Breaking News

18/09/2019

మళ్లీ ఊపందుకుంటున్న రాయలసీమ ఉద్యమం

కర్నూలు, సెప్టెంబర్ 18, (way2newstv.in)
రాయలసీమ ఉద్యమం ఇటీవల కాలంలో ఊపందుకుంటుంది. కర్నూలుకు హైకోర్టు, రాయలసీమ అభివృద్ధి పేరిట ఉద్యమాలు జోరుగా సాగుతున్నాయి. చిత్తూరును పక్కన పెడితే కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉద్యమం ఊపందుకుంటోంది. రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట సదస్సులు, సభలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ విముక్తి, కర్తవ్య, కార్యాచరణపై సమాలోచలను జరుపుతున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాయలసీమలో ప్రత్యేక ఉద్యమాలు పెద్దగా కన్పించలేదు. హైకోర్టును కర్నూలులో పెట్టాలని అప్పట్లో న్యాయవాదులు, మేధావులు డిమాండ్ చేసినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. 
మళ్లీ ఊపందుకుంటున్న రాయలసీమ ఉద్యమం

హైకోర్టును అమరావతిలోనే పెట్టారు. అప్పట్లో రాయలసీమ సమస్యలపై భారతీయ జనతా పార్టీ కొంత పోరాటం చేసింది. రాయలసీమ డిక్లరేషన్ ను కూడా అప్పట్లో చేసింది.కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాయలసీమలో ఉద్యమం ఊపందుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా చేయాలని, రాయలసీమ నీటిని రాయలసీమకే ఇవ్వాలని, గోదావరి నీటిని కోస్తా ప్రాంతానికి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. అంతేకాదు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని, కర్నూలును రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ బాగా విన్పిస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలంటున్నారు.ఈ ఉద్యమం వెనక తెలుగుదేశం, బీజేపీ నేతలు ఉన్నట్లు జగన్ ప్రభుత్వం అనుమానిస్తుంది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రాయలసీమను ఇండ్రస్ట్రీ హబ్ గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలూ జగన్ ప్రభుత్వంలో ఊపందుకున్నాయి. అయితే జగన్ సర్కార్ ను ఇబ్బంది పెట్టాలనే టీజీ వెంకటేష్ వంటి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

No comments:

Post a Comment