హైద్రాబాద్, ఆగస్టు 7, (way2newstv.in)
గోదావరి,కృష్ణా బేసిన్‌లో కురిసిన భారీవర్షాలు భాగ్యనగర మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాయి. గ్రేటర్‌వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో జలమండలి ట్యాంకర్లకు కొంత డిమాండ్ తగ్గే సూచనలు ఉన్నాయి. మొన్నటి వరకు వానలు లేక నగర వ్యాప్తంగా లక్షపైనే బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా ఒకేసారి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఆ మేరకు సరఫరా చేయలేక జలమండలి ఒక దశలో చేతులెత్తేసింది. ఒక్కో ట్యాంకరు కోసం పది రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వానలతో భూగర్భ జలాలు పెరిగి.. చాలా వరకు బోర్లు రీఛార్జి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్న ఇళ్ల వద్ద భూగర్భ జలాలు పెరగనున్నాయి.హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించే ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, సింగూరు జలాశయాల్లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో ఆందోళనలో ఉన్న జలమండలికి ఈ వర్షాలు ఊపిరిపోసాయి.
హైద్రాబాద్ కు తప్పిన నీటి గండం...
ఎల్లంపల్లి, సింగూరులోకి భారీగా వరద కొసాగుతుండటం, నాగార్జున సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వస్తుండటంతో అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదేవిధంగా వరద కొనసాగితే వారం రోజుల్లో నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సాగర్‌లోకి కొత్త నీరు వస్తే అత్యవసర పంపింగ్ అవసరం ఉండదు, దీంతో జలమండలికి ఖర్చు కూడా కలిసొస్తుందని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భజలం పెరగడంతో ఎండిపోయిన బోర్లు తిరిగి పనిచేస్తున్నాయి. జలమండలిపై ఒత్తిడి కూడా తగ్గింది. ప్రాజెక్టులు పూర్తిగా నిండితే మరో ఏడాదిన్నర వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి కష్ణా జలాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను నగరానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ వాసుల నీటి అవసరాలను తీర్చడంలో ఈ రెండు ప్రాజెక్టులే కీలకం. సింగూరు, మంజీరా ఎండిపోవడంతో అక్కడ నుంచి నీటి తరలింపును నిలిపివేశారు. సాగర్‌లోనూ నీటి మట్టం తగ్గడంతో ప్రస్తుతం అత్యవసర పంపింగ్ ద్వారా తోడి నగర అవసరాలను తీరుస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు. కానీ నాలుగున్నర టీఎంసీలకు మట్టం పడిపోయింది. ఇక్కడా అత్యవసర పంపింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లిలోకి కొంత నీటిని ఎత్తిపోశారు. ఇంతలో మహారాష్ట్రలో వర్షాలు పడటంతో గోదావరిలోకి వరద పెరిగింది. కడెం, ఎల్లంపల్లిలోకి నీటి రాక ప్రారంభమైంది. ప్రస్తుతం ఎగువ నుంచి ఎల్లంపల్లికి 45 వేల క్యూసెక్కులపైన ప్రవాహం ఉంది. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 12 టీంఎంసీలకు చేరువలో ఉంది. ప్రవాహం ఇదేతీరున కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం 172 మిలియన్ గ్యాలన్లు నగరానికి తీసుకొస్తున్నారు. నీటి మట్టం పెరగడం వల్ల గోదావరి జలాలపై భరోసా దొరికింది.ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ జలాలపైనా ధీమా పెరుగుతోంది. జూరాల నుంచి 2.23 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. మొత్తం రోజుకు 16 టీఎంసీలు వరకు చేరుతున్నాయి. ఇదే ప్రవాహం వారం పది రోజులపాటు సాగితే శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌లోకి నీళ్లు రానున్నాయి. సాగర్ నుంచి ప్రస్తుతం నగరానికి 270 ఎంజీడీలు తరలిస్తున్నారు. మట్టం తగ్గడంతో రూ.3 కోట్ల వ్యయంతో అత్యవసర పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి.. నీటిని తోడి అక్కంపల్లి బ్యారేజీకు అనుసంధానమైన కాల్వలోకి ఎత్తిపోతున్నారు. సాగర్‌లో నీటి మట్టం పెరిగితే అత్యవసర పంపింగ్‌ను ఆపేసి గ్రావిటీ ద్వారా తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లోకీ వరద చేరితే మరికొంత భరోసా దక్కుతుంది. వీటినుంచి గతంలో 120 ఎంజీడీలు తరలించేవారు. మధ్యలో బీరు, శీతలపానీయ పరిశ్రమలు, కొన్ని పరిశ్రమలకు బల్క్‌గా సరఫరా చేసేవారు.తద్వారా రూ.10కోట్లువరకు జలమండలికి ఆదాయం వచ్చేది.సరఫరా లేకపోవడంతో ఆ ఆదాయం కోల్పోతోంది.సింగూరు జలాశయంలోకి స్వల్పంగా వరద వస్తోంది. ఎగువన మంజీర పరీవాహక ప్రాంతంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం ఉదయం నుంచి 252 క్యూసెక్కుల ప్రవాహం మొదలైంది. నారాయణఖేడ్‌లో పది రోజుల క్రితం కురిసిన వానలకు 765 క్యూసెక్కులు వచ్చి చేరిన తర్వాత ఈ ఏడాది వరద రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రాజెక్టులోని నీటిమట్టం కొద్దిగా పెరిగింది. ఇప్పటి వరకు 509 మీటర్లతో 0.455 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయంటూ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ బాలగణేష్ తెలిపారు. మరోసారి భారీ వర్షం కురిస్తే అన్ని వనరులు జలకళను సంతరించుకుంటాయి.
No comments:
Post a Comment