Breaking News

31/07/2019

జమిలీ పై టీడీపీ ఆశలు

విజయవాడ, జూలై 31, (way2newstv.in -Swamy Naidu)
జగన్ సర్కార్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు, ఆ తరువత ఎపుడు ఎన్నికలు జరిగినా వచ్చేది కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. ఇదీ తమ్ముళ్ల మాట. వారి మెదళ్ళలో ఈ మాటను ఎక్కించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పడిన కష్టం ఫలించింది. ఇపుడు ఇది క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్ళి కార్యకర్తలను కూడా నమ్మించాలన్నదే టీడీపీ అధినాయకత్వం విశ్వప్రయత్నం. ఇప్పటికే రాయసీమకు చెందిన టీడీపీ నాయకులు జగన్ ది అర్ధాయుష్షు ప్రభుత్వమని పార్టీ మీటింగులలో ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ వారసులు ఇపుడు ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు చెబుతూ మళ్ళీ మనదే జెండా అని నూరిపోతున్నారు. జేసీ దివాకరెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి జగన్ ప్రభుత్వం రెండు నెలలోనే రంగు రుచి అంతా తెలిసిపోయిందని, ఆయన ఏమీ చేయలేడని తేల్చేశారు. ఇదే వరసలో కర్నూలు నాయకులు కూడా ఉన్నారు.
 జమిలీ పై టీడీపీ ఆశలు
జగన్ అసమర్ధ పాలకుడు అంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బీకే పార్ధసారధి. జగన్ ప్రభుత్వం బాబు అయిదేళ్ల అభివ్రుధ్ధిని కేవలం రెండు నెలల్లోనే సర్వ నాశనం చేసిందని కూడా అయన హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో మనమే విజేతలమని ఆయన అపుడే ఢంకా భజాయించేస్తున్నారు. అయిదేళ్ళు ఈ ప్రభుత్వం ఉండదు, అందువల్ల కార్యకర్తలంతా ఇప్పటి నుంచే కష్టపడితే చంద్రబాబు అయిదేళ్ళ పాలనను తెచ్చుకోవచ్చునని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఇక ఈ రకమైన ప్రచారం కోస్తా జిల్లాల టీడీపీ నేతలు కూడా మొదలెట్టేశారు. బాబు మోడీని ఎన్ని తిట్టినా ఇపుడు ఆయనే టీడీపీకి దిక్కూ దైవంలా కనిపిస్తున్నారు. మోడీతో యుధ్ధం అంటూ చంద్రబాబు నిన్నటి వరకూ హడావుడి చేసినా ఇపుడు మోడీయే తమ నెత్తిన పాలు పోస్తారన్న ఆశతో ఉన్నారట. అదెలా అంటే జమిలి ఎన్నికలకు మోడీ సిధ్ధపడుతున్నారు.దేశ‌మంతా ఒకేసారి ఎన్నికలు పెట్టాలన్నది బీజేపీ విధానంగా ఉంది. అందుకోసం లోక్ సభలో బంపర్ మెజారిటీ బీజేపీకి ఉన్నా రాజ్యసభలో మాత్రం కొరత ఉంది. అయితే 2021 నాటికి అక్కడ కూడా పూర్తి బలం ఆ పార్టీకి వస్తుంది. దాంతో ఉభయ సభల్లోనూ జమిలి ఎన్నికల బిల్లుని సులువుగా పాస్ చేయించుకోగలుగుతుంది. అదే విధంగా దేశంలో ఇప్పటికి 17 రాష్ట్రాల్లో బీజేపే అధికారంలో ఉంది. అందువల్ల సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ బిల్లుకు ఆమోద‌ ముద్ర పడితే రాజ్యాంగ సవరణ జరిగి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి. ఇలా బిల్లు ఆమోదం పొందగానే అలా 2022 లో కానీ 2023 లో కానీ దేశమంతా ఎన్నికలు ఒకేమారు జరుతాయి. ఏపీలో ఉన్న జగన్ సర్కార్ కి 2024 వరకూ కాలపరిమితి ఉన్నా ముందే ఎన్నికలు వచ్చేస్తాయి. సరిగ్గా ఈ ఆశతోనే ఇపుడు చంద్రబాబులో కొత్త చిగుళ్ళు వేస్తోంది. చంద్రబాబు నూరిపోసిన ముందస్తు ఎన్నికల సిధ్ధాంతాన్ని క్యాడర్ కి చేరవేయడం ద్వారా పార్టీని కాపాడుకోవాలని, మళ్ళీ గెలిచేందుకు వ్యూహాలను రూపొందించుకోవాలని చంద్రబాబు బిజీగా ఉన్నారిపుడు. ఇంతకీ మోడీ ముందస్తు ఎన్నికలు పెడతారా లేక మరో రెండేళ్ళు ముందుకు పొడిగిస్తారా. అదే కదా ఇపుడు పెద్ద డౌట్…

No comments:

Post a Comment