Breaking News

09/08/2019

నవ్వుకున్నాళ్లకు నవ్వుకున్నంత మన్మధుడు

హైద్రాబాద్, ఆగస్టు   (way2newstv.in - Swamy Naidu):
అవును.. నాగార్జున గారూ!! ప్రేమకు వయసేంటి? అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నిత్య నూతనమే. అలాగే ప్రేమకథలు కూడా పాతబడిపోవు. రోజుకో కొత్త కథ పుట్టుకొస్తూ నిత్య నూతనంగా నిలుస్తుంటాయి. అయితే కథ చెప్పే విధానంలోనే కొత్తదనం ఉండాలి. పాత కథ పట్టుతప్పి పాత చింతకాయ పచ్చడి కాకుండా అచ్చతెలుగు కొత్త ఆవకాయలా వడ్డించడాన్ని తొలి చిత్రం ‘చి.ల.సౌ’తో ఒంటపట్టించుకున్న రాహుల్ రవీంద్రన్.. రెండో చిత్రం ‘మన్మథుడు 2’తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేశాడో లేదో సమీక్షలో తెలుసుకుందాం. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం వచ్చిన కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా నేడు (ఆగస్టు 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మన్మథుడు 2’. ఆరు పదుల వయసులో నాగార్జున ప్లే బాయ్‌గా నటిస్తే.. ఈ ముదురు హీరోని ప్రేమ ముగ్గులో దింపేందుకు జోడీ కట్టింది రకుల్ ప్రీత్. ఈ ఇద్దరి ప్రేమ కథ ఎలా కంచెకి చేరిందంటే.. సాంబశివరావు (నాగార్జున) షార్ట్ కట్‌లో సామ్. 
నవ్వుకున్నాళ్లకు నవ్వుకున్నంత మన్మధుడు
పోర్చుగల్‌లో ఉండే ఇతని వృత్తి వాసన చూడటం. అదేనండీ వాసన చూసి రకరకాల పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తుంటాడు. మన ఊళ్లలో అత్తరు సాహెబు మాదిరి పోర్చుగల్‌లో ఫేమస్ పెర్ఫ్యూమ్ ప్రొఫెషనల్ అన్నమాట. ఇక మన సాంబశివరావుకి తల్లి (లక్ష్మి) ఇద్దరు అక్కలు (ఝాన్సీ, దేవదర్షిని) ఒక చెల్లి, ఇద్దరు బావలు ఇలా పెద్ద ఫ్యామిలీతో పాటు పర్సనల్ అసిస్టెంట్‌గా కిషోరా (వెన్నెల కిషోర్) ఉంటాడు. అందరికీ పెళ్లి అవుతుంది కాని.. సామ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. దీని వెనక సింప్లీ లవ్ స్టోరీ ఉంటుంది. గతంలో సామ్ ప్రేమించిన సుమ (కీర్తి సురేష్) తన ఫ్యామిలీకి నచ్చకపోవడంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను వదిలేసి ‘ఒక పూట భోజనం కోసం వ్యవసాయం’ చేయలేనని బంధాలు, బంధుత్వాలు బుల్ షిట్ అనుకుని ప్లే బాయ్‌గా మారతాడు. అప్పటి నుండి తనకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ.. జనాలకు ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా చూపిస్తుంటాడు. పెళ్లి మీద ఆసక్తిలేదు సూటిగా శోభనమే అని అమ్మాయిల్ని వాసనతో పడగొట్టి లైఫ్‌ని ఎంజాయ్ చేసే సామ్‌.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని లేదంటే ఈ ఫ్యామిలీ నీకు దక్కదని తల్లి లక్ష్మి ఎమోషన్ కావడంతో తనతో పెళ్లి నాటకం అడేందుకు ఓ ప్రియురాలిని వెతికే పనిలో పడతాడు. అయితే పోర్చుగల్‌లో చదువు కోసం వచ్చి.. ప్రియుడి చేతిలో మోసపోయి, ఇండియాలో ఉన్న ఫ్యామిలీకి దూరమైన అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్) కాఫీ షాప్‌లో వెయిటర్ పనిచేస్తుంటుంది. ఆమె తెలుగు అమ్మాయి కావడంతో మూడు నెలల పాటు తనను ప్రేమించినట్టు నాటకం ఆడాలని.. పెళ్లిరోజు తనను విడిచివెళ్లి పోయినట్టుగా నటిస్తే అడిగినంత డబ్బు ఇస్తానని అవంతికతో అగ్రిమెంట్ చేసుకుంటాడు సామ్. మరి ఆ తరువాత ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? సామ్‌తో