Breaking News

24/07/2019

బాబు చేసిన తప్పులే జగన్...

సేమ్ టూ సేమ్
విజయవాడ, జూలై 24, (way2newstv.in)
రాజకీయం వేరు. పరిపాలన వేరు. అయితే పరిపాలన రాజకీయంతో ముడిపడి ఉంటే మాట మాత్రం వాస్తవం. కానీ రాజకీయం పరిపాలనను డామినేట్ చేస్తే మాత్రం డేంజర్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలోనే పాలనసూత్రం ఇమిడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్న కాలంలో ప్రతిపక్షంపై అవసరానికి మించి ఫోకస్ పెట్టారు. అసలు ప్రతిపక్ష ఉనికే లేకుండా చేయాలనే యత్నంలో 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. మరింతమంది కోసం ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. తమ ప్రభుత్వంపై విస్త్రుత ప్రచారం , ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యం వెరసి టీడీపీని దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రతిపక్షంపై ఎక్కువగా దృష్టి పెడితే ప్రభుత్వానికే నష్టం. సంక్షేమం, అభివ్రుద్ధి టార్గెట్ గా పెట్టుకుని పనిచేసుకుంటూ పోతే ప్రజలే టీడీపీ హయాంతో వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటారు. ఎవరు సమర్థంగా పనిచేస్తున్నారనేది సొంతంగా అంచనా వేసుకుంటారు.అసలు రాజకీయమన్న మాటే లేకుండా పరిపాలననే ప్రథమసూత్రంగా పెట్టుకుని కార్యనిర్వహణ చేస్తే అధికారపార్టీ మట్టిగొట్టుకుపోతుంది. అలాగని ప్రతివిషయాన్ని రాజకీయం చేస్తూ పార్టీ ప్రయోజనాలు నొల్లుకోవాలని చూస్తే పాలన పడకేస్తుంది. దాని పర్యవసానం రాష్ట్ర ప్రగతిపై పడుతుంది. రెంటినీ సమన్వయం చేయడమే సమర్థ నాయకునికి ఉండాల్సిన లక్షణం. ఎక్కడ తేడా కొట్టినా, బ్యాలెన్స్ తప్పినా తలబొప్పి కొడుతుంది. అందుకే మాస్ లీడర్స్ అందరూ మంచి అడ్మినిస్ట్రేటర్లుగా పేరు తెచ్చుకోలేకపోయారు. 
 బాబు చేసిన తప్పులే జగన్...

