Breaking News

06/08/2019

నల్లమల్ల...మాయం కానుందా

మహబూబ్ నగర్, ఆగస్టు 6, (way2newstv.in
సహజ వనరుల కోసం అడవులను తవ్విపారేయడం ప్రకృతి విధ్వంసానికి పాల్పడటమే. అడవులకు దగ్గరగా బతుకుతున్న ప్రజలను విస్థాపితులను చేయడమే. తెలంగాణలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల కారణంగా తెలంగాణలో ఇప్పటికే వేల ఎకరాల అటవీ భూములు ధ్వంసమయ్యాయి. ప్రజలు ఎంత వ్యతిరేకించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాగా కేంద్రం నల్లమల నిక్షేపాలపై దృష్టి సారించింది. అడవిలోని సహజ వనరులను వెలికితీయాలనే యోచనలో ఉంది. ఇందుకోసం దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ ఫారెస్టులో యురేనియం సర్వే, తవ్వకాలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. 
నల్లమల్ల...మాయం కానుందా

నాగర్ కర్నూల్, నల్గొండ, జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో నాణ్యత గల యురేనియం నిక్షేపాలు భారీ ఎత్తున ఉన్నాయని.. ఇందులో సర్వే కోసం అనుమతించాలని అటానమిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) రెండేళ్ళ క్రితం అటవీశాఖకు దరఖాస్తు చేసింది.కేంద్ర అటవీ సలహా మండలి ఇందుకు ఆమోదం తెలపడంతో నల్లమలలో త్వరలోనే యురేనియం నిక్షేపాలపై అన్వేషణ మొదలుకానుంది.యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవిలో తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్థానిక ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. నల్లమలను తవ్వడమంటే ప్రకృతి విధ్వంసానికి పాల్పడటమే అంటున్నారు. యురేనియం తవ్వకాలతో పరోక్షంగా 83కి.మీ పరిధిలోని గ్రామాలపై కూడా ఆ ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఎగువన ప్రవహించే కృష్ణానది, దిగువన ప్రవహించే నాగార్జునసాగర్ నీటిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందంటున్నారు. తద్వారా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యురేనియం తవ్వకాలు చేపడితే.. అక్కడి గాలి కలుషిమతువుతుందని అంటున్నారు. యురేనియాన్ని బయటకు తీయగానే అది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సైడ్‌తో కలుస్తుందని.. దాంతో అణుధార్మికత కలిగి బీటా,గామా వంటి ప్రమాదకర కిరణాలను విడుదల చేస్తుందని చెబుతున్నారు. స్థానికుల ఆరోగ్యాలకు ఇది అత్యంత ప్రమాదం అంటున్నారు. యురేనియం తవ్వకాలు జరిపేచోట.. ఇలాంటి పరిస్థితి కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందంటున్నారు.నల్లమల ప్రజలతో పాటు వన్యప్రాణి మనుగడకు కూడా ఇది తీవ్ర ముప్పు అంటున్నారు.నల్లమలలో యురేనియం తవ్వకాలను ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలు రాజకీయ పక్షాలు,ప్రజాసంఘాలు దీనిపై ప్రత్యక్ష ఉద్యమానికి సిద్దమయ్యాయి. దీనిపై త్వరలోనే వారు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నల్లమల కేంద్రంగా మరో ఉద్యమం త్వరలోనే పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో #సేవ్ నల్లమల హాష్‌ట్యాగ్‌తో చాలామంది నెటిజెన్స్ ఇప్పటికే ఈ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఉద్యమాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా.. లేక తన పని తాను చేసుకుంటూ వెళ్తుందా అన్నది వేచి చూడాలి

No comments:

Post a Comment