అవంతిక పెళ్లి అయ్యిందా? ప్లే బాయ్ సిన్సియర్ ప్రేమికుడిగా ఎలా మారాడు? అన్నదే మిగిలిన కథ. సుమారు 17 ఏళ్ల కిత్రం అంటే 2002లో అక్కినేని నాగార్జున హీరోగా ‘మన్మథుడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ముఖ్యంగా ఆ కాలం అమ్మాయిలైతే అస్సలు మరిచిపోరు. ఎందుకంటే, ఈ సినిమాతో నాగార్జున మన్మథుడికి కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఆయన అందం, పంచ్ డైలాగులు, కామెడీ ఇవన్నీ ‘మన్మథుడు’ సినిమాకు ప్రధాన బలాలు. ఆ సూపర్ హిట్ సినిమాను తలపిస్తూ ఇప్పుడు ‘మన్మథుడు 2’ను తెరకెక్కించారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. మంచి కథ దొరికినప్పుడు ఆ కథను డీసెంట్‌గా ప్రజెంట్ చేసే విధానాన్ని తొలి చిత్రంతోనే అలవర్చుకున్నాడు ఈ యువ దర్శకుడు. వాస్తవానికి ఇతడు మంచి నటుడు కావడంతో ఈజీగా మెగాఫోన్ మూవ్ చేస్తున్నారు. ఏ దర్శకుడైనా ముందుగా ఒక హీరోని ఊహించుకుని కథను రాసుకోవడం.. అలాగే కథ రాసిన తరువాత హీరోని అనుకోవడం జరుగుతుంటుంది. ఈ ‘మన్మథుడు 2’ కథ అయితే నాగార్జున కోసమే రాసిన కథలా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆరు పదుల వయసులో నవ మన్మథుడిలా కనిపించే క్యారెక్టర్‌ను వెతకడం చిన్న విషయం కాదు. 30 ఏళ్ల హీరోయిన్ పక్కన గ్రీకువీరుడిలా కనిపించాలంటే టాలీవుడ్‌లో నాగార్జున తప్ప వేరే ఛాయిస్ లేదని ‘మన్మథుడు 2’ చిత్రంతో ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఈ సినిమాలో ఓ కొత్త నాగార్జునను చూపించారు దర్శకుడు. తొలి సీన్‌తోనే ‘మన్మథుడు 2’ ఫన్ రైడ్ స్టార్ట్ చేసిన దర్శకుడు సైడ్ ట్రాక్‌లు లేకుండా సూటిగా కథ చెప్పుకుంటూ పోయాడు. మన్మథుడ్ని ప్లే బాయ్‌గా చూపిస్తూ ఆయనలోని కామెడీ సెన్స్‌నూ పూర్తిగా వాడుకున్నారు. ఆవిడా మా ఆవిడే, రక్షణ చిత్రాల్లో నాగార్జునను గుర్తుచేస్తూ కామెడీతో పొట్ట చెక్కలు చేశారు. ఇక నాగార్జున లుక్స్.. అక్కినేని అభిమానుల్ని మళ్లీ మళ్లీ థియేటర్స్‌కి వచ్చేలా చూపించారు. ఎప్పటిలాగే నాగార్జునను స్క్రీన్‌పై చూస్తుంటే ఇతనికి నిజంగానే 60 ఏళ్లా? అనే సందేహం కలగక మానదు. ఇక పోర్చుగల్ మోడల్స్‌‌‌తో ముద్దులు, వాళ్లతో రొమాన్స్‌ విషయంలో చెలరేగిపోయారు నాగార్జున. ఫస్టాఫ్ ఫన్ రైడ్‌లో నాగ్ రొమాన్స్ A సర్టిఫికేట్ సినిమాను తలపించినప్పటికీ.. కామెడీని జోడించడంతో ఇబ్బందికరంగా అనిపించదు. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హర్ట్ అయ్యేలా కాకుండా హాస్యం పండేవిగానే ఉన్నాయి. బూతులు బాగానే ఉండటంతో బీప్స్ శబ్ధాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అవంతికలా నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇన్నేళ్ల తరువాత ఓ ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడినా.. హిట్లు కొట్టినా.. ఉన్నానంటే ఉన్నాను.. ఆడానంటే ఆడానంటూ కేవలం గ్లామర్‌తోనే బండి లాక్కొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం ద్వారా తనలోని పూర్తి స్థాయి నటిని బయటకు తీసింది. స్వతంత్ర భావాలు ఉన్న యువతిగా దర్శకుడు రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తనలోని గ్లామర్ యాంగిల్‌ని ఉపయోగిస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌లో మెచ్యూర్డ్‌గా నటించింది. తన క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగా