Breaking News

27/07/2019

టీ బీజేపీకి కొత్త బాస్

హైద్రాబాద్, జూలై 27.(way2newstv.in)
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ... ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ... మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి తెలంగాణలో మరింతగా ఎదగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై ఆ పార్టీ అధినాయక త్వం దృష్టి పెట్టినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బీజేపీ... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది. అయితే ఆయనకు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం కష్టమే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 టీ బీజేపీకి కొత్త బాస్

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆ పార్టీలోని పలువురు నాయకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో పాటు మాజీమంత్రి డీకే అరుణ కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై కన్నేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెను కవితను ఓడించిన వ్యక్తిగా అరవింద్‌కు బీజేపీలో మంచి గుర్తింపు వచ్చింది. దీనికి తోడు బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడం ఆయనకు కలిసొచ్చే విషయం. మరోవైపు తెలంగాణలో కీలకమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించవచ్చనే భావనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకోసం ఈ ఇరువురు నాయకులు మధ్య పోటీ ఎక్కువైతే మాత్రం... మధ్యేమార్గంగా మరో నాయకుడికి బీజేపీ నాయకత్వం రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్న ఆ పార్టీ పెద్దలు... ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

No comments:

Post a Comment