Breaking News

20/07/2019

పాలమూరులో ఏడువందల చెరువులకు జలకళ

మహబూబ్ నగర్, జూలై 20, (way2newstv.in)
పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35లక్షల మంది నివసించే ఈ జిల్లా ప్రజల శ్రమకు ఒక గుర్తింపు ఉంది. అదే పాలమూరు లేబర్. వారు చిందించిన చెమటతో దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. వారి రక్తం అక్కడి మట్టిలో కలసిపోయింది. కానీ పాలమూరు జీవితాలకు వెలుగులిచ్చే, సాగునీటి ప్రాజెక్టులు మాత్రం దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయి, పాలమూరు తరాల తలరాత మాత్రం మారలేదు. అయితే ఇదంతా గత కాలపు చేదు చరిత్ర. కరువుతో, కడగండ్లతో, కష్టాలతో ఏండ్ల తరబడి సహవాసం చేసిన పాలమూరు మట్టి మనుషులకు కొత్త జీవితంలోకి అడుగులేస్తున్నారు. మొత్తము విస్తీర్ణము 43.73 లక్షల ఎకరాలు. ఇందులో సాగుకు యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు.
పాలమూరులో ఏడువందల చెరువులకు జలకళ

రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, గట్టు, చిన్న నీటి చెరువుల కింద సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తమ్మీద తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో మహబూబ్‌నగర్ జిల్లా దశ, వలస జీవుల దిశ మారడం మొదలైంది.అత్యధిక చెరువులున్న జిల్లా కరువు జిల్లాగా, వలసల జిల్లాగా మారడం ఒక విచిత్రం, విషాదం. పాలమూరు గోస తీర్చేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కింద మహబూబ్ నగర్ జిల్లా చెరువుల పునరుద్ధరణ జరిగింది. పునరుద్ధరణ జరిగిన చెరువులను ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేయడంతో వాటికి పూర్వ వైభవం వచ్చింది. జిల్లాలో దాదాపు 700లకు పైగా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. దీనికి తోడు గత ఆరేళ్లుగా వాటర్ షెడ్ కార్యక్రమాల్లో చేపట్టిన జలసంరక్షణ పనులు కూడా పాలమూరు పచ్చగా మారడానికి కారణమయ్యాయి.మొన్నటి దాకా వలసల జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆరు లక్షల ఎకరాల బీడు భూములకు సాగు జలాలు అందాయి. కొత్తగా ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు వాటి ద్వారా చెరువులు, కుంటలు నుండి అదనంగా ఆరు లక్షల ఎకరాలు పచ్చబడ్డాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద అదనంగా 25 వేలు, సంగంబండ, భీమా ప్రాజెక్టుల కింద 1.25 వేలు, కల్వకుర్తి కింద లక్ష ఎకరాలు, మిషన్ కాకతీయలో చెరువుల కింద 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయి.

No comments:

Post a Comment