Breaking News

21/09/2019

గిరిజన పాఠశాలల్లో వంటమనుషులు, వాచ్ మెన్ల భర్తీ ఎప్పుడు

విజయవాడ, సెప్టెంబర్ 21, (way2newstv.in)
గిరిజన విద్యకు కల్పిస్తున్న మౌలికవసతులకు పొంతన లేకుండా పోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మెనూ వండడానికి వంటపాకలు చాలా పాఠశాలలకు లేవు. దీంతో వర్షాకాలంలో నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న వంట మనుషుల పోస్టులను కూడా సర్కార్‌ భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో గిరిజన విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఏళ్ల తరబడి వంటమనుషులు, సహాయకులు, వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ కాకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 
గిరిజన పాఠశాలల్లో వంటమనుషులు, వాచ్ మెన్ల భర్తీ ఎప్పుడు

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వసతిగృహ సంక్షేమాధికా రులు సొంత డబ్బులు పెట్టుకుని ప్రైవేట్‌ వంటమనుషులను ఏర్పాటు చేసుకుని వండించుకునే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మారుమూల పాఠశాలల్లో విద్యార్థులే సహాయకులుగా మారుతున్నారు. జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,176 మంది బాలురు, 5,188 మంది బాలికలు చదువుతున్నారు.16 పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో 2,557 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మూడు పూటలా భోజనం వండి పెట్టాల్సి ఉంది. ఇందుకు గాను మొత్తం 203 మంది అవసరం ఉండగా 113 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నా రు. 90 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి.అలాగే వంట మనుషులు 29, సహాయకులు 33, వాచ్‌మెన్‌ 28, ఆఫీస్‌ సబార్డీనేట్‌లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వంట శాలలు సైతం సుమారు 15 పాఠశాలలకు లేవు. సీతంపేట బాలికల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 650 మంది విద్యార్థులు చదువతున్నారు. వీరికి వండి వడ్డించడానికి ఇద్దరు వంటమనుషులు, మరో ఇద్దరు సహాయకులు, నైట్‌వాచ్‌వుమెన్‌ ఉండాలి. కేవలం ఒక వాచ్‌మెన్, కుక్‌ మాత్రమే ఉన్నారు. పూతికవలసలో 500 మందికి పైగా విద్యార్థులు ఉండగా కేవలం ఒకే ఒక వంట మనిషి ఉన్నారు. పొల్ల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇంతవరకు నైట్‌వాచ్‌మెన్‌ లేరు. శంబాం, హడ్డుబంగి, చిన్నబగ్గ తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఆశ్రమ పాఠశాలల్లో పోస్టులు మంజూరైనప్పటికీ భర్తీ మాత్రం కాలేదు. మూడేళ్ల  క్రితం ఈ పోస్టులు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయడాని కి చర్యలు తీసుకున్నప్పటికీ పైరవీలు చోటు చేసుకోవడంతో మధ్యలోనే నిలుపుదల చేశారు. కాగా పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ పోస్టులే మంజూరు కాలేదు. అలాగే భవనాల మరమ్మతుల పేరుతో ఏటా కొన్ని పాఠశాలలకు నిధులు మంజూరవుతున్నా పైపైనే రంగులు వేయడం, అరకొరగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

No comments:

Post a Comment