Breaking News

13/09/2019

నల్గొండలో చాటేసిన వరుణుడు

కన్నీరవుతున్న రైతన్నల ఆశలు
నల్గొండ, సెప్టెంబర్ 13, (way2newstv.in)
రైతుల ఆశల సాగు మరోసారి ఆవిరవుతోంది. గత ఖరీఫ్‌లో ఆశించిన మేర వర్షాలు కురవక నష్టాలను మూటగట్టుకున్న కర్షకుడు ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాలు లేక పంటలు ఎండిపోయే స్థితిలోఉండటంతో ఆందోళన చెందుతున్నాడు. జూన్‌ మొదటి వారంలో తొలకరి పలకరించింది. దీంతో ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగా ప్రారంభమైందని రైతులు ఆనందపడ్డారు. రానురాను మండు వేసవితరహాలో ఉష్ణోగ్రతలు ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే తక్కువగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 82మిల్లీమీటర్ల్లు కాగా 111.4 మి.మీ నమోదైంది. జులై నెలలో 116 మి.మీ.లకు గాను 77.4 మి.మీ. నమోదైంది. ఇక ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 124 మి.మీ ఉండగా 86.6మి.మీ వర్షం కురిసింది.
నల్గొండలో చాటేసిన వరుణుడు

సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు వరుణుడు కరుణించలేదు.ఖరీఫ్‌ పనుల్లో తీరిక లేకుండా ఉండాల్సిన అన్నదాత వచ్చేపోయే మేఘాల వైపు దీనంగా చూస్తున్నారు. ఖరీఫ్‌ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా చినుకు జాడ లేకపోవడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి మరీ పంటలు సాగు చేసిన రైతులు నేడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.వేసిన పంట కాపుకొచ్చే దశలో వాడిపోతుంటే వర్షాల కోసం ఆకాశం వైపు చూడటం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాలు లేకపోవడంతో బోరు బావులు అడుగంటుతున్నాయి. తిండిగింజల మేర సాగు చేసిన వరి పంట ఎండుతోంది. 20 రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో పత్తి చేలు వాడు చూపుతున్నాయి. మరో వారం పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఎండిపోయిన పంటలుదున్నేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లో ఆశించిన మేర వర్షాలు లేక నామమాత్రపు దిగుబడులతో నష్టాలు చవిచూశారు. ఈ సారైనా ఆశించినస్థాయిలో వర్షాలు కురిస్తే చిన్ననీటి వనరులు సమృద్ధిగా నిండి పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతుల ఆశ నిరాశే అవుతోంది.జిల్లాలో ఖరీఫ్‌ సీˆజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం424.9 మి.మీ ఉండగా కేవలం 299.1 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది.కొండమల్లేపల్లి మండలంలో 67 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, అడవిదేవులపల్లిలో 66 శాతం, మర్రిగూడలో 65 శాతం, తిరుమలగిరి(సాగర్‌)లో 60 శాతం, చండూరులో 58 శాతం,నాంపల్లిలో 43 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సాగు నీటి వనరులు లేకపోవడంతో వర్షంపై ఆధారపడి రైతులు పంటలు సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోపంటల సాగు విస్తీర్ణం 13,300 హెక్టార్లు ఉండగా పంటల సాగుకు ఈ ఏడాది కాలం అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనడం, ప్రభుత్వం పెట్టుబడి పథకం కింద రైతులకు ఎకరాకు రూ.4వేలు సాయం అందజేయడంతో రైతులు సాధారణానికి మించి పంటలు సాగు చేశారు. మండలంలో 13,652 హెక్టార్లలో పత్తి, 1,081 హెక్టార్లలో వరి, 426 హెక్టార్లలో కంది పంటను సాగు చేశారు. ఇటీవలపగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరులేక తిండి గింజల కోసం సాగు చేసిన వరితో పాటు పత్తి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక వేలాది రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment