Breaking News

07/08/2019

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యం

నల్గొండ, ఆగస్టు 07, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించే పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. విత్తు నాటే దగ్గరి నుంచి మార్కెట్‌లో పంటను అమ్ముకునే వరకు సమితి సభ్యులు రైతుకు అన్నివిధాలా సహకారం అందిస్తారని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. రైతుల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని రైతు సమన్వయ సమితి చూస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు అధికంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు మొదటగా ఎగుమతులు చేయాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని సమితి ఆశిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ వంటి వాటిని జోడిస్తే.. లాభార్జన పెరిగి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని భావిస్తోంది. 
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యం

అయితే వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా మార్కెటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ వంటి వాటిపై అధ్యయనం చేయనున్నట్లు సమితి తెలిపింది.ఇందులో భాగంగా కల్తీ లేని నాణ్యమైన వ్యవసాయ ఆహార ఉత్పత్తులను ప్రజలకు నేరుగా అందించేందుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ముందుకొచ్చింది. బహిరంగ మార్కెట్లలో కల్తీ లేని ఉత్పత్తి కానరావడంలేదు. ఈ నేపథ్యంలోనే వినియోగ దారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు మద్దతు ధరను అందించినట్టవుతుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చెబుతోంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. సమితులే సొంతంగా ఔట్‌లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమ య్యింది. ఇదేగాక ప్రైవేటు పరిశ్రమలు, ఫుడ్ పార్కుల (పీపీపీ) భాగస్వామ్యంతో పనిచేసేందుకు సంసిద్ధతను తెలిపింది. సమితుల ఆధ్వర్యంలో బియ్యం, పప్పులు, జొన్నలు, పిండి వంటి పదార్థాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని, గ్రామ రైతు సమన్వయ సమితులనే ఎఫ్‌పీఓలుగా ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. దీనివల్ల రైతులను శక్తివంతులుగా చేయడం సులభమవుతుంది. పంట ఉత్పత్తులు చేతికొచ్చిన తర్వాత గోదాంలు, ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీలను వినియోగించుకుని నిరంతరం ఉత్పత్తులను వినియోగదారులకు సరఫరా చేయాలని యోచిస్తోంది. వీటితో పాటు క్రాప్ కాలనీల ఏర్పాటు, సహకార సంఘాల బలోపేతం వంటి లక్ష్యాలను కార్పొరేషన్ పెట్టుకుంది.సీఎం కేసీఆర్ రైతు సమితుల ఏర్పాటు సమయంలో చెప్పిన స్థాయిలో రైతులకు అవి ఉపయోగపడడంలేదు. దీంతో సమితుల ఏర్పాటు.. నిరుపయోగంగా మారకుండా ఉండడంతో పాటు రైతులకు ఆదాయం చేకూర్చేందుకు అధికారులు ఔట్‌లెట్ల ప్రారంభం ఆలోచన చేసినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో రైతు సమన్వయ సమితులు సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తే.. రైతులకు ఊహించని లాభాలు రావడం ఖాయం. కానీ పలు కారణాలరీత్యా ఇప్పటివరకు రైతు సమన్వయ సమితులు.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. అధికారులు యోచిస్తోన్న కొత్త ప్రణాళికతోనైనా సమితులు క్రీయాశీలక పాత్ర పోషిస్తే.. బాగుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.రైతు సమన్వయ సమితుల ఏర్పాటు సమయంలో జనరల్ మేనేజర్ పోస్టు ఉండగా, ప్రస్తుతం దాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మార్చనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం రైతు సమన్వ య సమితి కార్పొరేషన్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో కొనసా గుతోంది. త్వరలోనే దీన్ని జూబ్లీహిల్స్‌లోని పట్టు ఉద్యానవన సంస్థ ప్రాంగం ణలోకి మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. జిల్లా, మండల స్థాయిలో 24 మంది సభ్యులు ఉండగా, గ్రామస్థాయి రైతు సమితిలో 15 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌లో లక్షలన్నర మంది సభ్యులున్నారు. ఈ సమితుల ఏర్పాటు నుంచి వీరి ద్వారా రైతుల్లో  చైతన్యం కల్పించాలని, పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

No comments:

Post a Comment