విజయవాడ, జూలై 23, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు కొత్త నిర్వచనమిస్తోంది. ఉన్నత చదువులు చదవాలి అనే ఆశ ఉండి, స్థోమత లేనివారికి విదేశీ చదువులలో సహాయం చేస్తూ, వారు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు.ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు అర్హత పొంది... పేదరికంలో ఉన్నవారికి సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.బీసీలతో పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బ్రాహ్మణ, కాపు విద్యార్ధులే కాక, మిగితా కులాల్లో వెనకబడిన వారికి కూడా ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పేరుతో కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అర్హులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
బీసీ వర్గాలకు వరంగా విద్యారుణం
అర్హులైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకుగాను... రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. విదేశాల్లో పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు చేసే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆయా అభ్యర్థులకు అంతే మొత్తంలో బ్యాంకు లోను పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలను అధికారులు అందిస్తారు. విమాన ప్రయాణం ఛార్టీలు చెల్లిస్తారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులను విదేశీ విద్యకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేసింది.ఆ పథకం కింద ఏడాదికి ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు. వారి కుటుంబ సభ్యుల ఆదాయం ఆరు లక్షలకు మించరాదు. ఏటా జులై1 నాటికి ఈ స్కీము కింద చదువుకునే వారి వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎన్టీఆర్ విద్యాదరణ పథకం కింద రెండు దఫాలుగా ఫీజు చెల్లిస్తారు. విదేశాల్లో విద్య కోసం అనుమతి పొందిన వారికి మొదట దఫా కింద రూ. 5 లక్షలు చెల్లిస్తారు. మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత రెండో దఫా మొత్తం రూ. 5 లక్షలను చెల్లిస్తారు. ఈ పథకం కింద విద్యార్థులు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, చైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. ఫిలిప్పీన్స్, కజికిస్తాన్, చైనా లో కేవలం వైద్య సంబంధిత కోర్సులకు మాత్రమే అనుమతిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్‌సైన్స్, అగ్రికల్చరల్, నర్సింగ్, ఫార్మసీ, సామాజిక శాసా్త్రల్లో విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలుచేస్తారు.విదేశీ విద్య చదవాలంటే విద్యార్టే ఆయా దేశాలకు సంబంధించిన టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఇ., జీమ్యాట్ వంటి పరీక్షల్లో అర్హత కలిగి ఉండాలి. ఆ యూనివర్సిటీ నుంచి ప్రవేశం పొందేందుకు విద్యార్దే సొంతంగా అనుమతి సాధించాల్సి ఉంది. చెల్లుబాటు పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఆ దేశ వీసాను పొంది ఉండాలి. అనంతరం ఆయా వర్గాలను బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు విదేశీ విద్య నిధి కింద ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర కమిటీ విదేశీ అవకాశం కల్పిస్తుంది. డిగ్రీ కోర్భుల్లో కేవలం ఎం.బి.బి.ఎస్. చదివేందుకు అవకాశం ఉంది. మిగిలినవి పీజీ కోర్సులైన ఎం.ఎస్, ఎంటెక్, పి. హెచ్.డి, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ వంటి పీజీ కోర్సుల్లో చదివే అవకాశం ఉంది.ఈ ప్రక్రియ అంతా అన్లైన్లో జరుగుతుంది. నేరుగా విద్యార్థి ఖాతాకు ఈ నిధులు జమ చేస్తారు. కోర్స్ మొత్తానికి ఈ నిధులు వినియోగించేలా వీటిని మంజూరు చేస్తారు. యూనివర్సిటీలో ఉత్తమ ప్రతిభ చూపితే మరింత ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తారు. ఈ పథకాలను వినియోగించుకోకుండా నేరుగా విదేశాల్లో చదువుతున్న వారు సైతం రెండో సంవత్సరంలోనైనా ఈ పథకానికి దరఖాస్తు చేసి, ఉపకార వేతనాలు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుతుండటంతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
No comments:
Post a Comment