Breaking News

20/09/2019

టెన్ జన్ పథ్ లో జగన్ అధికారిక నివాసం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20, (way2newstv.in)
న్యూఢిల్లీలో సీఎం అధికారిక నివాసం ఎక్కడంటే ఎవరైనా ఏం చెబుతారు…. ఏపీ భవన్ అని ఠక్కున సమాధానం చెబుతారు. అది ఒకప్పుడు…. ఆ చిరునామా మారిపోయి చాలా ఏళ్ళైంది. అవును రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరికోరి ఢిల్లీలో ఓ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తనకూ ఓ క్వార్టర్ కావాలని కోరడంతో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ ఉదారంగా ఓ ఇల్లు ఇచ్చేసింది. అది కూడా జన్‌పథ్‌లో….. దస్ జన్‌పథ్‌ అంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నివాసానికి కూతవేటు దూరంలో. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఇళ్ల దగ్గర్లో. ఐదారు కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు దానిని తనకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ ఏనాడూ అందులో చంద్రబాబు బస చేసింది లేదు.
టెన్ జన్ పథ్ లో జగన్ అధికారిక నివాసం

ఎందుకంటే అప్పటికే విజయవాడలో అద్దె ఇంటి ఆధునీకరణ., హైదరాబాద్‌లో ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో హంగులు., హయత్‌ హోటల్‌లో బస కోసం బారెడు చెల్లింపులపై ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఆ ఇంటికి పోవడానికి చంద్రబాబుకు ధైర్యం చాల్లేదు.అలా జన్‌పథ్‌లో చంద్రబాబు తనది కానీ క్వార్టర్‌ను తనకు అనుగుణంగా మార్చుకున్నా అందులో ఉండలేకపోయారు. దీని ఆధునీకరణ కోసం సింపుల్‌గా ఓ ఐదారు కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు రాకున్నా లోకేష్‌., చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఢిల్లీ వస్తే ఆ ఇంట్లోనే ఉండేవారు. ఏపీ భవన్‌లో సీఎం కాటేజీని కూడా అదే స్థాయిలో రీ డిజైన్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ ఇల్లు వెంటనే సీపీడబ్ల్యుడి చేతుల్లోకి వెళ్లిపోవాలి. అలా జరగకుండా అక్కడ ఉన్న అధికారి చక్రం తిప్పారు. ఆ ఇంటి గురించి నిజానికి ఎవరికి పెద్దగా తెలీదు. ఏపీ సీఎం చంద్రబాబు అడిగారు. అప్పటి కేంద్ర మంత్రి చొరవతో ఇచ్చేశారు. ఆ పక్క ఇళ్లలో ఎవరుంటారని అడక్కండి. అవి వేరే విషయాలు. సీఎం మారగానే కొత్త సీఎంను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఆ ఇంటి గుట్టు కొత్త బాస్‌కు చేరవేశారు. దీంతో జగన్‌ కూడా దానినే బసగా మార్చేసుకున్నారు. అలా చంద్రబాబు కలల ఇల్లు జగన్‌ వశమైంది.రాజకీయాలు…… బ్యూరోక్రసీ కలగలిసి సాగితేనే పాలనా సజావుగా సాగుతుంది. ఐదేళ్లకో మారు అధికారం చేతులు మారినా అధికారులు మాత్రం మారరు. కొన్ని తరాల పాటు రాజకీయాల్ని., నేతల్ని చూసిన అనుభవం బ్యూరోక్రాట్లకు ఉంటుంది. ప్రభుత్వం ఎవరిదైనా కొందరు అధికారులు నిబంధనల మేరకు పనిచేసుకుంటూ పోతారు. అలాంటి వారిని పాలకులు కూడా పెద్దగా పట్టించుకోరు. రావాల్సి వచ్చినపుడు ప్రమోషన్లు., టైంకు రిటైర్‌ అయిపోవడంతో వీళ్ళ కెరీర్ ముగిసిపోతుంది. ఇంకో రకం అధికారులుంటారు. ప్రభుత్వాలు మారినా పాలనలో మాత్రం వీళ్లే చక్రం తిప్పుతుంటారు. ప్రభుత్వ పెద్దలు మారినపుడల్లా వారికనుగుణంగా వ్యవహరిస్తూ కెరీర్‌లో ఎదిగిపోతుంటారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులకు స్థాన చలనం కలిగింది. కొందరు మాత్రం పాత స్థానాల నుంచి మరింత కీలకమైన పదవుల్లోకి వచ్చారు. అవినీతి ఆరోపణలు ఉన్నవారు… గత  చంద్రబాబు ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తిన వారు కూడా కొత్త ప్రభుత్వంలో చక్రం తిప్పేస్తున్నారు. వారి సమర్ధత ఏమిటో? ఏమి చూసి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారో ఎవరికి అర్ధం కాదు. ఇటీవల జరిగిన బదిలీల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ అధికారిని నియమించారు. ఇన్నాళ్లు చంద్రబాబు సొంత మనిషిగా ముద్ర వేసుకున్న వ్యక్తిని ఏకంగా సీఎంఓ బాధ్యతలు అప్పగించడం చాలామంది అధికారులతో పాటు అందర్నీ ఆశ్చర్యపరిచింది.చంద్రబాబు గుట్లు తెలిసిన వారిని కీలక స్థానాల్లో పనికొస్తారని ప్రభుత్వ పెద్దల నమ్మకం కావొచ్చు. ఇలా గోడ దూకేసిన అధికారిని ఆ మధ్య మీడియా మిత్రులు ఏంటి సార్ ఇలా మారిపోయారని సెటైర్‌ వేస్తే కౌంటర్ పక్కనే ఉన్న కీలక నాయకుడి నుంచి వచ్చిందట….. “వాళ్లు అధికారంలో ఉన్నపుడు వాళ్లు చెప్పేది చేస్తారు….. మేం మంచిగా చూస్తే మేం చెప్పింది చేస్తారని” సమాధానం ఇవ్వడంతో ఎవరు మరుమాట్లాడలేకపోయారట. అనుభవజ్ఞులు…. అన్నీ తెలిసిన వాళ్లను కీలక స్థానాల్లో నియమించుకోవడంలో తప్పుండదు కానీ కెరీర్‌లో ఎదగడం కోసమే పనిచేసే వారిని ఎలా నమ్ముతారనేది మరో వర్గం ప్రశ్న. దీనికి కూడా సులభంగానే సమాధానం లభిస్తుంది. అధికారులకు కెరీర్‌లో ఏ స్థాయికి వెళ్లామన్నదే ముఖ్యం. రాజకీయ అండ, ఆసరా లేకుండా అవి అసాధ్యం. పదోన్నతులు, కీలక బాధ్యతలు వారి సమర్ధత కంటే రాజకీయ భరోసా మీదే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ కారణంతోనే నేతలతో అంటకాగడాన్ని వారు సమర్ధించుకుంటారు. చిన్న వయసులోనే ఆలిండియా సర్వీస్‌లోకి వచ్చిన అధికారులు చీఫ్‌ సెక్రటరీ పదవో…? అంతకు మించి సర్వీస్‌ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ పదవినో ఆశించడంలో తప్పేముంటుంది. వాళ్ల వాదన కూడా వినడానికి కరెక్ట్‌గానే ఉంటుంది. ఎవరి పక్షాన లేని వాళ్లకే ఏ పోస్టింగ్‌లు రావని మాత్రం అర్ధం చేసుకోవాలి.

No comments:

Post a Comment