Breaking News

12/07/2019

సున్నా వడ్డీలపై మాటల తూటాలు

విజయవాడ, జూలై 12, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సున్నా వడ్డీపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సున్నా వడ్డీకి రూపాయి కూడా ఇవ్వలేదంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. 2011 నుంచి ఉన్న రుణాలను కూడా మాఫీ చేశామని అన్నారు. పాత రుణాలను కూడా బ్యాంకర్లు మాఫీ చేసినట్టు వెల్లడించారని అన్నారు. తనను రాజీనామా చేయమని అంటారా? ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీపై తన దగ్గరున్న రికార్డ్స్‌ను బయటపెట్టిన చంద్రబాబు.. ప్రజలకు జగన్ ఇప్పుడు సమాధానం చెబుతారా? రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. 
సున్నా వడ్డీలపై మాటల తూటాలు

ఏమీ తెలియకుండా సీఎం అవగాహన లేకుండ మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు. మొత్తం 930 కోట్లు ఇచ్చినట్లు చెప్పిన చంద్రబాబు.. రూ.లక్ష వరకూ సున్నా వడ్డీ , లక్ష దాటితే పావలా వడ్డీకి రుణాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.సున్నా వడ్డీపై సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని, ఇప్పుడేమైనా ఉంటే మాఫీ చేయాలని కోరారు. టీడీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్‌ చేయలేదన్నారు... కరువు మండలాలను ప్రకటించాక రుణాలు రీషెడ్యూల్‌ అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశామని, సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు నిలదీశారు. ‘రాజీనామా చేసి వెళ్లిపోతారా అంటూ మాట్లాడతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అంటారా?’ అంటూ మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలు సభ ముందు ఉంచుతామని.. అప్పుడు సీఎం జగన్‌ రాజీనామా చేస్తారా? క్షమాపణలు చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతకు ముందు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీ నిర్ణయం ప్రకారం ఈరోజు రైతు సమస్యలపై చర్చ జరగాలని... వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై వెనుకడుగు వేయదని చెప్పారు. తప్పుడు ఆధారాలతో సభను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అన్నారు. సున్నా వడ్డీపై టీడీపీ చెబుతున్నవన్నీ కాకిలెక్కలేనని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, 40 ఏళ్ల అనుభవం కాదు, సంస్కారం ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సభలో చంద్రబాబు బెదిరిస్తూ మాట్లాడారని తెలిపారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు

No comments:

Post a Comment