Breaking News

19/07/2019

బిజినెస్ లో పడిపోతున్న తెలుగు తమ్ముళ్లు

రాజమండ్రి, జూలై 19, (way2newstv.in)
రాజ‌కీయాల్లో ఒక గెలుపు ఎంత బూస్ట్ ఇస్తుందో.. ఒక ఓట‌మి అంతే ప‌త‌నానికి కార‌ణ‌మ‌వుతుంది. నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను కూడా అంతేగా మార్చేస్తుంది. తాజాగా ఏపీలో జ‌రిగిన సార్వత్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓట‌మి త‌ర్వాత ఈ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కుల ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిపోయింది. వ‌చ్చే ఐదేళ్ల త‌ర్వాత కూడా వీరికి ఛాన్స్ ల‌భించే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ‌గోదారిలో తాజా ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. కొంద‌రు నాయ‌కులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ జిల్లా ప్రజ‌ల‌పై రుద్దార‌నే వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి.ఇలాంటి వారంతా ఓట‌మి పాల‌య్యారు. అదే స‌మయంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా జ‌గ‌న్ సునామీని త‌ట్టుకోలేక చ‌తికిల ప‌డ్డారు. 
బిజినెస్ లో పడిపోతున్న తెలుగు తమ్ముళ్లు

దీంతో ఇలాంటి వారంతా ఇక‌, తెర‌మ‌రుగేన‌ని, వీరికి ఎట్టిప‌రిస్థితిలో ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ‌త 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌శ్చిమ గోదావ‌రిలో ఒక్క తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం మిన‌హాయిస్తే.. మొత్తం అంతా కూడా ప‌సుపు మ‌యం అయిపోయింది. ఆ సీటును తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది. దీంతో ఇక రాబోయే 25 నుంచి 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కి తిరుగులేద‌ని అంద‌రూ అనుకున్నారు.జిల్లా నుంచి సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ పాటిస్తూ.. చంద్రబాబు మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్టబెట్టారు. దీంతో పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఢోకా లేద‌ని త‌మ్ముళ్లు స‌హా పార్టీ అధినేత చంద్రబాబు కూడా భావించారు. అయితే, ఓడ‌లు బ‌ండ్లయిన‌ట్టుగా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి బోల్లా కొట్టింది. జ‌గ‌న్ సునామీతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ త‌ల‌కింద‌ులైంది. హేమాహేమీలు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్లు కూడా ఓట‌మి పాల‌య్యారు. ప్రధానంగా కొవ్వూరులో ఓడిపోయిన వంగల‌పూడి అనిత‌, గోపాల‌పురంలో ఓట‌మిపాలైన ముప్పిడి వెంక‌టేశ్వర‌రావు, భీమ‌వ‌రంలో ఓడిపోయిన మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు వియ్యంకుడు పుల‌ప‌ర్తి అంజిబాబు, న‌ర‌సాపురంలో ఓడిపోయిన బండారు మాధ‌వ‌నాయుడు, ఆచంట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌, చింత‌ల‌పూడిలో పోటీ చేసి ఓట‌మిపాలైన క‌ర్రా రాజారావు, నిడ‌ద‌వోలులో ఓట‌మి పాలైన బూరుగుప‌ల్లి శేషారావు, పోల‌వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొర‌గం శ్రీ‌నివాస‌రావు, ఉండిలో ఓడిపోయిన వెంక‌ట శివ‌రామ‌రాజుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.వీరిలో చాలా మందికి ప్రజ‌ల్లో వ్యతిరేక‌త ఉంద‌ని తెలిసి కూడా చంద్రబాబు అవ‌కాశం ఇవ్వడాన్ని కింది స్థాయి నాయ‌కులు స‌హించ‌లేక పోతున్నారు. ముఖ్యంగా కొవ్వూరులో వ‌ల‌స‌వ‌చ్చిన నాయ‌కురాలు అనిత‌పై ఇప్పటికీ ప‌రిస్థితి భ‌గ్గుమంటోంది. ఇక, ఓట‌మిపాలైన వీరిలో చాలా మంది వివిధ కారణాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా యాక్టివ్‌గా ఉండే ప‌రిస్థితి లేద‌ని స్పష్ట‌మ‌వుతోంది. ఉండి మాజీ ఎమ్మెల్యే శివ తిరిగి ఉండిలో పోటీ చేస్తే విజ‌యం సాధించేవారే. ఆయ‌న న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవ‌డంతో ఆయ‌న‌లో నిర్వేదం అలుముకుంది. ఇక క‌ర్రా రాజారావు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టే.ఇక గోపాల‌పురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు అభ్యర్థిత్వాన్ని బ‌ల‌మైన వ‌ర్గం ఎన్నిక‌ల‌కు ముందే వ్యతిరేకించింది. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు తిరిగి తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు అప్పగిస్తే పార్టీలో చాలా మంది స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. బండారు మాధ‌వ‌నాయుడు ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంది. గంటా వియ్యంకుడు అంజిబాబు రాజకీయాల‌కు దూర‌మై వ్యాపారం చేసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ఇక బొర‌గం శ్రీనివాస‌రావు ఐదేళ్ల పాటు ప్ర‌జ‌ల్లో ఉండే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఖ‌చ్చితంగా కొత్త‌వారిని ఎంపిక చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం ఇదే జ‌రిగితే.. ఈ నేత‌ల ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వ‌నుంద‌ని అంటున్నారే.

No comments:

Post a Comment