Breaking News

27/08/2019

మెదక్ లో సాగుతోన్న గృహ నిర్మాణం

మెదక్, ఆగస్టు 27, (way2newstv.in)
రెండు పడక గదుల ఇళ్లు... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. జిల్లాలో పథకం కింద వివిధ దశల్లో 5,479 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా పథకం ప్రారంభమై మూడేళ్లు గడచిపోయినా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. జిల్లా కేంద్రమైన మెదక్‌లోనూ గృహ నిర్మాణం నెమ్మదిగానే సాగుతోంది. మండల పరిధిలోని పిల్లికొటాల వద్ద వివిధ దశల్లో జి+1 నమూనాలో దాదాపు 500 ఇళ్ల పనులు మొదలైనా ఇంతవరకు ఒక్కటీ పూర్తికాలేదు. పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 315కు గాను కేవలం 8 ఇళ్ల పనులు మాత్రమే షురూ అయ్యాయి. 
మెదక్ లో సాగుతోన్న గృహ నిర్మాణం

అందోల్‌ నియోజకవర్గ పరిధి మండలాల్లో 200 ఇళ్లు మంజూరు కాగా 50 ఇళ్లకు సంబంధించి స్థలం ఎంపిక పూర్తయింది. టెండరు ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కాగా పనులు పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినప్పటికీ స్థలాల ఎంపిక, అవసరమైన ఇసుక సమీకరించుకోవడం తదితర పనుల కోసం వివిధ శాఖల సహకారం అవసరం. ఈక్రమంలో సంబంధిత శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా పలుచోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆటంకం కలుగుతోంది. గుత్తేదారులు కూడా పనులు పూర్తిచేయడంలో అలక్ష్యం వహిస్తున్నట్టు జరుగుతున్న పనుల తీరును చూస్తే అర్థమవుతోంది. జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తరచూ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణ తీరును పర్యవేక్షిస్తున్నారు. స్థలాల ఎంపిక, టెండరు ప్రక్రియ పూర్తయిన చోట పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు డిసెంబరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పలుచోట్ల ఇంకా స్థలాల ఎంపికే జరగకపోగా... స్థలాల ఎంపిక, టెండరు ప్రక్రియ పూర్తయినా అనేక చోట్ల పనులు అసలు మొదలే కాలేదు. పనులు ప్రారంభమైన చోట నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, పనుల పర్యవేక్షణ జరిపి త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పినా ఫలితం లేదు. జిల్లా వ్యాప్తంగా 59 ప్రాంతాల్లో 4,417 ఇళ్లకు సంబంధించి స్థలాలను ఎంపిక చేశారు. 3,479 ఇళ్లకుగాను  35 ప్రాంతాల్లో లేఅవుట్‌లు సిద్ధమయ్యాయి. 2,425 ఇళ్లకు టెండరు ప్రక్రియ పూర్తవగా అవి వివిధ దశల్లో ఉన్నాయి. మొదట్ల్లో దాదాపు ఏడాది పాటు తమకు గిట్టుబాటు కాదనిచెప్పి గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో వారు స్పందించారు. ఆయా చోట్ల పనులు దక్కించుకున్న గుత్తేదార్లు నిర్మాణంలో విపరీత జాప్యం చేస్తున్నారు. కొన్నాళ్లు ఇసుక సమస్య ప్రతిబంధకంగా మారగా ప్రభుత్వం సమీపంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి తరలింపునకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ చాలా చోట్ల పనులు ఆగుతూ సాగుతున్నాయి. అన్ని చోట్ల కలిపి మొత్తం 2,425 ఇళ్ల నిర్మాణం ప్రారంభంకాగా ఇప్పటి వరకు గోడలు పూర్తయినవి కేవలం 94 మాత్రమే.

No comments:

Post a Comment