Breaking News

12/07/2019

చంద్రబాబు యుద్ధమే

విజయవాడ, జూలై 12 (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ సర్కార్ ను ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. తొలుత చంద్రబాబునాయుడు జగన్ పాలనను ఆరు నెలల పాటు వేచి చూద్దామని పార్టీ నేతలకు చెప్పారు. ఆరు నెలల పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సి ఉంటుందని, వారి నిర్ణయాలు, విధానాలు బహిర్గతమైన తర్వాత పోరాటాలను ప్రారంభిద్దామని చంద్రబాబునాయుడు తొలుత భావించారు.అయితే తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో 23 అంశాలను చేర్చారు. ఈ 23 అంశాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకున పెట్టేవిగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికి తీసే ఉద్దేశ్యంతోనే ఈ 23 అంశాలపై చర్చ జరపాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ధ్యేయంగా ఉన్నట్లు చంద్రబాబునాయుడు గుర్తించారు.
చంద్రబాబు యుద్ధమే

చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడాలని నిర్ణయించారు. వైసీపీ సర్కార్ వచ్చీ రావడంతోనే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు కోతలు అమలు చేశాయని, తమ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్తును ఇచ్చామంటున్నారు. అలాగే రైతులకు విత్తనాలను సరఫరా చేయడంలోనూ వైసీపీ సర్కార్ విఫలమయిందని ఆరోపిస్తున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలు నిలిచిపోయాయని, పారిశ్రామికవేత్తలకు కూడా జగన్ ప్రభుత్వం తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో వెల్లడిస్తున్నారు. ఈ సమావేశాల్లో వీటిపై చంద్రబాబు జగన్ ను నిలదీయాలని నిర్ణయించారు.అయితే చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఏకాకిగా మారిపోయినట్లు కన్పిస్తుంది. జూనియర్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఆయన తొలి బడ్జెట్ సమావేశాలు జరిగిన రోజే స్పీకర్ పైన కూడా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. తమకు అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్ పై చిందులు తొక్కారు. మరోవైపు వైఎస్ జగన్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇచ్చారు. ఆరు నెలల పాటు వేచి చూద్దామన్న చంద్రబాబు తనపై జరుగుతున్న విమర్శల దాడిని తట్టుకోలేక 45 రోజులకే యుద్ధం ప్రకటించారు.

No comments:

Post a Comment