Breaking News

24/09/2019

యడ్డీకి ఉపఎన్నికల టెన్షన్

బెంగళూర్, సెప్టెంబర్ 24,(way2newstv.in)
కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 21వ తేదీన కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగాలంటే ఇందులో సగం మందిని ఆయన గెలిపించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మరోసారి ప్రభుత్వ పతనం తప్పదు. అందుకే ఈ ఉప ఎన్నికలు ఇటు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు వ్యక్తిగతంగా యడ్యూరప్పకు సవాల్ గా మారాయి.కాంగ్రెస్, జేడీఎస్ అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాతో యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది. యడ్యూరప్పకు ప్రస్తుతం 105 మంది సభ్యులున్నారు. కర్ణాటక శాసనసభలో 223 అసెంబ్లీ స్థానాలున్నాయి. 
యడ్డీకి ఉపఎన్నికల టెన్షన్

యడ్యూరప్ప ప్రభుత్వం కంటిన్యూ కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. మరో ఎనిమిది సభ్యులు యడ్యూరప్పకు అవసరం. ప్రస్తుతం జరగనున్న పదిహేను స్థానాల్లో కనీసం ఎనిమిది మందిని గెలిపించుకుంటే తప్ప యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదు.ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోటీ చేసే అవకాశం లేదు. వారు 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అందుకనే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక యడ్యూరప్పకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. తమ కోసం రాజీనామా చేసి త్యాగం చేసిన వారి వారసులకు అక్కడ టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వం ఉంది. వారు కూడా టిక్కెట్లను ఆశిస్తున్నారు. యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల వారసులకు అవకాశం ఇస్తే బీజేపీ క్యాడర్ సహకరిస్తుందా? అన్నది ప్రశ్నగానే ఉంది. అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత యడ్యూరప్పకే ఉంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల వారసులకు ఒకవేళ టిక్కెట్లు ఇవ్వకుంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది. మొత్తం మీద యడ్యూరప్పకు ఈ ఉప ఎన్నికలు కత్తిమీద సాము అనే చెప్పాలి. అత్యధిక స్థానాలను గెలవకుంటే కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తప్పదంటున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment