Breaking News

19/07/2019

క్రాస్ రోడ్స్ లో వేణుగోపాలరెడ్డి

గుంటూరు, జూలై 19, (way2newstv.in)
రాజ‌కీయాల్లో పంతాలు ప‌ట్టింపుల‌తో పాటు కూసింత ఆలోచ‌న కూడా ఉండాల‌ని అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ముఖ్యంగా నేటి రాజ‌కీయాలు అవ‌స‌రం-అవ‌కాశం ప్రాతిప‌దిక‌న న‌డుస్తున్నప్పుడు పంతాల‌కు ఛాన్స్ ఎక్కడ ఉంటుంద‌ని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ, తాను ప‌ట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లేన‌ని చెప్పుకొచ్చే గుంటూరు కు చెందిన కీల‌క నాయ‌కుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి ప‌రిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారిపోయింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఆయ‌న ఆవేశంతో తీసుకున్న ఒకే ఒక నిర్ణయం.. ఇప్పుడు ఆయ‌న‌కు పొలిటిక‌ల్‌ ఫ్యూచ‌ర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇప్పుడు నాలుగు రోడ్ల కూడ‌లిలో దారితెలియ‌ని ప‌రిస్థితిలో ప‌ట్టించుకునే నాధుడు కూడా లేక విల‌విల్లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.టీడీపీ నుంచి 2009లో ఎంపీగా పోటీ చేసి గెలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి చంద్రబాబు వ‌ద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. 
క్రాస్ రోడ్స్ లో వేణుగోపాలరెడ్డి

స‌మైక్యాంధ్ర ఉద్యమంలో భారీ స్థాయిలో ఉద్యమించారు. చంద్రబాబును అన్ని రూపాల్లోనూ పొగ‌డ్తల‌తో ముంచెత్తారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పార్లమెంటుకు పోటీ చేయాల‌ని భావించినా.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నేత రాయ‌పాటి కార‌ణంగా మోదుగుల ఆశించిన టికెట్‌ను చంద్రబాబు రాయ‌పాటికి కేటాయించారు. ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల‌ని సూచించారు. దీంతో కొంత క‌ష్టమే అయినా.. మోదుగుల మాత్రం వెస్ట్ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.రాజ‌కీయాల్లో ఓట‌మి లేని నేత‌గా ఉన్న క‌న్నాను తొలిసారి ఓడించిన నేత‌గా మోదుగుల వేణుగోపాలరెడ్డి రికార్డుల‌కు ఎక్కారు. అయితే, తాను ఎంపీ సీటును త్యాగం చేసి, ఎమ్మెల్యే సీటులోకి వ‌చ్చినందున చంద్రబాబు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌నే విష‌యాన్ని మోదుగుల అనూహ్యంగా తెర‌మీదికి తెచ్చారు. అంటే.. బాబు కేబినెట్‌లో మోదుగుల టికెట్ ఆశించారు. అయితే, అది సాధ్యం కాక‌పోయేస‌రికి.. ప‌లు సంద‌ర్భాల్లో బాబు పాల‌న‌పై, సొంత పార్టీ అధినేత‌పై విమ‌ర్శలు ఎక్కుపెట్టారు. ఇక‌, ఎన్నిక‌ల తేదీ రెండు మూడు మాసాలు ఉంద‌న‌గా పూర్తిగా యూట‌ర్న్ తీసుకుని రెడ్డి సామాజిక వ‌ర్గం అంతా ఏక‌తాటిపైకి వ‌స్తే.. మ‌న‌కు న్యాయం జ‌రుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం(చంద్రబాబు) కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి మాత్రమే న్యాయం చేసుకుంటోంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఫైన్ మార్నింగ్ నేరుగా వెళ్లి మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇక‌, ఈ సంద‌ర్భంలో కూడా మోదుగుల త‌న సొంత నిర్ణయంతో త‌ప్పట‌డుగు వేశారు. అప్పట్లో జ‌గ‌న్ నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను మోదుగుల ముందు ఉంచి నీకు న‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయి గెలిపిస్తాను అన్నారు. అయితే, త‌న‌కు మాత్రం గుంటూరు ఎంపీ టికెట్ కావాలని, టీడీపీ అభ్యర్థి గ‌ల్లా జ‌య‌దేవ్‌ను ఓడిస్తేనే త‌న‌కు మన‌శ్శాంతి ఉండ‌ద‌ని చెప్పి.. ఏరికోరి గుంటూరు నుంచి పోటీ చేసి కేవ‌లం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నిక‌ల‌పైనా మోదుగుల ఆరోప‌ణ‌లు చేశారు. బ్యాలెట్ లెక్కించ‌కుండానే ఫ‌లితం ప్రక‌టించార‌ని అన్నారు. దీనిపై న్యాయ‌పోరాటానికి సిద్ధమ‌ని ప్రక‌టించారు. క‌ట్ చేస్తే.. బాబును ధిక్కరించి వ‌చ్చి.. ఒక‌వైపు… జ‌గ‌న్ చెప్పిన మాట విన‌కుండా సొంత నిర్ణయం తీసుకుని ఓట‌మి పాలై మ‌రోవైపు మోదుగుల తీవ్రంగా న‌ష్టపోయారు. ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే గెలిచే వారు. ఇప్పుడు ఎంపీగా ఓడిపోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంట‌నే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది.

No comments:

Post a Comment