Breaking News

22/08/2019

అడ్డూ, అదుపు లేకుండా బ్లాస్టింగ్

జనగాం‌, ఆగస్టు 22, (way2newstv.in)
మొన్నటివరకూ పచ్చని ప్రకృతిలో ఉన్నామనుకున్నారు. కానీ వీళ్లున్నది ప్రాణం పోయే ప్రమాదపు అంచునని ఇప్పుడు తెలిసొచ్చింది. కొత్తగా పెట్టిన క్రషర్‌తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.ప్రకృతిపై పగబట్టారు. బాంబుల మోతలు మోగిస్తున్నారు. ఓ వైపు నిద్ర పట్టనివ్వని క్రషర్‌ శబ్ధం. మరోవైపు ఎప్పుడూ మబ్బు పట్టినట్లు కనిపించే దుమ్ము. నిత్యం దుర్వాసనతో నరకం చూపే డాంబర్‌ ప్లాంట్‌. ఇదీ బ్రతుకే భారంగా, నరకంగా సాగుతోన్న కాశీమ్‌ నగర్‌ ప్రజల జీవనంజనగాం జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఇప్పగూడెం కాశీమ్‌నగర్‌ చిన్న గూడెం. సుమారు 40 ఏళ్ల నుంచి 40 కుటుంబాల ప్రజలు ఇక్కడే బతుకుతున్నారు. క్రషింగ్ పెట్టిన గుట్టకే వెళ్లి వీరంతా క్వారీ పనులు చేసేవారు.
అడ్డూ, అదుపు లేకుండా బ్లాస్టింగ్

తరువాత ఇళ్లకు చుట్టుపక్కల వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేస్తున్నారు. క్రషర్‌ పెట్టే ముందు వరకు వీరికి ఎలాంటి సమస్యలు లేవు. అడవిలో నిశ్శబ్దపు జీవనం సాగిస్తున్న వీళ్లంతా ఇప్పుడు స్టోన్‌ కట్టింగ్ క్రషర్, డాంబర్ ప్లాంట్ దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు.ఈ ప్రాంతానికి చెందిన వారు ఇప్పుడు గూడు కట్టుకుందామనుకున్నా.. వీల్లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అనుమతులో.. ఆర్థిక ఇక్కట్లో కాదు.. ఈ క్రషింగ్‌ యూనిట్‌ సృష్టిస్తోన్న ప్రకంపనలే దీనికి కారణం. ఇక్కడ ఇళ్లు కట్టుకుందామనుకున్నవారు ఇప్పుడు క్రషర్‌ ఎఫెక్ట్‌తో వెనక్కి తగ్గారు. ఫలితంగా చాలా ఇళ్లు బేస్‌మెంట్‌ దగ్గరే ఆగిపోయాయి. క్రషర్‌ కోసం 80 నుంచి 100 ఫీట్ల వరకు డ్రిల్‌ చేసి పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. దీంతో 400 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లూ కంపిస్తున్నాయి. బాంబుల బ్లాస్టింగ్ తీవ్రతకు కాశీమ్‌నగర్‌లో గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలైతే ఉలికులికి పడుతున్నారు.ప్రలోభపెడుతున్నారు. కాదంటే భయపెడుతున్నారు. భూములు కౌలుకివ్వాలంటారు. లేదంటే అమ్మమంటారు. చిన్న క్రషర్‌ అని చెప్పి పెద్ద ఎత్తున భూములు లాక్కొని చేస్తున్న మైనింగ్‌తో యజమానులు పెద్ద ఎత్తున సంపాదిస్తుంటే.. ఉన్న భూముల్లో పంటలేసుకున్న రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా మంది భూములు లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.క్రషర్‌కు భూమి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన సోమయ్య అనే రైతు భూమి మొత్తం.. ఇప్పుడు బ్లాస్టింగ్‌ రాళ్లతో నిండిపోయింది. చెప్పకుండా బ్లాస్ట్ లు చేస్తున్నారని.. బావి వద్ద పశువులను ఉంచాలంటే భయపడాల్సిన పరిస్థితని వాపోతున్నారాయన. లక్షల్లో పంట తీసుకొని బతుకుతున్నామనంటే ఎకరానికి ఐదు వేలు ఇస్తామని కౌలుకివ్వమని ఇబ్బంది పెడుతూ క్రషర్‌ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారంటున్నారు.అందరికీ బ్లాస్టింగ్ ఉందని చెప్పేందుకు సైరన్ వినిపించాలి. కానీ కాశీమ్‌ నగర క్రషర్‌ దగ్గర అలాంటి పరిస్థితి లేదు. వారి ఇష్టమొచ్చినట్లు బ్లాస్టింగ్‌ చేసి ఏం పట్టనట్లు ఉంటున్నారని రైతులు అంటున్నారు. బ్లాస్టింగ్‌లో ఎలుగుబంటి చనిపోయిందని తెలిసి చూద్దామని వెళ్లే సరికి దానిని మాయం చేశారని రైతులు చెబుతున్నారు. ఇక క్రషర్‌ నుంచి వచ్చే దుమ్ము పంట పొలాల్లో పడుతుండటంతో జంతువులు గడ్డిని మేయడం లేదు.ఊర్లో నాయకులు క్రషర్‌ యజమానులకే సపోర్ట్‌ చేస్తున్నారు చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్  సమస్యను పరిష్కరించాలని కాశీమ్‌ నగర ప్రజలు జనగాం కలెక్టర్‌ దేవసేనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే కలెక్టర్‌ మైనింగ్ ఏడీకి, మండల ఎమ్మార్వోకి విషయంపై విచారణ చేపట్టమని ఆదేశించారు. అధికారులు అక్కడికి వెళ్లారు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. 

No comments:

Post a Comment