Breaking News

22/07/2019

మున్సిపల్ ఎన్నికలకు కమలం నజర్

షా డైరక్షన్ లో ఇంచార్జీలు
హైద్రాబాద్, జూలై 22, (way2newstv.in)
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించడం విశేషం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సాధించిన బీజేపీ ఆ పట్టును నిలుపుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం నేతలకు అమిత్ షా టార్గెట్ విధించారని చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికలంటే ప్రధానంగా అర్బన్ ప్రాంతాలు కావడంతో బీజేపీ తమకు పట్టు దొరుకుంతుందని భావిస్తోంది. ప్రధానంగా ఉద్యోగులు, యువత తమ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారని, మోదీ నాయకత్వం కూడా తమ గెలుపునకు ఉపకరిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 
మున్సిపల్ ఎన్నికలకు కమలం నజర్

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలను నిర్వహించి ప్రజలకు చేరువకావాలని నిర్ణయించింది. సెక్రటేరియట్, అసెంబ్లీ కూల్చివేతలపై కేసీఆర్ పై గళం పెంచాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో పక్కా ప్రణాళికను కమలం పార్టీ రూపొందించుకుంది. పార్టీలోకి వలసలను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. కీలకమైన నేతలను మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ముందుగానే చేర్చుకోవాలని నిశ్చయించారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు పెంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తోంది.మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుంది. ఆ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీలకు ప్రధానమైన నేతలను ఇన్ ఛార్జిలుగా నియమించనున్నారు. వారికి నలుగురు సహాయకులను కూడా పార్టీ తరుపున ఇస్తారు. ఆ మున్సిపాలిటీలో గెలుపు బాధ్యతను వీరికే అప్పగిస్తారు. ఈ ఐదుగురు నేతల్లో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు స్థానిక నేతలను కూడా నియమించనున్నారు. వీరంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఇలా బీజేపీ పట్టణ ప్రాంతాల్లో జెండా ఎగురవేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment