Breaking News

12/08/2019

కౌన్సెలింగ్ కు హాజరైనా.... రిపోర్టింగ్ దూరం

అయోమయంగా ఇంజనీరింగ్ కాలేజీల భవిత
హైద్రాబాద్, ఆగస్టు 12, (way2newstv.in)
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు 70 శాతమే కళాశాలల్లో రిపోర్ట్ చేస్తున్నారు. మిగతా 30 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఈ విద్యాసంవత్సరం ఎంసెట్ మొదటి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, 52,621 సీట్లకు కేటాయింపులు జరిగాయి. ఇందులో 38,705(73.55 శాతం) మంది విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేశారు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ఎంసెట్‌తో పాటు ఇతర కౌన్సెలింగ్‌లలో కూడా పాల్గొంటున్న విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి వంటి జాతీయ సంస్థలలో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు. ఒకప్పుడు ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్‌లో చేరేవారు. రానురాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తోంది. 
కౌన్సెలింగ్ కు హాజరైనా.... రిపోర్టింగ్ దూరం

ఖర్చు ఎక్కువైనా ఎన్‌ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ సీటు రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య తగ్గుతున్నా, కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు.రెండేళ్ల క్రితం వరకు రిపోర్టింగ్ శాతం 90 శాతం వరకు ఉండగా, గత ఏడాది నుంచి 70 శాతానికి మించలేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపించడం లేదు. ఇదివరకు టాప్ కళాశాలల్లో కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు 100 శాతం భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వ్ చేసుకునేవారు. కానీ ఈ ఏడాది టాప్ కళాశాలల్లో సైతం కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగిలినట్లు తెలిసింది. మధ్యస్థంగా ఉన్న కళాశాలల్లో సీట్లు భర్తీకాక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. మెరిట్ విద్యార్థులు ఐఐటి,ఎన్‌ఐటి, ఇతర జాతీయ విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ఎంసెట్‌కు హాజరయ్యే మెరిట్ విద్యార్థులు, జెఇఇ వంటి జాతీయ ప్రవేశ పరీక్షకు కూడా సీరియస్‌గా సిద్దమై పరీక్ష రాస్తున్నారు. దాంతో వారికి రెండు పరీక్షల్లో మంచి ర్యాంకులే వస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత మాత్రం జెఇఇకే ఇస్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో 15 శాతం మంది ఐఐటి-జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్‌ఐటిల్లో సీట్లు పొందారు. ముందుగా రాష్ట్రంలోని టాప్ కళాశాలల్లో సీటు కేటాయింపు జరిగినా, ఐఐటి,ఎన్‌ఐటిల్లో సీటు లభిస్తే అక్కడికే వెళుతున్నారు. కానీ ఏడాదికి ఏడాదికీ పరిస్థితి మారుతూ వస్తోంది. మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిలకే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కళాశాలల వైపు చూడటం లేదు.2015-16 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, అందులో కన్వీనర్ కోటా కింద 83 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2016-17 విద్యాసంవత్సరంలో మొత్తం 1.04 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 71,034 సీట్లలో సీట్లు ఉన్నాయి. 201718 విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 201 కళాశాలల్లో 70,427 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్‌లో 54,583 సీట్లు భర్తీ అయ్యాయి. 12,264 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 69,782 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్‌లో 48,982(74.15 శాతం) సీట్లు కేటాయించారు. 201819 విద్యాసంవత్సరంలో ఐదు కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ నమోదు కాగా, ఆరు కళాశాలల్లో సింగిల్ డిజిట్‌లో ప్రవేశాలు నమోదయాయయి. అలాగే 29 కళాశాలల్లో 50లోపు, 55 కళాశాలల్లో 100లోపు ప్రవేశాలు నమోదయ్యాయి.

No comments:

Post a Comment