వేరియేషన్ చూపిస్తూ మందు కొడుతూ.. సిగరెట్ తాగుతూ రచ్చ చేసింది. ముఖ్యంగా ఝాన్సీకి కిస్ పెట్టే సన్నివేశం పీక్స్ అనే చెప్పాలి. కామెడీ ట్రాక్ అనేది ప్రధాన కథకు బ్రేక్‌లు వేయకుండా పాత్రల్ని కథలో ఇమిడింపచేయడంలో దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ద్వారా ఫన్‌ని రాబట్టడంతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రాధానంగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ పాత్ర గురించి. మన్మథుడు చిత్రంలో బ్రహ్మానందం.. లవంగం పాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కిషోరా’ పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు. నాగార్జున-వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్లు పొట్ట చెక్కలు చేస్తాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌లో పెళ్లి క్యాన్సిల్ అయ్యే సీన్‌లో వీరి కామెడీ పీక్స్ అనే చెప్పాలి. హాస్యం కోసమే వెన్నెల కిషోర్ ట్రాక్ అన్నట్టుగా మాత్రమే కాకుండా కథలోనూ భాగం చేశారు దర్శకుడు. ట్విస్ట్‌ల కోసమే కథ కాకుండా.. పంచ్‌లు ప్రాస కోసమే సంభాషణలు అన్నట్టుగా కాకుండా ఫన్ రైడ్‌ను ఆసక్తికరంగా మలిచారు. వెన్నెల కిషోర్‌‌తో పాటు ఝాన్సీ, లక్ష్మి, దేవ దర్శిని, రావు రమేష్ ఫుల్‌గా నవ్వించారు. అత్తరు పుష్పరాజుగా రావు రమేష్ వేసిన పంచ్‌లు థియేటర్స్‌లో బాగా పేలాయి. ‘వేటగాడు వెర్రిపప్ప అయితే పిట్ట పిల్లి మొగ్గలేసింది’, ‘చెరువు ఎండిపోయి చేపలు ఏడిస్తే.. గద్ద వచ్చి గుడ్డు మిగింది’ లాంటి డైలాగ్స్‌‌కి చప్పట్లు పడ్డాయి. ఇక నాగార్జునకు తల్లిగా నటించిన లక్ష్మి మరోసారి తన సీనియారిటీని చూపించారు. తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఎమోషన్ సీన్లలో నాటకీయత మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాలో సమంత కూడా ఓ సీన్‌లో మెరిసింది. మామకే ఝలక్ ఇచ్చి అంతలోనే మాయమైంది. ఇక ‘మన్మథుడు’లో లవంగం పాత్రలో పొట్ట చెక్కలు చేసిన బ్రహ్మానందం.. ఈ సినిమాలోనూ కనిపిస్తారు. అయితే ఆయన ఎందుకు వచ్చారు.. ఎందుకు వెళ్లారు అన్నది ఎవరికీ తెలియదు. ఫస్టాఫ్ మొత్తం చాలా సాఫీగా సాగుతుంది. ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌తో సెంకడాఫ్‌లోకి తీసుకువెళ్లిన దర్శకుడు ఆ ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయారు. తరువాత కథ ఏం జరగబోతుందో ఇంటర్వెల్‌లోనే రివీల్ కావడంతో కథ స్లో అవుతుంది. ఇక క్లైమాక్స్ కూడా నాటకీయంగానే ముగియడం ‘మన్మథుడు 2’లో లోటు. ఇక టెక్నికల్ పరంగా సినిమా మొత్తాన్ని పోర్చుగల్‌లో షూట్ చేయడం వల్ల చాలా రిచ్‌గా అనిపిస్తుంది. విదేశీ అందాలు మెస్మరైజ్ చేస్తాయి. పోర్చుగల్ అందాలతో పాటు నాగార్జునను, రకుల్‌ను చాలా అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ ఎం. సుకుమార్. ఆరెక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుండటమే కాకుండా.. ఆ సాంగ్స్‌ని సందర్భానుసారంగా వాడుకున్నారు. కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్ మాటలు పేలాయి. ఓవరాల్‌గా.. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత.. నాగ్ లుక్ చూసి కుళ్లుకునేవాళ్లకు కుళ్లుకునేంతగా ‘మన్మథుడు 2’ ఫుల్ ఫన్ రైడ్.

No comments:

Post a Comment