Breaking News

04/09/2019

కనీస సౌకర్యాలకు దూరంగా వేయి స్తంబాల గుడి

వరంగల్, సెప్టెంబర్ 4, (way2newstv.in)
వరంగల్ ఉమ్మడి జిల్లాకు హెడ్ క్వార్టర్ కావడంతో ప్రముఖులు అందరూ ఇక్కడే నివాసాలు కలిగి వుండటంతో వేయి స్తంబాల గుడికి వస్తుంటారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, నగరం లోని పేరు గాంచిన ప్రముఖులు వస్తుంటారు. వీరి రాక సంధర్భంగా స్వామి వారిని దర్శించుకునే సామాన్య భక్త జనాలకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే అప్పటికే కిలో మీటర్ల దూరాల కొద్ది క్యూ లైన్లలో గంటల తరబడి కాళ్ల నొప్పులతో యాతన పడే భక్తులకు ఈ వివిఐపి, విఐపి ల దర్శనాలతో మరికొన్ని గంటల పాటు నిరీక్షణ తప్పదు.పుణ్య క్షేత్రాలకు ప్రధానంగా మౌళిక సౌకర్యాలైన స్నానపు గదులు, మరుగు దొడ్లు, విశ్రాంతి గదులు, రక్షిత తాగునీటి సరాఫరా లు ఉండాలి. 
కనీస సౌకర్యాలకు దూరంగా వేయి స్తంబాల గుడి

దీనిలో ఏ ఒక్కటి కూడా ఇక్కడ కల్పించక పోవడం శోచనీయం. ఒక్క శివరాత్రే గాకుండా అన్ని రోజులు భక్తులు దర్శించుకుంటారు. కాని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌళిక సౌకర్యాలు మాత్రం కల్పించక పోవడాన్ని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి చేరుకున్న భక్తులకు స్నానాలు చేయడానికి నీటి సౌకర్యాలు గానీ, బాత్ రూం సౌకర్యాలు కాని కల్పించడం లేదు. ఆలయ పరిసరాల్లో గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చునే భక్తుల దాహం తీరేందుకు ఆలయం లో కనీసం ఒక్క వాటర్ ట్యాంకు నిర్మాణం కాని, ఏర్పాటు కాని చేయక పోవడం నిర్వాహకుల నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనం.దర్శనం కోసం ఒక పూటంతా పడికాపు పడే భక్తులు దాహార్తి తో అల్లలాడాల్సిందే కాని నీటి చుక్క కూడా దొరకదు. వేలాదిగా చేరుకునే భక్తులకు ఆలయ పరిసరాల్లో కనీసం ఒక్క మరుగుదొడ్డి సౌకర్యం కూడా కల్పించక పోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ గుడికి వెలుపలా నిగూడంగా వున్నట్లు చుట్టు తిరిగి పోతే ఒక మూలంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ‘ఇ’ టాయిలెట్ ఉన్నది. ఇది కూడా కేవలం సింగిల్ టాయిలెట్ కెపాసిటిది మాత్రమే. దీనిని వాడుకునేందుకు, చేరుకునేందుకు కూడా సరైన మార్గం లేదు. దీని దగ్గరికి వెళ్లేందుకు ఆలయం ఆవరణలో గాని, వెలుపల గాని సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు తమ అత్యవసరాలను తీర్చు కోవడానికి ఇక్కడ గంటల తరబడి ఉక్క పట్టాల్సిన పరిస్తితి దాపురించడం దారుణమైన పరిస్తితి. భక్తులను కనీస సౌకర్యాల విషయంలో ఇంతగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా అధికారులు కాని, ఆలయ కమిటీ లు కాని వీటిపై దృష్టి పెట్టక పోవడం విడ్డూరం, దురదృష్ట కరం అని పలువురు విమర్శిస్తున్నారు. భక్తులు ఈ సమస్యలను ఈ ఒక్క శివరాత్రి తోనే కాదు గత ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఆలయ కమిటీ లు కేవలం సంవత్సరానికి ఒక సారి వచ్చే శివరాత్రి కి గుడిలోకి దర్శనానికి వచ్చి వెళ్లే మార్గాలు,సెక్యూరిటి సేవలు, పూజా పునస్కారాలు తప్ప ఇతర భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఏ మాత్రం పట్టించు కోకపోవడం ధౌర్భాగ్యం గా బాదపడుతున్నారు.అధికార యంత్రాంగాలకు దూర దృష్టి, సమన్వయం లోపించిందని సర్వత్రా చర్చలు వినపడుతున్నాయి. అత్యవసరంగా కావాల్సిన, ఏర్పాటు చేయాల్సిన అంశాలను కాకుండా సుందరీకరణ పనులకు మాత్రమే హడావుడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తక్షణ అవసరాలే కాకుండా ధీర్ఘ కాలిక అవసరాలను కూడా దృష్టి లో ఉంచుకుని వ్యూహాత్మకంగా పనులు నెరిపితే బాగుండేదని పలువురు ఆశిస్తున్నారు. ఈ గుడి అభివృద్ధి, విస్తరణ, మౌళిక సౌకర్యాల కల్పనల కోసమే అప్పట్లో 2012 సంవత్సరంలో దీని ప్రాంగణ పరిసర ప్రాంతాలలో భూ సేకరణ చేపట్టారు. దీని ప్రాంగణంలోని ప్రైవేటు వ్యక్తుల భవనాలను అప్పట్లో నేల మట్టం చేసి కావాల్సిన స్థలాన్ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు. తీసుకున్న భూమిని గుడికి సంబందించిన మౌళిక సౌకర్యాల కల్పనకు వినియోగించాలి. కాని ఇక్కడ కేవలం సుందరీ కరణ పనులకే మాత్రమే సేకరించిన భూమిని వినియోగిస్తున్నారు. మౌళిక సౌకర్యాల కల్పనను దాట వేస్తున్నారు. మౌళిక సౌకర్యాలను ఎక్కడ, ఏ స్థలం లో నిర్మాణాలు ఎప్పుడు చేస్తారో నని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కుడా, ఆలయ కమిటీలు కేవలం సుందరీకరణ పనులకు ఏర్పాట్లకు మాత్రమే ప్రధాన్యమిచ్చి, మౌళిక సౌకర్యాల అవసరాలను గాలికి ఒదిలేయడం సహేతుకంగా లేదని పలువురి అభిప్రాయం.చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశమైన వేయి స్తంబాల గుడికి దీని మౌళిక సౌకర్యాలు, అభివృద్ధి పనులు ఏ శాఖ చేపడుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. ఈ గుడి పర్యవేక్షణ, పరి రక్షణ, నిర్వాహణ కేంద్ర పురావస్తు శాఖ చూస్తున్నది. దేవుడికి చేసే దూప,దేప నైవేద్యాలు, పూజారుల, ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జీత భత్యాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోని దేవాదాయ,ధర్మదాయ శాఖ చెల్లిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ కొంత మంది కార్మికులను కాంట్రాక్ట్ పేరుతో నియమించుకుని ఆలయ శుభ్రతను, పరిసరాలను కొనసాగిస్తున్నది. అంతకు మించి అభివృధ్ది పనులు ఏమి చేయడం లేదు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే పూజారులు, ఈవో లాంటి ఉద్యోగులనే మేయింటనెన్స్ చేస్తున్నది. ఇక కుడా కేవలం సుందరీకరణ పనులకు మాత్రమే పెద్ద పీట వేస్తూ మౌళిక సౌకర్యాల విషయాన్ని గాలికి వదిలేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.మరి మౌళిక సౌకర్యాలు ఎవరు కల్పించాలో ఈ గుడిలో నెలకొన్న రుద్రేశ్వరుడికే తెలుసుండాలండాలని పలువురు భక్తులు అభిప్రాయ పడుతున్నారు. కనీసం జాతర నిర్వాహణ కు నిధులు కెటాయించక పోవడంతో ఆలయ కమిటి నిర్వాహకులు నగరం లోని రుద్రేశ్వరుడి పరమ భక్తులైన దాతలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రతి సంవత్సరం ఏర్పడుతున్నది. ఆలయ కమిటి నిర్వాహకులు ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి ఏర్పాట్ల కోసం వారం, పది రోజుల ముందు నుంచే నగరం లోని పలువురు దాతలను సంప్రదించి వివిధ రకాల పనుల కోసం నిధులను సేకరించినట్లు సమాచారం. ఈ నిధుల తోనే శివరాత్రి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని పలువురు చర్చిస్తున్నారు.

No comments:

Post a Comment