Breaking News

05/08/2019

జగన్ పై ఎదురుదాడికి వ్యూహాలు

విజయవాడ, ఆగస్టు 5, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అభివృద్ధి నిలిచిపోయిందని., రాజధాని నిర్మాణం ఆగిపోయిందని., పోలవరం నిర్మాణంలో ప్రతిష్టంబన ఏర్పడిందని రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ప్రచారంలో ఉన్న కథనాలకు రెండో పార్శ్వం కూడా ఉంది. తొమ్మిదిన్నరేళ్ల ప్రయత్నం., పోరాటం తర్వాత జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్ల పోరాటానికి., కష్టానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా గణనీయంగానే ఉంది. వైఎస్‌ మరణం తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో రాష్ట్ర విభజన చిచ్చు కూడా రాజుకుంది. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన వైఎస్‌ స్థానాన్ని ఎవరు పూడ్చలేకపోయారు.
జగన్ పై ఎదురుదాడికి వ్యూహాలు

వైఎస్‌ మరణంతో ఖాళీ అయిన పీఠాన్ని ఆయన కుమారుడికి అప్పగించాలనే డిమాండ్‌ కూడా వైఎస్‌ శిష్యగణం లేవనెత్తింది. ఇది అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లకు అసహనాన్ని కలిగించింది. ఎవరికి వారు సీఎం స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. తొలుత ముఖ్యమంత్రి పీఠాన్ని రోశయ్య అధిష్టించినా తర్వాతి కాలంలో ఆ పదవి కిరణ్‌కుమార్‌ రెడ్డికి దక్కింది.ఇదే సమయంలో జగన్‌ను ఎదగనిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్న కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత శత్రువులకు, టీడీపీ ఇతోదికంగా సహకరించింది. ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇస్తామన్న కేంద్ర మంత్రి అందినట్టే అంది చేజారిపోవడం., కాంగ్రెస్‌ పార్టీలో పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు ఊపందుకోవడం ఇవన్నీ కలిసి జగన్‌ పార్టీని వీడే వరకు వచ్చాయి. పార్టీని వీడిన తర్వాత జగన్మోహన్‌ రెడ్డిపై వేధింపులు తీవ్రమై చివరకు అరెస్ట్ చేసే వరకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి కుమారుడిని ఆ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ పార్లమెంటులో సైతం ప్రస్తావించింది. ఏపీలో 2011లో జరిగిన రాజకీయ పరిణమాలు కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ వైఖరికి నిదర్శనాలంటూ బీజేపీ అగ్రనేత అడ్వాణీ., సుష్మా స్వరాజ్‌, ప్రకాష్‌ జవడేకర్‌ వంటి నేతలు తరచూ ప్రెస్‌ బ్రీఫ్‌లలో విమర్శించే వారు. ప్రస్తుత ఉపరాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు కూడా కాంగ్రెస్‌ శైలిని తప్పు పట్టి జగన్‌ను పలు సందర్భాల్లో వెనకేసుకొచ్చారు. ఆస్తుల కేసులు., క్విడ్‌ ప్రో కో లావాదేవీల పేరుతో జగన్‌ జైలుకెళ్ళిన తర్వాత చాలాకాలం బీజేపీ జగన్మోహన్‌ రెడ్డికి అండగా నిలిచింది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో జగన్‌ అంటిముట్టనట్టు వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అనూహ్యంగా బీజేపీకి టీడీపీ దగ్గరైంది. 2014 ఎన్నికల సమయానికి బీజేపీకి వైసీపీ దూరమైపోవడానికి జగన్‌ స్వయంకృతం కొంతైతే, బీజేపీలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే నేతల మంత్రాంగం కూడా చంద్రబాబు నాయుడికి కలిసొచ్చాయి. ఫలితంగా 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. అధికారానికి., ప్రతిక్షానికి మధ్య కేవలం ఐదారు లక్షల ఓట్ల దూరంలో ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. రాజధానిగా కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 29గ్రామాల పరిధిలో దాదాపు 33వేల ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. అంతర్జాతీయ కన్సల్టెంట్లు., ఆర్కిటెక్చర్లు,దేశ విదేశాల నుంచి సూటూ బూటు వేసుకున్న వాళ్ల హడావుడితో మీడియా కూడా తీరిక లేకుండా శ్రమించింది. ప్రతి నెల ఏదొక ఈవెంట్‌.,ఏదొక హడావుడి., అభివృద్ధి జరిగిపోతుందనే భ్రమలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం క్షణం సమయాన్ని వృధా చేసుకోలేదు. ఈ హడావుడితోనే విజయవాడలో ఆతిథ్యం రంగంలో పెట్టుబడులు మూడింతలయ్యాయి. చిన్న, మధ్య తరహా హోటళ్లు సైతం బాగా లబ్దిపొందాయి. అభివృద్ధి., అవకాశాలు., పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ అందరి కోసం అనే భావనను మీడియా ప్రచారం చేసేది. ఈ క్రమంలో అవి కూడా బాగానే లాభపడేవి. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనల ఆదాయం భారీగా ఉండేది. దీనికి మీడియా సంస్థల అదనపు ప్రయోజనాలను కాపాడటంలో కూడా తెలుగుదేశం పార్టీ తగిన ప్రాధాన్యమిచ్చేది.సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత దాదాపు అన్ని మీడియా సంస్థలు రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేశాయి. ఆర్ధిక శాఖ అమోదం., నిధుల కేటాయింపు లేకపోయినా అధికారంలోకి వస్తే ఎటూ చెల్లిస్తారనే ధీమాతో ఉచితంగానే పెయిడ్‌ న్యూస్‌ నడిపించేశాయి. ఎన్నికల ఫలితాలు తారుమారైపోవడంతో తెలుగు మీడియా సంస్థలకు ఎన్నికల ఖాతాలో 100కోట్లకు పైగా చిల్లు పడింది. ప్రభుత్వం తరపున మీడియా వ్యవహారాలను నిర్వహించిన గ్రూప్‌ ఎం సంస్థకు దాదాపు 12కోట్లకు పైగా నష్టపోయింది. 2019 ఎన్నికల ఫలితాలు తారుమారైపోవడంతో మీడియా సంస్థల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు అయాచిత ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలకు ఆదాయం వచ్చే మార్గాలు తగ్గిపోవడంతో అక్కసు తీర్చుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకతను జనంలో పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఓ వైపు ప్రకటనల ఆదాయం పడిపోవడం., మరోవైపు ప్రభుత్వంలో చక్రం తిప్పే అవకాశం లేకపోవడం వాటికి మింగుడు పడటం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయంలో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడం., అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు చోటు చేసుకున్న చోట వాటిని రద్దు చేయడం, పనులే ప్రారంభించని వాటిని రద్దు చేయడం, రివర్స్‌ టెండరింగ్‌ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ పనుల్లో ప్రజా ప్రయోజనం ఎంతన్నది పక్కన పెడితే రాజకీయంగా ప్రత్యర్ధులు మాత్రం ఇబ్బంది పడతారు. రాజధాని నిర్మాణం., పోలవరం నిర్మాణం., సాగు నీటి ప్రాజెక్టులు ఇలా కీలకమైన ప్రతి అంశంలో రాజకీయం-కులం కలిసి సాగాయి.ప్రస్తుతం అధికారం చేతులు మారడంతో ఈ కుల ప్రయోజనాలకు కూడా బ్రేకులు పడ్డాయి. మరో పదేళ్లు అధికారంలో లేకున్నా పార్టీని నడిపేందుకు సరిపడ ఆర్ధిక వనరుల్ని సొంత సామాజిక వర్గానికి పార్టీ కేటాయించింది. ప్రత్యర్ధులు ఆర్ధికంగా బలపడితే తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే వాటికి కత్తెర వేసేందుకు జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజానీకానికి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. రాజధాని నిర్మాణంలో పరిపాలన నగరం నిర్మాణం ఇప్పటికే కొలిక్కి వచ్చింది. అసెంబ్ల., సచివాలయం, హైకోర్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటి స్థానంలో శాశ్వత నిర్మాణాలు ఆర్ధిక భారం తప్ప ఇంకొకటి ఉండదు. ఇక పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ కంపెనీని తప్పిస్తే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టును కేంద్ర నిధులతో రాష్ట్రమే నిర్మించినా, ఆర్‌ అండ్ ఆర్‌ కింద 30వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారాన్ని రాష్ట్రం మోయగలుగుతుందా అన్నది మరో ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం దాని ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగని తప్పిస్తే కేంద్ర జలవనరుల శాఖ కూడా విచారం వ్యక్తం చేసింది. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదనే సంగతిని విస్మరించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయడంలో జరిగిన తాత్సారం గత రెండు మూడేళ్లుగా ఆంధ్రా ప్రజానీకం చూస్తున్నదే.రాష్ట్రంలో ఇకపై 100కోట్లకు మించిన కాంట్రాక్టుల్లో జ్యూడిషియల్ కమిషన్ అమోదం పొందాల్సి ఉండటం., రాజధాని నిర్మాణంలో అక్రమాలను వెలికి తీయడం ఇవన్నీ రాజకీయంగా ప్రత్యర్ధులను ఇరకాటంలోకి నెడతాయి. ప్రభుత్వ చర్యలతో తమ ప్రయోజనాలకు నష్టం కలుగుతుండటాన్ని కొన్ని ప్రసార మాధ్యమాలు సహించలేకపోతున్నాయి. అందుకే పత్రికల్లో తమ వంతుగా జనంలో గందరగోళం సృష్టించే కథనాలను వండివారుస్తున్నాయి. ప్రభుత్వ అసమర్ధత, వైఫల్యాలను ఎండగడుతున్నమనే భావనలో అక్షరాలను అచ్చేస్తున్నాయి. నిజానికి జగన్మోహన్‌ రెడ్డి చర్యలు ప్రత్యర్ధులు బలపడకుండా ఉండటం కోసమే చేస్తున్నవి. వాటితో ఆయన ఏ మేరకు లాభపడతారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. కుల ప్రయోజనాల విషయంలో గత ప్రభుత్వం మాదిరే వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆయనకు తెలియనిది కాదు.

No comments:

Post a Comment