Breaking News

22/07/2019

రాయితీ గ్యాస్ దందా(కరీంనగర్)

కరీంనగర్, జూలై 22 (way2newstv.in): 
రాయితీ గ్యాస్‌ పక్కదారి పడుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. రాయితీ గ్యాస్‌ పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే, నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నవారు మరికొందరు.. ప్రస్తుతం రాయితీ సిలిండర్‌కు రూ.709 కాగా కమర్షియల్‌ సిలిండర్‌కు రూ.1400 ఉండగా బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న కొందరు మినీ సిలిండర్ల వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు కిలోలున్న చిన్న సిలిండర్లలో గ్యాస్‌ నింపి అదనంగా రూ.వెయ్యి వరకు సంపాదిస్తుండగా ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికితోడు రాయితీ గ్యాస్‌ సిలిండర్లను వినియోగదారుకు సంబంధం లేకుండా బుక్‌ చేసి వాటిని పక్కదారి పట్టిస్తున్న పలువురు ఏజెన్సీ నిర్వాహకులకు కొదువ లేదు. రాయితీ సిలిండర్లను కమర్షియల్‌ సిలిండర్లలో తక్కువగా నింపి అక్రమ ఆదాయానికి రుచిమరిగారు. 
రాయితీ గ్యాస్ దందా(కరీంనగర్)

కాగా ప్రభుత్వ అనుమతి లేకున్నా జిల్లా కేంద్రంలోని పలు హోంనీడ్స్‌ దుకాణాల్లో దందా కొనసాగుతోంది. బహిరంగంగా దందా సాగుతున్నప్పటికి పౌరసరఫరాల అధికారులు కిమ్మనకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్వాహకులు మామూళ్లతో కట్టిపడేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.జిల్లాలో రాయితీ గ్యాస్‌తో పాటు మినీ గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్లింగ్‌ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నాలుగేళ్లుగా కేసుల ఊసే లేకపోవడంతో పరోక్షంగా అక్రమానికి సక్రమార్గం చూపినట్లయింది. రాయితీ గ్యాస్‌ను హోటళ్లు, వాహనాలతో యథేచ్చగా వినియోగిస్తుంటే నియంత్రించాల్సిన విభాగం ఏం చేస్తుందన్నది శేష ప్రశ్న.. ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తూ పలు హోంనీడ్స్‌ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్లలో గ్యాస్‌ నింపి  విక్రయాలు సాగిస్తున్నారు. రాయితీ, వాణిజ్య సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి ఈ దందా సాగిస్తున్నారు. మినీ సిలిండర్‌ సైజును బట్టి డబ్బులు గుంజుతున్న నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేవారే కరవయ్యారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌, మంకమ్మతోట, గణేశ్‌నగర్‌, కోతిరాంపూర్‌, పెద్దపల్లి రోడ్‌, కోర్టుచౌరస్తా ఇలా చాలా చోట్ల వందల సంఖ్యలో దుకాణాలున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట, తిమ్మాపూర్‌, మానకొండూరు, గంగాధర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నెెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెడుతూ తర్వాత యథావిధిగా దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నట్లు ప్రచారం. అధికారుల సహకారంతో అక్రమార్కులు ఏటా కోట్లలో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.జిల్లాకేంద్రంలోని పలు హోంనీడ్స్‌ దుకాణాలు అక్రమ గ్యాస్‌ సిలిండర్ల వ్యాపారానికి అడ్డాగా మారాయి. హైదరాబాద్‌ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రాయితీ గ్యాస్‌ ధర రూ.709 కాగా వాణిజ్య గ్యాస్‌ ధర రూ.1400 సదరు సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాంలకు తరలిస్తున్నట్లు సమాచారం. మరికొందరు దుకాణాల్లోనే వెనుక వైపు రీఫిల్లింగ్‌ చేయడం విక్రయించడం చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, యువకులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాయితీ గ్యాస్‌ను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ రూ.వెయ్యి అదనంగా వసూలు చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో షరా మామూలే..!జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా శాశ్వత చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిలిండర్ల రీఫిల్లింగ్‌ ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. నిర్వాహకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గోదాంలతో గ్యాస్‌ నింపే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో కార్లకు గ్యాస్‌ వినియోగం పెరుగుతోంది. పలు ఏజెన్సీల నిర్వాహకులు వీటికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఫోన్‌ చేస్తే చాలు రాయితీ గ్యాస్‌ను వక్రమార్గంలో అందజేస్తున్నారు.

No comments:

Post a Comment