Breaking News

05/09/2019

నిజాంసాగర్....నిర్జీవం...

నిజామాబాద్, సెప్టెంబర్ 5, (way2newstv.in)
నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం నీరు లేక నిర్జీవంగా మారింది. ఎగువ భాగంలో మంజీర నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేక ప్రాజెక్ట్‌కు నీరు రాక జిల్లా రైతాంగానికి ఆందోళన కల్గిస్తోంది 
నిజాంసాగరం. ఉమ్మడి జిల్లాలైన కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు 5,350 క్యూసెక్క్‌ల వరద నీరు వచ్చి 
చేరిందని అధికారులు తెలిపారు. అయతే ఇది ఆశించిన స్థాయ కాదని అధికారులు చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు, కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ జలాశయంలో 1376.756 అడుగుల నీరు ఉంది. టీఎంసీ విషయానికి వస్తే ప్రాజెక్ట్ జలాశయం పూర్తి స్థాయి సామర్ధ్యం 17.802 టీఎంసీలు ఉండగా, కేవలం 0.869 టీఎంసీలు మాత్రం నీరు ఉండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మంజీర నదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌ల పుణ్యమా అంటూ నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు రావడం లేదన్నది జగమెరిగిన సత్యం. 
నిజాంసాగర్....నిర్జీవం...

ఇకపోతే గత కొనే్నళ్లుగా కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన పోచారం ప్రాజెక్ట్‌పై ఆధారపడి మాత్రం నిజాంసాగర్‌లో నీరు చేరుకుంటోంది. ప్రస్తుతం పోచారం ప్రాజెక్ట్ నిండుకుండలా మారి పాలపొంగులా ప్రాజెక్ట్ కట్టపై నుండి నీరు ప్రవహిస్తూ మంజీరలోకి వెళ్తూ తద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నీరు వెళ్తోంది. బుధవారం ఉదయం పోచారం ప్రాజెక్ట్ ద్వారా నీరు పొంగి ప్రవహిస్తూ దాదాపు 2,130 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి వెళ్తోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పుణ్యమా అంటూ లింగంపేట్ వాగు ద్వారా పోచారం ప్రాజెక్ట్‌లోకి నీరు భారీగా చేరుతుండటంతో ఆ నీరంతా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వెళ్తుంటే, నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే నిజాంసాగర్ ఆయకట్టు కింద చాలామంది రైతులు బోర్లు వేసుకుని వాటి ద్వారానే పంటలు పండించుకోవడం గమనార్హం.జిల్లా రైతులు ఎక్కువ శాతం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను నమ్ముకుని జీవిస్తున్నారు. నిజాంసాగర్ ఎగువ భాగంలో నిర్మాణం అయిన మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నిండితే తప్ప మంజీర ద్వారా నిజాంసాగర్‌లోకి నీరు రాదు. సింగూర్ నిండాలంటే పైన కర్నాటకలో కట్టిన కరంజా తదితర ప్రాజెక్ట్‌లు నిండిపోయి, సింగూర్ ప్రాజెక్ట్ నిండి, సింగూర్ గేట్లను వదిలితే తప్ప నిజాంసాగర్ నిండని పరిస్థితి దాపురించింది. ప్రాజెక్ట్ ఎగువ భాగంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరిగిన సమయంలో దీన్ని ఈ ప్రాంత ప్రభుత్వాలు అడ్డుకోకపోవడం వల్ల నేడు నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్జీవంగా మారింది. మొత్తం మంజీరనదిపై ఆధారపడిన నిజాంసాగర్‌కు ప్రస్తుత తరుణంలో కేవలం పోచారం ప్రాజెక్ట్ మాత్రం దిక్కుగా మారింది. పోచారం ప్రాజెక్ట్‌ను నమ్ముకుని కామారెడ్డి జిల్లాలో మొత్తం 31, 925 ఎకరాల ఆయకట్టు భూమి సాగులో ఉంది. బాన్స్‌వాడ మండలంలో 10,447 ఎకరాలు, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో కలిపి 17,428 ఎకరాలు, నిజాంసాగర్ మండలంలో 4050 ఎకరాల ఆయకటుట భూమి ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 2 లక్షలపై చిలుకు ఆయకట్టు ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల అనేక మండలాల్లో పంటలు వేయక పోవడం గమనార్హం. బోర్‌బావులు ఉన్నా రైతులు పంటలు వేసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు మూడు నెలలు దాటుతున్నా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండకపోవడంతో చివరకు సాగునీరే కాదు రెండు జిల్లాల సాగునీటి ఇబ్బంది కూడా ఎదుర్కోక తప్పదు. పోచారం ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని గాంధారి మండలం, నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఈసారి నిజాంసాగర్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అతి చిన్న ప్రాజెక్ట్ అయిన పోచారం ప్రాజెక్ట్ జీవం పోస్తూ ఆయకట్టు రైతులను కొనే్నళ్లుగా కాపాడుతూ వస్తోంది. పోచారం ప్రాజెక్ట్ ద్వారా లక్షల క్యూసెక్కులు కూడా వృథాగా మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పోచారం ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు పోచారం ప్రాజెక్ట్ కట్ట ఎత్తును పెంచి ప్రధాన కాల్వను డైరెక్ట్ కెనాల్‌గా మార్చాలంటూ రైతులు ఆందోళన మొదలు పెట్టారు. రైతులు చేస్తున్న న్యాయపోరాటంతో ప్రభుత్వం స్పందించి, కట్ట ఎత్తు పెంచితే నిజాంసాగర్‌కు అందాల్సిన ఆ నీరు కూడా రాకుండా పోయే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ సాధించుకున్న తరువాత నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌లకు పర్యాటక సోబగులు అద్దుతారని ఎదురు చూసిన పర్యాటకుల ఆశ నిరాశగానే మిగిలుతోంది.

No comments:

Post a Comment