ఇప్పటికైనా బోధ పడితే మంచిది. అమరావతి అక్రిడేడిటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ విషయంలో జరిగింది ఇదే. వేల మంది రైతుల త్యాగాల పునాది మీద ఏర్పడిన రాజధాని నగరంలో ఆయాచిత లబ్ది పొందాలని జర్నలిస్టులు ప్రయత్నించారు. పైసా ఖర్చు లేకుండా కారు చౌకగా రాజధాని నగరంలో సొంతిల్లు పొందాలని భావించారు. రాజధాని నగరంలో జనవాస ప్రాంతాలు ఉండాలి కాబట్టి తమకు సొంత ఇళ్ల కోసం ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇదంతా 2016-17 లో మొదలైంది. 
అమరావతి అక్రిడేడిటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ

ల్యాండ్ పూలింగ్ మొదలై రాజధాని కార్య కలపాలు హైదరాబాద్ నుంచి అమరావతి తరలి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ లలో ఇదే ప్రాంతంలో తమకు సొంతిల్లు ఉంటే లైఫ్ సెటిల్ అవుతుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా దానిని అమల్లో పెట్టారు. అప్పటి ప్రభుత్వానికి దగ్గరగా వుండే పత్రికలు, వాటి బ్యూరో చీఫ్ లు, ప్రధానంగా ఓ సామాజిక వర్గం దీనికి ప్రణాళిక రచించింది.నిజానికి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్లకు పైగా అర్హులైన వారికి స్థలాలు దక్కలేదు. మెట్రో నగరాల్లో ప్రభుత్వ స్థలాల కేటాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం లో వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ఏపీ లోని ప్రధాన నగరాల్లో స్థలాల కేటాయింపు జరగలేదు. ఇదే సమయంలో అమరావతి నగరం, అందులో జర్నలిస్ట్ లకి ఇళ్ల స్థలాలు అంశం తెర మీదకు వచ్చింది. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు ఇప్పటికీ ఎవరికి తెలియని ఓ రహస్య వ్యవహారం. దాని సర్వ సభ్య సమావేశం, సభ్యత్వ విధి విధానాలు, సభ్యుల షేర్ వంటి వివరాలు ఎవరికి తెలియవు. ఓ సామాజిక వర్గ సొంత వ్యవహారంలాగా ఈ తంతు నడిచింది. సొసైటీ సభ్యత్వాలు ఆహ్వానించినవుడు 2017 డిసెంబర్ నాటికి ప్రభుత్వ గుర్తింపు పొంది, రాజధాని ప్రాంతంలో పని చేస్తున్న వారై ఉండాలని ప్రకటన ఇచ్చారు. మొదట్లో రాజధానిలో భూములు ఇచ్చిన 29గ్రామాలు, మంగళగిరి ప్రాంతాలను ఈ సొసైటీ లో చేర్చుకోడానికి నిరాకరించడం, వారు సొంతంగా మరో సొసైటీ ఏర్పాటుకు ప్రయత్నించడంతో చివరకు వారిని కూడా చేర్చుకోడానికి అంగీకరించారు. దరఖాస్తులు ఇచ్చిన చాలా నెలలకు అనూహ్యంగా ఎంపిక చేసిన సభ్యులు 23వేలు చెల్లించాలని సమాచారం ఇచ్చారు. హౌసింగ్ సొసైటీ కి ప్రభుత్వం 30ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించడంతో మొదటి విడత చెల్లింపు కోసం ఎంపిక చేసుకున్న వారి నుంచి డబ్బు వసూలు చేసి సీఆర్డీఏ కు చెల్లించారు.రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం నుంచి భూమి పొందిన తర్వాత దానిని ప్రైవేట్ డెవలపర్ కి ఇచ్చి కారు చౌకగా ఇళ్లు నిర్మించుకోవాలని జర్నలిస్ట్ నేతలు భావించారు. అయితే సొసైటీ లకు ప్రభుత్వం ఇచ్చే భూములతో వ్యాపారం చేయడం, అభివృధ్ధికి ఇవ్వడం వంటివి చట్టానికి వ్యతిరేకం. సహకార చట్టం, సీఆర్డీఏ చట్టాలకు భిన్నంగా ప్రణాళిక రచించి జర్నలిస్ట్ నేతలు భంగ పడ్డారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలను భూ కేటాయింపు సమయంలో అధికారులు ప్రస్తావించడంతో 30ఎకరాల స్థలం కాస్త 15ఎకరాలకు తగ్గింది. ఆ తర్వాత కూడా భూమిని స్వాధీన పరచుకునే విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అధికారులు అభ్యంతరం తెలిపారు. జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం 13జిల్లాల్లోని జర్నలిస్టుల కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయల డబ్బును వినియోగించుకునేందుకు అధికారులు నిరాకరించారు. కేవలం రాజధాని ప్రాంతం జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం డబ్బు వెచ్చిస్తే మిగిలిన జిల్లాల నుంచి అభ్యంతరం వస్తుందని అడ్డు చెప్పారు. ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది నెలల ముందు అప్పటి మంత్రులు, ప్రధాన పత్రికల విలేకరులు తీవ్ర స్థాయిలో అధికారుల మీద ఒత్తిడి చేసి విఫలం అయ్యారు. కోర్టు కేసులు దాఖలైతే కోర్టు చుట్టూ తాము తిరగాల్సి వస్తుందని., సొసైటీ నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు పాటించకుండా, సభ్యుల ఎంపిక, సభ్యత్వ వివరాలు తమకు ఇవ్వకుండా ఏక పక్షంగా వ్యవహరించలేమని తేల్చి చెప్పడంతో బ్రేక్ పడింది.ప్రభుత్వాలు వస్తుంటాయి….పోతుంటాయి…. ప్రభుత్వ అనుకూల పత్రికలు, ప్రతిపక్ష పాత్ర పోషించే పత్రికలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అమరావతి హౌసింగ్ సొసైటీ విషయంలో మాత్రం ఆ రెండు పత్రికల ప్రతినిధులు, అదే సామాజిక సహచరులు మితిమీరి ప్రవర్తించారు. హౌసింగ్ సొసైటీ ఏర్పడిన వెంటనే అప్పటి సమాచార శాఖ కమిషనర్ తో జరిగిన భేటీలో సొసైటీ కార్యవర్గ కూర్పుపై చర్చ జరిగింది. ప్రధాన పత్రికల్లో ఒకటైన సాక్షి నుంచి ఒక్కరికి కూడా చోటు లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా జర్నలిస్టులుగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ప్రభుత్వం మారినా ఇబ్బందులు రాకుండా ఉంటాయనే సూచనను రెండు ప్రధాన పత్రికల ప్రతినిధులు తిరస్కరించడంతో ఆయన మిన్నకుండి పోయారు. ఆ తర్వాత సొసైటీ కి భూ కేటాయింపు సమయంలో కూడా పరిపాలన నగరానికి చేరువలో భూమి కావాలని పట్టుబట్టారు. శాఖమురు, నిడమర్రు ప్రాంతంలో ఒకే చోట భూమి లభ్యత ఉన్నా పరిపాలన నగరంలోనే భూమి కావాలని నేతలు పట్టుబట్టడం సీఆర్డీఏ అధికారులకు ఆగ్రహం కలిగించింది. ఫలితంగా ఆలిండియా సర్వీస్ అధికారుల సొసైటీ కి భూ కేటాయింపు, రిజిస్ట్రేషన్ జరిగినా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల ఫైల్ మాత్రం ముందుకు కదల్లేదు.జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అనగానే పని చేసిన ప్రతిచోట ప్రభుత్వ స్థలాలు పొందిన వారు కూడా క్యూ కట్టేశారు. జర్నలిస్ట్ విధులతో సంబంధం లేని వారు, హెచ్ ఆర్ ఉద్యోగులు, యాజమాన్యానికి కావాల్సిన వారు, వెబ్ సైట్ లలో పని చేసేవారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లు, మార్కెటింగ్ సిబ్బంది, అసలు ఆంధ్రప్రదేశ్ లో పని చేయని వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందని వారు, ప్రధానంగా ఓ సామాజిక వర్గం వారికి ఈ సొసైటీ లో చోటు దక్కింది. విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో పని చేయకుండా జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్న నేతలు, ప్రభుత్వ భజన చేసే వారు కూడా ఈ సొసైటీ సభ్యులు అయిపోయారు. సహకార చట్టం ప్రకారం ఓ సొసైటీ ద్వారా లబ్ది పొందిన వారు, వేరే సొసైటీ లలో సభ్యులుగా ఉన్న వారు మరో సొసైటీ లో సభ్యులు కాకూడదు. హైదరాబాద్ జర్నలిస్ట్ సొసైటీ లో సభ్యులుగా ఉన్న చాలా మందికి అమరావతి సొసైటీ లో సభ్యత్వం దక్కింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి కూడా ఉదారంగా సభ్యత్వాలు ఇచ్చేశారు. వీళ్లకు ఉన్న అర్హత ఏమిటో అందరికి తెలిసిందే.జర్నలిస్ట్ హౌసింగ్ సభ్యత్వం కోసం ఒక్కొక్కరి నుంచి దరఖాస్తు కోసం 100 రూపాయలు, సభ్యత్వం కోసం 23వేలు వసూలు చేశారు. దాదాపు 2500 మంది నుంచి సొంతిల్లు అనే బలహీనత అడ్డం పెట్టుకుని రోజుల వ్యవధిలో వసూలు చేశారు. ఇది జరిగి ఆరేడు నెలలు గడిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే అమరావతి ఇళ్ల స్థలాల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అప్పట్లో చక్రం తిప్పిన వారికి ఇప్పుడు కార్యాలయాల్లో అడుగు పెట్టడం కూడా కష్టం అయిపోయింది. ప్రభుత్వం తరపున పోరాట దీక్షల్లో ముందుండి నడిచిన నేతలు ఇప్పటికీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో కనీసం పేరు ఉచ్చరించడానికి కూడా సాహసించని నాయకుడి ద్వారా చక్రం తిప్పుతామని బీరాలు పలుకుతున్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అభినందించడానికి నానా పాట్లు పడి, పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ జాతీయ స్థాయి జర్నలిస్ట్ నాయకుడితో కొద్ది రోజుల క్రితం సీఎం దర్శనం చేసుకున్నారు. అన్నీ అయ్యాక తమకు గత ప్రభుత్వం తమకు ఇళ్ళ స్థలాలు కేటాయించింది అని ఆ ఫైల్ క్లియర్ చేయాలని చెబుతుండగానే, వారి మాటలు కట్ చేసిన సీఎం జర్నలిస్టు లకు ఎలా మేలు చేయాలో తమకు తెలుసు అని, గత ప్రభుత్వ విషయాలు మర్చిపోవాలని ముగించేసారట….సొంతింటి ఆశతో 23వేలు కట్టిన జర్నలిస్ట్ లు ఇక వచ్చేది లేదని తమ డబ్బు తమకు ఇవ్వమంటే., సొసైటీ బాద్యులు రకరకాల మాటలు చెబుతుండటంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని నెలలు ఎంత వడ్డీ వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. జర్నలిస్టుల వడ్డీ డబ్బు మీద ఎవరేమి చేస్తున్నారో కూడా అంతు చిక్కని రహస్యంగా మారింది. జీతాలు పక్కాగా వచ్చే వారి సంగతి అలా ఉంచితే, కంట్రిబ్యూటర్లు, చిన్న స్థాయి వారికి ఈ డబ్బు చాలా విలువైనది. ఆ సంగతి తెలిసి కూడా సంఘాలు ఆడుతున్న డ్రామాలే విచారకరం.

No comments:

Post a Comment