గవర్నర్ గా నరసింహన్ రికార్డ్
హైద్రాబాద్, జూలై 15, (way2newstv.in)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ గొప్ప రికార్డ్ సాధించారు. 2009 డిసెంబర్ నెలలో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఆయనను నాటి యూపీయే సర్కార్ నియమించింది. అప్పట్లో తెలంగాణా ఉద్యమం చాల దూకుడుగా సాగుతోంది. మరో వైపు పెద్దాయన రోశయ్య అపుడే పాలనా పగ్గాలు చేపట్టారు. మొత్తం పరిస్థితి ఆయనకు ఎక్కడా అంతు చిక్కడంలేదు. ఆయన ఢిల్లీ ఆదేశాలను అమలు చేసే ఓ మర యంత్రంగా నాడు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. సంక్షోభం చాలా పెరిగిపోయిన దశలో ముఖ్యమంత్రికి సహాయంగా ఉండడానికి సమర్ధుడైన గవర్నర్ గా భావించి నరసింహన్ ని యూపీయే సర్కార్ పంపించింది. ఆయన పూర్వాశ్రమంలో పోలీస్ అధికారి కూడా కావడంతో ఆయన అనుభవం నాడు బాగా అక్కరకు వచ్చాయి. అగ్గి రాజుకున్న ఉమ్మడి ఏపీని చాలా వరకూ చక్కబెట్టడంతో గవర్నర్ నరసింహన్ నాడు నిర్వహించిన పాత్ర మెచ్చదగినదే.ఇక గవర్నర్ నరసింహన్ పదేళ్ళ పాటు సుదీర్ఘంగా రాజ్ భవన్లో ఉండడం అంటే అరుదైనదిగానే భావించాలి.
పదేళ్ల... ఐదు రోజులు
యూపీయే సర్కార్ 2014లో దిగిపోయినా కూడా ఆయన బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ, నాటి హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ కి కూడా సన్నిహితంగా ఉండడం విశేష పరిణామం. అదే విధంగా ప్రస్తుత హోం మంత్రి అమిత్ షాకు కూడా ఆయన దగ్గరవాడుగా ఉన్నారు. ఇదంతా గవర్నర్ నరసింహన్ సమర్ధత, ముందుచూపు, పాలనా దక్షత, విశ్వసనీయతకు అద్దం పడతాయి. భిన్న ధ్రువాలైన రెండు పెద్ద జాతీయ పార్టీలకు ఒకే సమయంలో ఇష్టుడుగా ఉండడం అంటే మాటలు కాదు, ఇదే గవర్నర్ నరసింహన్ లోని లౌక్యాన్ని, చాకచక్యాన్ని తెలియచేస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి రాజనీతికి తీసిపోని విధంగా గవర్నర్ గా నరసింహన్ దూకుడు ప్రదర్శించారని చెప్పాలి. ఇక గవర్నర్ గా పుష్కర కాలం పాటు ఆయన పనిచేసినట్లు అయింది. అంతకు ముందు ఆయన 2007 నుంచి చత్త్తిస్ ఘడ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఇది కూడా ఓ రికార్డు. దేశంలో రాజకీయాలతో సంబంధం లేని ఓ మాజీ బ్యూరోక్రాట్ ఇంత ఎక్కువ కాలం రాజ్ భవన్ లో ఉన్నారంటే అది ఆయన వ్యక్తిగత ప్రతిభగానే చూడాలి.ఇక గవర్నర్ నరసింహన్ అయిదుగురు ముఖ్యమంత్రులతో కలసి పనిచేశారు. నలుగురి చేత సీఎం లుగా ప్రమాణం చేయించారు. రోశయ్య చేత నాటి గవర్నర్ ఎండీ తివారి ప్రమాణం చేయించినా రోశయ్యతో కలసి గవర్నర్ గా నరసింహన్ పనిచేశారు. ఆ తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కేసీయార్, వైఎస్ జగన్ ల చేత ప్రమాణం చేయించారు . ఇక దేశంలో మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ వంటి ఇద్దరు ప్రధానుల అభిమానం చూరగొన్నారు. ఇద్దరు రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాధ్ కోవింద్ ల వద్ద పనిచేశారు. ఇన్నేళ్ల పదవీ కాలంలో ఆయన కచ్చితమైన మనిషిగానే వ్యవహరించారు.కాగా, జూలై 10తో ఆయన పదవీ కాలం ముగిసింది. ఇప్పటికి అనేకసార్లు ఆయన పదవిని పొడిగించిన కేంద్రం ఇక నరసింహన్ ను కొనసాగించదని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. అదే సమయంలో నరసింహన్ సేవలను కేంద్రం వేరే విధంగా ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. అంటే గవర్నర్ నరసింహన్ ఏపీ నుంచి వెళ్తున్నారు తప్ప ఆయన సేవల నుంది ఇప్పటికీ రిటైర్ కారన్నమాట. డెబ్బయి నాలుగేళ్ళ ఏళ్ల ఈ సీనియర్ సిటిజన్ తెలుగు వారికి బాగా గుర్తుండిపోతారనడమో సందేహం లేదేమో.
No comments:
Post a Comment