Breaking News

22/08/2019

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలి

సాంకేతిక సహాయంతోనే పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు
రాష్ట్ర, జాతీయ  శాస్త్ర, సాంకేతిక మండలుల తొలి  సమావేశంలో మంత్రి అల్లోల
సమావేశాలను ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (way2newstv.in)  
సీయం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మకమైన ఆలోచనలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని అటవీ, పర్యావరణ, శాస్త్ర & సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ విభాగం ఆద్వర్యంలో  మొదటి శాస్త్ర, సాంకేతిక మండలుల సమావేశాలు  హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. 
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలి

బేగంపేట లోని హోటల్ హరిత ప్లాజాలో ఈ సమావేశాలను గురువారం అటవీ, పర్యావరణ, శాస్త్ర &సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.మూడు రోజుల పాటు (ఆగస్టు 22-24 ) ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ సలహాదారు దేబప్రియ దత్తా,  ఎస్టీ- టిడిటీ మెంబర్ సెక్రటరీ రవీందర్ గౌర్, ముంబాయి ఐఐటీ ప్రొఫెసర్ సతీష్ బి. అగ్నిహొత్రి,  తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ రవి కుమార్ పులి, వివిధ రాష్ట్రాల శాస్త్ర సాంకేతిక మండళ్ల కార్యనిర్వహణ అధికారులైన ప్రోఫెసర్లు, సైంటిస్ట్ లు, సాంకేతిక నిపుణులు, తదితరులు  హాజరయ్యారు.  ఈ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రస్తుత దేశ పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.  టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉంది.  సాంకేతికత సహాయంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూనే, ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసుకుంటు సీయం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. 20 ఏళ్లలో పూర్తి అయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్... సీయం కేసీఆర్ దృడ సంకల్పంతో, ఆధునిక పరిజ్ఞానం సహాయంతో మూడేళ్లలో పూర్తి చేసుకున్నాం. సముద్రమట్టానికి మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉంది.  300 మీటర్ల నుంచి 650 మీటర్ల ఎత్తు వరకు  నీటిని తేవడమనేది ఇంజనీరింగ్ అద్భుతం. రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా డిజైన్ రూపొందించటం మామూలు విషయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే కాకుండా దేశంలోనే ఓ అద్భుత నిర్మాణం అని చెప్పవచ్చు.  విధాన నిర్ణయాల్లో శాస్త్ర,సాంకేతికతను ఉపయోగించడం వల్ల అద్భుత ఫలితాలు రాబట్టవచ్చు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఆన్ లైన్ లో  నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమా అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 58.33 లక్షల మంది రైతులకు  ఎకరానికి రూ.10 వేలను రెండు ధపాలుగా వారి అకౌంట్లలో జమా చేస్తున్నాం.  ప్రతి నెల 39 లక్షల మందికి  డిజిటల్ టెక్నాలజీతో ఆసరా ఫించన్ల డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమా చేస్తున్నాం.  పౌర సేవలకు సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల డబ్బులు నేరుగా లబ్ధిదారులు అందడంతో పాటు వారి విలువైన సమయం ఆదాకావడం, అదేవిధంగా పారదర్శకత కూడా ఉంటుందని అన్నారు. ఇక వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరిత హరం కార్యక్రమం చేపట్టింది.  రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం పచ్చదనాన్ని   33 శాతానికి పెంచేందుకు... తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.  ఇప్పటికే నాలుగేళ్లు  పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, వరుసగా ఐదవ  ఏడాదిలోకి అడుగుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన హరితహారం కార్యక్రమంలో... అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో... మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ పరిధిలో నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 113 కోట్ల మొక్కలు నాటాం. ఈ 5వ విడత హరిత హరం కార్యక్రమంలో భాగంగా 83 కోట్ల మొక్కలు నాటాలని నిర్ధేశించుకున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా  వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపానికి కారణమయ్యే కర్బన కారకాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని నిర్దేశించుకున్నాయి. దశాబ్దాలుగా వాతావరణంలో ‘కార్బన్ డయాక్సైడ్’ పేరుకుపోతోంది. దీంతో భూతాపం క్రమంగా పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని, వర్ష నమూనాలు తారుమారవుతూ, వానలు పడే రోజులు తగ్గుతున్నాయి.  వందల సంవత్సరాల క్రితం 280 ‘పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)’గా ఉన్న కార్బన్ డయాక్సైడ్ ప్రస్తుతం 411 పీపీఎమ్కు చేరింది. ఏటా దాదాపు మూడు వేలకోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. కొన్ని దశాబ్దాల క్రితం వాతావరణంలో 0.03 శాతంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ ప్రస్తుతం 0.04 శాతానికి చేరింది. ప్రతి కార్బన్ డయాక్సైడ్ అణువు కొన్ని దశాబ్దాలపాటు వాతావరణంలోనే ఉంటుంది. ఉష్ణాన్ని బంధించుకునే స్వభావం ఉన్న కార్బన్ డయాక్సైడ్తో పాటు, ‘గ్రీన్ హౌస్’ వాయువుల ప్రభావంతో భూ ఉపరితలం, సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పెరగకుండా చూడాల్సిన భాద్యత మనందరిపై ఉంది,  ప్రతి దేశం వాతావరణ పరిస్థితులపై అవగాహన కలిగించడంతోపాటు, పౌరుల్లో చైతన్యం  తీసుకురావాలి. భూతాపానికి కారణమయ్యే కర్బన కారకాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలి. ప్రపంచంలో సంభవించే విపత్తులకు వాతావరణ మార్పులే కారణమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో పరిష్కార దిశగా పర్యావరణవేత్తలు,సైంటిస్ట్ లు పరిశోధనలు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పర్యావరణ సమతుల్యతను  కాపాడేందుకు   అందరూ కృషి చేయాలి. స్థిరమైన అభివృద్దిని సాధించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ తోడ్పడాలి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పథకాల రూపకల్పన జరగాలని మంత్రి అన్నారు. 

No comments:

Post a Comment