Breaking News

16/09/2019

పేదింట్లో ఇసుక తఫాన్ ( తూర్పుగోదావరి)

రాజమండ్రి, మే 16  (way2newstv.in): 
కొత్త విధానం అమల్లోకి వచ్చినా వరదల కారణంగా ఇసుక దొరకడం గగనమవుతోంది. ఎన్నికలు... కొత్త ప్రభుత్వం... కొత్త విధానం.. వరదలు.. ఇలా ఒక్కొక్క అవరోధంతో మార్చి నుంచి ఇసుక దొరకడం కష్టమైంది. దీంతో వివిధ రంగాలు కుదేలయ్యాయి. నిర్మాణాలు నిలిచిపోయి కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దానిపై ఆధారపడి జీవించే కార్మికుల జీవితాలు దయనీయంగా మారాయి. సరైన ఆదాయం లేక అల్లాడిపోతున్నారు. రాజమహేంద్రవరంలోని ఆల్కట్‌ గార్డెన్స్‌లో ప్రాంతంలో ఓ వ్యక్తి నిర్మిస్తున్న ఇల్లు ఇది. గాయత్రి ఇసుక ర్యాంపునకు అత్యంత సమీపాన ఉంది. ఈ ఏడాది మే నెలలో శంకుస్థాపన చేసినా బేస్‌మెంట్‌ సైతం పూర్తికాలేదు. 
పేదింట్లో ఇసుక తఫాన్ ( తూర్పుగోదావరి)

కారణం ఇసుక కొరత. నల్లబజారులో యూనిట్‌ ఇసుక రూ.6 వేలకు కొనుగోలు చేసి నిర్మాణం కొనసాగిస్తున్నామని ఇంటి యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇసుక విధానానికి ఈ నెల 5న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇసుక తవ్వకానికి జిల్లాలో 23 ర్యాంపులు, 13 స్టాక్‌పాయింట్లు గుర్తించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా కొత్త విధానం ప్రారంభించిన తరువాత ఒక్క టన్ను ఇసుక కూడా అందలేదు. పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రాకుండానే వరదలు మరోసారి జిల్లాను చుట్టుముట్టాయి. దీంతో గోదావరిలో నుంచి ఇసుక తీసుకురావడం కష్టంగా మారింది. ఇసుక అందుబాటులోకి రావాలంటే మరో నాలుగైదురోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికుల ఉపాధిపై నీళ్లుచల్లినట్టయ్యింది. జిల్లాలో ఏటా వేలాది ఇళ్లు, వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణమవుతుంటాయి. తాపీమేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, సెంట్రింగ్, వడ్రంగులు, పెయింటర్లు ఇలా నిర్మాణ, అనుబంధ రంగాలపై ఆధారపడి అయిదు లక్షల మంది కార్మికులు సుమారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరతతో కేవలం లక్ష మందికి మాత్రమే పని లభిస్తోంది.  రోజూ జిల్లాలోని వివిధ రీచ్‌ల నుంచి సుమారు నాలుగు వేల లారీల వరకూ ఇసుక రవాణా జరిగేది. ఇసుకతోపాటు కంకర, ఇనుము, సిమెంటు తదితర నిర్మాణ సామగ్రిని రవాణా చేసే లారీలకు బ్రేకులు పడ్డాయి. ర్యాంపుల మూసివేతతో 90 శాతం లారీలకు గత మూడు నెలలుగా పనిలేకుండా పోయింది. నిర్మాణాలు నిలిచిపోవటంతో కంకర రవాణాచేసే లారీలకు పనిలేకుండా పోయింది. క్రషర్ల వద్దే లారీలు నిలిచిపోయాయి. ఫైనాన్స్‌లో లారీలను తీసుకున్నవారు వాయిదా సొమ్ములు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఇసుక లేకపోవటంతో నిర్మాణ రంగం కుంటుపడిన నేపథ్యంలో సిమెంటు, ఇనుము, కలప, ఎలక్ట్రికల్, ఇటుక, కంకర, సిమెంటు ఇటుక, ప్లైవుడ్, టైల్స్, శానిటరీ, పైపులు, పెయింట్లు ఇలా ఇతర గృహ నిర్మాణాలకు అవసరమయ్యే వస్తువుల అమ్మకాలు తగ్గుతున్నాయి. అద్దె గదుల్లో దుకాణాలు నడిపేవారు అటు ఆదాయం రాక..ఇటు అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

No comments:

Post a Comment