Breaking News

19/08/2019

గుండాల మండలంలో వైద్యం ఎండమావే

ఖమ్మం, ఆగస్టు 19, (way2newstv.in)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ప్రజలకు వాగు దాటితేనే వైద్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. అత్యవసర సమయంలోనూ బాధితులను వాగు దాటించడానికి నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారి, పురుగుల మందు తాగిన మహిళ, పాము కాటుకు గురైన రైతును అతి కష్టం మీద వాగు దాటించి దవాఖానాకు తీసుకెళ్లారు. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సాయిశ్రీ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకులంలో మూడో తరగతి చదువుతోంది.మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్లారు.  జ్వరం ఎక్కువ కావడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలోని పీహెచ్సీకి బయల్దేరారు. అక్కడికి వెళ్లాలంటే గ్రామానికి మధ్యలో ఉన్న మల్లన్నవాగు దాటక తప్పని పరిస్థితి. దాంతో అంతా కలిసి నడుంలోతు నీళ్లలోంచి వాగు దాటి హెల్త్ సెంటర్ కు వెళ్లారు. 
గుండాల మండలంలో వైద్యం ఎండమావే

మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతు దుగ్గి శోభన్బాబు పొలంలో శనివారం పని చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులకు తెలపడంతో శోభన్ బాబుని అతికష్టం మీద మల్లన్న వాగు దాటించి గుండాల దవాఖానాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఇల్లందు సర్కారు దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.రోళ్లగడ్డ గ్రామానికి చెందిన భూక్య సాలి శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎడ్ల బండిలో మల్లన్న వాగు వరకు తీసుకువచ్చారు. శనివారం ఉదయం మండలంలో కురిసిన భారీ వర్షానికి మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా తల్లిని బతికించుకోవాలనే తపనతో ఆమె కుమారులు, గ్రామస్తులు నానా అవస్థలు పడి మల్లన్న వాగు దాటించి మండల కేంద్రంలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.గుండాల మండలంలోని నర్సాపురం తండాకు చెందిన గుగులోత్ భామిని రాత్రి మనస్థాపంతో పురుగుల మందు తాగింది. కుటుంబీకులు నానా అవస్థలు పడి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగుని దాటించి మండల కేంద్రంలోని సర్కారు దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రెఫర్చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో  మృతిచెందింది.

No comments:

Post a Comment