మంచి పరిపాలకులందరూ సమర్థ రాజకీయనేతలుగా నిలదొక్కుకోలేకపోయారు. రాష్ట్రంలో ఆగర్భశత్రుత్వం ప్రదర్శించే అధికార, ప్రతిపక్షాల వాదోపవాదాలు, ఆరోపణల సంగతి ఎలాగూ ప్రజల్లో రోజువారీ చర్చకు దారితీస్తోంది. శాసన సభలో పైచేయి సాధించాలనే యత్నంలో వైసీపీ,టీడీపీ నేతలు పరస్పరం తలపడటం అర్థం చేసుకోదగినదే. కానీ పరిపాలనకు, రాజకీయాలకు మధ్యలో ఉండే సంతులనం మాత్రం తప్పకూడదు. రెండు పార్టీల మధ్య ఉండే వైరుద్ధ్యాలు, విభేదాల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కచ్చితంగా అవ్యవస్థ వైపు అడుగులు వేయిస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రతి ప్రభుత్వ పాలనలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. దేనిపాళ్లు ఎక్కువ అన్న దానిపై ఆధారపడే ప్రజలు తదుపరి ఎన్నికల్లో తీర్పు చెబుతుంటారు. ప్రాంతీయ పార్టీల పాలనలో సంక్షేమానికి పెద్ద పీట వేయడం ఆనవాయితీగా వస్తోంది. జాతీయ పార్టీల్లో తమ అధిష్ఠానం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తుంటాయి నేషనల్ పార్టీలు. అదే ప్రాంతీయ అధినేతలు తమకు నచ్చినట్లు నిధులను వెచ్చించే వెసులుబాటు కలిగి ఉంటారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని కూడా ఉండదు. అందువల్ల ప్రజలను సంత్రుప్తి పరచడంపై ఎక్కువగా ద్రుష్టి పెడుతుంటారు. అధికార స్థిరీకరణ, శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలను పరిగణనలోకి తీసుకుంటూ నాయకులు నిర్ణయాలను అమలు చేస్తుంటారు. వీటిలో సంక్షేమ పథకాలదే పెద్దపీట. ఎన్టీయార్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు ఈ విషయంలో ఆద్యులుగా చెప్పుకోవాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా సంస్కరణలకు పెద్దపీట వేసిన పీవీ నరసింహారావు, చంద్రబాబు నాయుడులు ఈవిషయంలో వారి ముందు దిగదుడుపే అని చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి సైతం తన తండ్రి చూపిన బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నట్లుగా తొలి పాలన నిర్ణయాలు చాటి చెబుతున్నాయి. అయితే అభివృద్ధి , సంక్షేమాల మధ్య బ్యాలెన్స్ తప్పుతోందనే భావన ఇప్పటికే వ్యాపిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన రాజధాని, మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో నూతన సర్కార్ పాత నిర్ణయాలను వాయిదా వేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది పరిపాలనలో పారదర్శకతను నెలకొల్పడం సర్కారుకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో పదవీ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచి వేగం చూపుతున్నారు జగన్. అదే స్పీడుతో పాత ప్రభుత్వ ప్రాజెక్టులను తిరగదోడే విషయంలోనూ దూకుడు కనబరుస్తున్నారు. కొన్ని అధికారికంగా, అంతర్గతంగా సమీక్షించుకున్న తర్వాతనే ప్రభుత్వం బయటకు ప్రకటించాలి. అన్నిటినీ సమీక్షిస్తామని వేలకోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ముందుగా ప్రకటిస్తే దానిని బయటికి కక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అధికారికంగా కుదిరే ఒప్పందాలనుంచి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు మారినంతమాత్రాన బయటపడటం సాధ్యం కాదు. చట్టం, న్యాయస్థానాల నుంచి రక్షణ ఉంటుంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా కుదుర్చుకున్న సౌర,పవన విద్యుత్తు ఒప్పందాలు అటువంటివే. వాటిపై ముందుగానే కూలంకషంగా అధ్యయనం చేసి రేట్ల తగ్గింపుపై సాధ్యాసాధ్యాలను తేల్చుకోవాల్సింది. కేంద్రం ఒకవైపు, ఆయా సంస్థలు మరోవైపు ప్రభుత్వ సంప్రతింపుల ప్రక్రియకు మోకాలడ్డుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకున్న విద్యుత్ కొనుగోలు రేట్ల సమీక్ష అంతసులభంగా కనిపించడం లేదు. తమ మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న ఈవిషయంలోనే వెనకడుగు వేయాల్సి వస్తే ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికరమే. ఇసుక విధానంలో మార్పులపై ప్రభుత్వం తీసుకున్ననిర్ణయమూ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నేరుగా భవన నిర్మాణ రంగంపై పడుతోంది. ప్రజాజీవితంతో ముడిపడిన విషయాలు, చట్టంతో ముడిపడి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం చేకూర్చే అంశాలపై ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే మంచికి బదులు చెడు ఎదురవుతుంది.విమర్శలు, ఆరోపణల విషయంలో రాజకీయ పార్టీలకు ఉండే స్వేచ్ఛ అపరిమితం. ఎదుటి పక్షం లేదా ప్రభుత్వంపై బురద జల్లేందుకు అర్ధసత్యాలు సైతం ఆరోపణాస్త్రాలైపోతుంటాయి. కానీ ప్రభుత్వాలకు ఈ విషయంలో కొన్ని పరిమితులుంటాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తే దానిని నిరూపించాల్సిన చట్టబద్దమైన నైతిక బాధ్యత సర్కారుపై ఉంటుంది. అందుకే అధికారంలో ఉన్నపార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్నపార్టీ నుంచి వచ్చే దాడి ఎక్కువగా ఉంటుంది. అందుకే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ దాటవేస్తుంటాయి. జగన్ మోహన్ రెడ్డిపై లక్ష కోట్ల రూపాయల ఆరోపణలు గుప్పించిన టీడీపీ ఎక్కడా దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించి పరిశోధన సంస్థలకు ఇవ్వలేకపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే జగన్ పై ఉన్న ఆరోపణల తీవ్రత తగ్గిపోయింది. ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందంటూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేసింది. కానీ దానిని నిరూపించడం అసాధ్యం. అందువల్ల ఆరోపణ క్రమంగా ప్రాధాన్యం కోల్పోతుంది. అయితే దానిని సజీవంగా ఉంచాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికే ఇరకాటం. చట్టబద్ధమైన అధికారాలు ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని ప్రతిపక్షం సవాల్ విసురుతుంది. పాత్రలు మారిన దృష్ట్యా ప్రభుత్వ పక్షమైన వైసీపీ వాస్తవాలు గుర్తించకపోతే ముందరికాళ్లకు బంధం పడుతుంది.

No comments:

Post a Comment