ఖమ్మం, జూలై 19, (way2newstv.in)
ఖమ్మం జిల్షాల్లో నేషనల్ హైవే అధికారులు మరో హైవే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న హైవేలతో అనుసంధానమైన నగరం.. కొత్త హైవే నిర్మాణంతో కొత్త రూపును సంతరించుకోనుంది. తాజాగా హైవే నిర్మాణానికి భూమి అవసరం ఉందంటూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓ ఇంగ్లిష్ దినపత్రికలో ఈనెల 5వ తేదీన భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ చూసిన కొందరు హైవే వస్తుందని సంతోషపడుతుంటే.. భూమి కోల్పోతున్న రైతులు మాత్రం సాగు భూములను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
వడివడిగా హైవే పనులు
ఇప్పటికే సూర్యాపేట–రాజమండ్రి నేషనల్ హైవే కోసం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి తదితర మండలాలకు చెందిన రైతులు రోడ్డు కోసం తమ భూములు ఇచ్చేది లేదని, ప్రభుత్వం అందించే పరిహారం అనుకున్న విధంగా లేదంటూ సర్వేలను అడ్డుకోవడం, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.అయితే ఆ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేస్తుండగా.. కొత్తగా నాగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కొన్ని నెలల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేయించిన విషయం విదితమే. ఏజెన్సీ సర్వే ఆధారంగా అనుకూలంగా ఉన్న నివేదికను తీసుకొని దాని ప్రకారం రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సర్వే నంబర్లవారీగా గుర్తించి.. గ్రామాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 5వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల నుంచి రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం వరకు సుమారు 21.5 కిలో మీటర్ల దూరంలోని సుమారు 260 ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 300 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. 21 కిలో మీటర్ల దూరంలోనే 260 ఎకరాలకుపైగా సాగు భూములను కోల్పోయే అవకాశం ఉండడంతో ఏయే సర్వే నంబర్ల నుంచి భూమి పోతుందని చూసుకున్న రైతులు కలవరపడుతున్నారు. కొందరికి ఉన్న 10 కుంటలు, ఎకరం, రెండెకరాల భూమి రోడ్డుకు పోతే.. తమకు చావే దిక్కని ఆందోళనకు గురవుతున్నారు. మరికొందరికి ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఉపయోగకరంగా ఉన్నా.. తాము మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.రోడ్డు నిర్మాణం నగర సమీపం నుంచే వెళ్తుండడంతో ఆ ప్రాంతంలో భూములంటే ఎకరం సుమారుగా రూ.30లక్షల నుంచి రూ.కోటికిపైగానే ధర పలుకుతుంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం అంత ధర చెల్లిస్తుందా.. అని ప్రశ్నించుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూమి పోతే మా గతేంటి అని రైతులు తమకు తెలిసిన నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి భూ సేకరణపై ఆరా తీస్తున్నారు. జారీ అయిన ప్రకటన ఆధారంగా అనేక మంది రైతులు రోడ్డు ఏ మార్గంలో ఉంది.. ఏ సర్వే నంబర్ నుంచి పోతుంది.. దాని హద్దులు ఏమిటంటూ.. స్థానికంగా రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుండగా.. ఈ అంశం గురించి తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment