Breaking News

13/08/2019

సగం ఖాళీ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఆగస్టు 13 (way2newstv.in - Swamy Naidu): ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు నిండటం లేదు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన కళాశాలలు క్రమంగా వాటి ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీటు దక్కించుకునేందుకు పోటీపడే రోజులు పోయి.. ఇచ్చినా తీసుకోని దుస్థితి దాపురించింది. ఈ ఏడాది మొత్తం కేటాయించిన సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. అరకొర వసతులు, సబ్జెక్టు బోధకుల లేమితో అవి కొట్టుమిట్టాడుతుండగా .. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను చేర్పించుకోవడంలో పోటీపడుతున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ కళాశాలల్లో రెండేళ్ల నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) వెబ్‌సైట్‌ ద్వారా ప్రవేశాలు చేపడుతోంది. ఇందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంది. వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వివరాలను పొందుపర్చింది. 

 సగం ఖాళీ (ఆదిలాబాద్)
విద్యార్థులు తనకు నచ్చిన ఏ కళాశాలలోనైనా సీటు పొందేందుకు అవకాశం కల్పించింది. ఆఫ్షన్ల నమోదు ద్వారా విద్యార్థులు కోరుకున్న కళాశాలలు, వారికి వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని సీట్ల కేటాయింపు ఉంటుంది. కానీ ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు ప్రైవేటు వైపు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం ఉచితమైనప్పటికీ.. విద్యార్థులు రాలేకపోయారు. సరైన వసతులు లేకపోవడం, రెగ్యులర్‌ అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో తరగతులు సక్రమంగా కొనసాగవనే ఉద్దేశంతో విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రైవేటు కళాశాలలు మీసేవా కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై వారి కళాశాలల్లోనే సీట్లు పొందేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకొనే విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తుంటే.. ప్రైవేటులో చదువుకొనే వారికి ఉపకార వేతనాలతోపాటు ఫీజు రియంబర్స్‌మెంట్‌ కూడా అందజేస్తోంది. ఈ అవకాశాన్ని అదనుగా భావిస్తున్న కొన్ని ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు ఫీజులు చెల్లించే అవసరం లేదని చెబుతూ వాటిల్లో చేర్పించుంటున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఉచితంగానే మూడేళ్ల పాటు చదుకోవచ్చనే ఉద్దేశంతో వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వం కూడా డిగ్రీ కళాశాలలకు ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం.. వాటి సంఖ్య పెరిగిపోవడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని కళాశాలలు పల్లెల్లోనూ వెలుస్తుండటంతో సమీప గ్రామాల విద్యార్థులు ఇందులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు విద్యార్థులు సాధారణ డిగ్రీలు చేయడం ఇష్టం లేక.. బీటెక్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల వైపు వెళ్తున్నారు. ఇంకొందరు గురుకులాల్లో చేరుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ ఏటా తగ్గుముఖం పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ కళాశాలల్లో సంస్కరణలు చేపడితేనే ఫలితం ఉంటుంది. ప్రస్తుతం అన్నిచోట్ల అవసరమైన భవనాలున్నాయి. అన్ని రకాల ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. కానీ రెగ్యూలర్‌ సబ్జెక్టు బోధకులు లేకపోవడంతో విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తరగతులు సక్రమంగా కొనసాగవనే కారణంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనూ కళాశాలలు కూనారిల్లుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల లేమితో కనుమరుగయ్యే పరిస్థితికి దారి తీస్తోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 21,446 మంది పరీక్ష రాస్తే ఇందులో 13,823 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో కనీసం ఒక వంతు విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేరలేదు. ఉన్నత విద్యాశాఖ వీటిపై దృష్టిసారించి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించి వాటిని బాగుచేయిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్జెక్టు అధ్యాపకుల నియామకం, కళాశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించడంతో పాటు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేపడితే ప్రయోజనం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment