Breaking News

23/09/2019

కమలం గూటికి నారాయణ....

నెల్లూరు, సెప్టెంబర్ 23, (way2newstv.in)
టీడీపీకి త్వరలో మరో షాక్ తగలనుంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, నిన్న మొన్నటి వరకూ మున్సిపల్ మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ త్వరలోనే పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. నారాయణ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నారాయణ ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చుతో పాటు రాజధాని భూముల వ్యవహారం కూడా నారాయణను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసిందన్నది అందుతున్న సమాచారం. నారాయణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఆయన తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. అమరావతికి కూడా ఆయన పెద్దగా వచ్చింది లేదు. ఎక్కువగా హైదరాబాద్, నెల్లూరులోనే నారాయణ ఉంటున్నారు. 
 కమలం గూటికి నారాయణ....

అయితే నారాయణకు అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని భూములు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని నిర్మాణాలను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో అక్కడి భూముల ధరలు సగానికి సగం పడిపోయాయి. దీంతో తాము అమరావతిలో కొన్న భూములను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందంటున్నారు. కొనేవాళ్లు కూడా ఎవరూ లేకపోవడంతో ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఏర్పడ్డాయంటున్నారు.దీంతో తన విద్యా సంస్థలపై కూడా ఐటీ వంటి దాడులు జరుగుతాయని నారాయణ కొంత భయపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండటం. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నారాయణ టీడీపీకి కొంత దూరంగా ఉన్నట్లే కన్పిస్తున్నారు. చంద్రబాబు జరిపే ఏ సమావేశానికి నారాయణ హాజరు కావడం లేదు. అంతేకాకుండా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినా ఆయన స్పందన లేదు. తాను పోటీ చేసిన నెల్లూరు సిటీ నియోజకవర్గాంలో కూడా ఓటమి తర్వాత పర్యటించలేదు. దీంతో నారాయణపై టీడీపీ నేతలకే డౌట్ గా ఉంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నారాయణ బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. కేంద్రంలో కీలక పదవిలో ఉన్న తమ ప్రాంతానికి చెందిన నేత ద్వారా అమిత్ షాకు చెప్పించారని వినికిడి. తన చేరికకు గ్రీన్ సిగ్నల్ తొందరగా ఇవ్వాలని నారాయణ కోరినట్లు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తమ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడంతో ఆయన చేరిక త్వరలోనే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద నారాయణ లాంటి నేత కూడా పార్టీని వీడితే చంద్రబాబును కష్టకాలంలో వదిలి వెళ్లిపోయినట్లే.

No comments:

Post a Comment