Breaking News

07/08/2019

మోడీకి అడ్డొస్తున్న ఆర్ధిక సవాళ్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 7, (way2newstv.in)
మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదు అంటే ఇదేనేమో. రానున్న అయిదేళ్లలో 350 లక్షల కోట్ల రూపాయల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని బడ్జెట్ లో సంకల్పం చెప్పుకున్నాం. అయిదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం అన్నిరంగాలు ఆర్థిక సంక్షోభంతో ఎదురీదుతున్నాయి. పెట్టుబడులు, ఉత్పాదక రంగం మందగించింది. వ్యవసాయరంగంలో సంక్షోభం నెలకొంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సంస్థలు నిరర్థక బకాయిలతో బావురుమంటున్నాయి. ఎగుమతులూ తగ్గిపోయాయి. ఒకవైపు అన్ని రకాల నిత్యావసరాల రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం ఉరుమురిమి చూస్తోంది. నిరుద్యోగం రేటు రెండేళ్లలోనే నాలుగు శాతం నుంచి 7.6 శాతానికి చేరి చెట్టెక్కి కూర్చుంది. 
మోడీకి అడ్డొస్తున్న ఆర్ధిక సవాళ్లు

పంచబ్యాంకు లెక్కల్లోనూ మనం కుదించుకుపోయాం. గత సంవత్సరం ప్రపంచ దేశాల జీడీపీ క్రమంలో ఆరోస్థానంలో ఉంటే ఇప్పుడు ఏడుకు దిగజారాం. అసలేం జరుగుతోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు కేంద్రం ఏం చేస్తోందనే చర్చ మొదలైంది.ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్న దేశాలు అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, రేటింగు సంస్థల వద్ద మార్కులు కొట్టేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయి. దాని వల్ల పెట్టుబడులు పెరుగుతాయని ఆశిస్తుంటారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని భావిస్తారు. భారత దేశం ఇందుకు అతీతం కాదు. మన దేశం రానున్న సంవత్సరాల్లో ఆర్థికంగా భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 190 లక్షల కోట్ల స్థూల జాతీయోత్పత్తితో ఉన్న దేశాన్ని రానున్న అయిదేళ్లలో 350 లక్షల కోట్లకు చేర్చాలనేది ఆశయం. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ప్రపంచబ్యాంకు తాజా సమీక్షల్లో భారత ర్యాంకు తగ్గింది. గత సంవత్సరం అమెరికా,చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ ల తర్వాత స్థానం దక్కించుకున్నాం. కానీ ఇప్పుడు మన స్థానంలో ఫ్రాన్స్ చేరింది. అదే విధంగా రేటింగు సంస్థ క్రిసిల్ భారత వృద్ధిని గతంలో సూచించిన 7.1 నుంచి 6.9 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు ఈ లెక్కలు అద్దం పడతాయి. ముఖ్యంగా ఉత్పత్తిరంగం మందగమనంలో కొనసాగుతోంది. దేశంలో అంతర్గతంగానూ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. రూపాయి మారకం విలువ ఎక్కువగా ఉండటంతో ఎగుమతులు క్షీణించాయి. నిరుద్యోగం రేటు రెండేళ్లలోనే 4 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. 2016లో చేసిన నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. అసంఘటిత రంగం కుదేలైపోవడంతో నిరుద్యోగం పెరిగింది. మేకిన్ ఇండియా, ముద్రా రుణాలు, కౌశల్ యోజన వంటి పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని పరిస్థితులు చాటిచెబుతున్నాయి.వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచడంతోపాటు ప్రతి రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని గడచిన మూడు సంవత్సరాలుగా కేంద్రప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ 2018లో వ్యవసాయరంగం ఆదాయం ఏమాత్రం పెరగలేదని కేంద్ర ఆర్థిక సంస్థలు లెక్క గట్టాయి. దేశ జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా ఏటేటా తగ్గిపోతూ వస్తోంది. పదిహేను సంవత్సరాల క్రితం 21 శాతం వరకూ దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయం తన వంతు వాటా అందిస్తుండేది. ఇప్పుడది 13 శాతానికి పడిపోయింది. సేవారంగం విస్తరించిన తరహాలో వ్యవసాయ రంగం పెరగడం లేదు. తమ ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి, మంచి గిట్టుబాటు ధర లభించినప్పుడు అమ్ముకోవడానికి వీలైన సదుపాయాలు రైతుకు సమకూరడం లేదు. అలాగే ఉప ఉత్పత్తులు, అనుబంధ పరిశ్రమల ద్వారా అదనపు ఆదాయం పొందడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ధరల స్థిరీకరణ నిధి వంటివి దేశవ్యాప్తంగా ఏర్పాటు కావాల్సి ఉంది. యువత వ్యవసాయ రంగంలో ప్రవేశించి ప్రయోగాలు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. ఈ రంగంపై ఆధారపడుతున్న వారి సంఖ్య తగ్గిపోవడంతో గ్రామీణాధారిత ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతోంది. పట్టణాలకు వలసల ఒత్తిడి పెరుగుతోంది. అందువల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం మొత్తం దేశంలోని ప్రజల జీవన సమస్యగానే పరిగణించాల్సి ఉంటుంది.నరేంద్రమోడీ, అమిత్ షా ల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ రాజకీయాలను ఏకీకరించి సంఘటితం చేసుకోవడంలో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా పొలిటికల్ కన్సాలిడేషన్ చేయడంపై వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పార్టీ ని విస్తరించడం, ప్రత్యర్థి పార్టీలు ఉనికిని కోల్పోయేలా చేయడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పర్యవసానాల గురించి ఆలోచించకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చిన సందర్బాలూ ఉన్నాయి. వాజపేయి, అద్వానీల శకంలో ఇతర పార్టీలను కలుపుకుని పోతూ ఏకాభిప్రాయం సాధించడం ప్రమాణంగా ఉంటుండేది. ఇప్పుడు మాత్రం ఇతర పార్టీలకు రాజకీయ అనివార్యత కల్పించడానికి రకరకాల ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. కేవలం మతాలే కాకుండా భిన్న సంస్క్రుతులు, అభిప్రాయాలు ఉన్న సమాజంలో ఒకే మాట, ఒకే బాట అన్నది అంత సులభం కాదు. భిన్నత్వాన్ని అంగీకరిస్తూనే ప్రగతికి బాటలు వేయాలి. ఇందుకు ఆధిపత్య రాజకీయాలకంటే అనునయింపు వ్యవహారాలే సత్ఫలితాలనిస్తాయి. లేకపోతే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. ఇతర పార్టీలను అణచివేసి ఎదగాలనుకునే ధోరణి కంటే కమలం పార్టీ కాసింత ఫ్రెండ్షిప్ తోనైనా ఇతరుల అభిప్రాయాలను, సూచనలను స్వీకరిస్తే భారత ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుంది. మన్ మోహన్ వంటివారి ఆర్థిక నైపుణ్యాన్ని రాజకీయాలకు అతీతంగా వినియోగించుకునేందుకు చక్కని అవకాశాలున్నాయి. ఆ దిశలో కాకుండా ఒంటెత్తు పోకడలతో వెళితేనే నష్టం వాటిల్లుతుంది. ఘర్షణాత్మక పోకడలు పెరుగుతాయి. దీనికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

No comments:

Post a Comment