Breaking News

04/07/2019

నో యూనిఫాం (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూలై 4  (way2newstv.in): 
పాఠశాలలు తెరిచే నాటికే యూనిఫారాలు పంపిణీ చేస్తే వాటిని ధరించి విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వచ్చేందుకు అవకాశం ఉంది. గతేడాది వరకు పాఠశాలలు తెరిచే నాటికే దాదాపు పంపిణీ చేసేవారు. ఎక్కడైనా అందకుంటే వారం, పది రోజుల్లో పంపిణీ చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు 17 శాతం మందికి మాత్రమే ఒక జత చొప్పున అందించారు. మిగిలినవి ఎప్పటికి పంపిణీ చేస్తారో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు అందజేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కలిపి 2,00,269 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ఈపాటికే యూనిఫారాలు పంపిణీ చేయాల్సి ఉంది. 
నో యూనిఫాం (పశ్చిమగోదావరి)

కానీ ఇప్పటివరకు 36 వేల మందికి ఒక జత మాత్రమే పంపిణీ చేశారు. ఇవి కూడా 6, 7, 8వ తరగతుల విద్యార్థులకే అందజేశారు. ఒకటి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఒక్కరికి కూడా అందజేయలేదు. ఏటా రెండు జతల దుస్తులు పంపిణీ చేస్తున్నారు. మూడు జతల దుస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జతకు రూ.200.. మొత్తంగా మూడు జతలకు రూ.600 చొప్పున వెచ్చిస్తున్నారు. దుస్తులు కుట్టేందుకు ఒక్కో జతకు రూ.40 చొప్పున ఇవ్వనున్నారు. ఈ ఏడాది యూనిఫాంల పంపిణీలో జాప్యం జరగడానికి ఎస్‌ఎస్‌ఏ అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా అధికారులు దృష్టి సారించలేదని అంటున్నారు. దుస్తులకు సంబంధించి వస్త్రాన్ని ఆప్కో సంస్థ సరఫరా చేస్తోంది. గతంలో స్థానిక దర్జీలతో కుట్టించే వారు. ఈ ఏడాది కుట్టించే బాధ్యతను ఆప్కో తీసుకుంది. జిల్లాలోని టైలరింగ్‌ ఏజెన్సీలను గుర్తించి వారికి వస్త్రం ఇచ్చి కుట్టిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 86 వేల మందికి సరిపడా వస్త్రమే వచ్చింది. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని ఏజెన్సీలకు కుట్టే బాధ్యత అప్పగించగా.. ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు కొన్ని పాఠశాలలకు దుస్తులు అందకపోవడంపై ఈ ఏడాది పంపిణీ చేస్తారా? లేదా? అనే అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్‌ 20 నాటికి 100 శాతం యూనిఫాంలు పంపిణీచేశారు. అప్పట్లో కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాఠశాలలు తెరిచే నాటికి అన్నీ సిద్ధంచేశారు. ఈ ఏడాది ఎన్నికలు, అధికారుల బదిలీలు జరగడం వంటి కారణాలతో దృష్టి సారించలేకపోయారు.

No comments:

Post a Comment